Metro: మెట్రో రెండో దశకు.. నేడు ముఖ్యమంత్రి శంకుస్థాపన

ABN , First Publish Date - 2022-12-09T02:29:02+05:30 IST

విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్‌ అభివృద్ధిలో మరో కీలక ఘట్టానికి శుక్రవారం తెరలేవనుంది. మెట్రో రెండో దశలో భాగంగా... రాయదుర్గం రహేజా మైండ్‌ స్పేస్‌ జంక్షన్‌ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు చేపడుతున్న పనులకు భూమి పూజ జరగనుంది.

Metro: మెట్రో రెండో దశకు..  నేడు ముఖ్యమంత్రి   శంకుస్థాపన

మైండ్‌ స్పేస్‌ వద్ద కేసీఆర్‌ భూమి పూజ

అనంతరం బహిరంగ సభలో ప్రసంగం

ఎయిర్‌పోర్ట్‌ కారిడార్‌ పనులు షురూ

8-9 స్టేషన్లు.. గంటకు 120 కి.మీ వేగం

మూడేళ్లలో అందుబాటులోకి

మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి వెల్లడి

హైదరాబాద్‌ సిటీ, డిసెంబర్‌ 8 (ఆంధ్రజ్యోతి): విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్‌ అభివృద్ధిలో మరో కీలక ఘట్టానికి శుక్రవారం తెరలేవనుంది. మెట్రో రెండో దశలో భాగంగా... రాయదుర్గం రహేజా మైండ్‌ స్పేస్‌ జంక్షన్‌ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు చేపడుతున్న పనులకు భూమి పూజ జరగనుంది. ఈ కారిడార్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారు. రూ.6,250 కోట్ల వ్యయంతో 31 కిలోమీటర్ల పొడవున ఈ లైన్‌ను నిర్మిస్తారు. దీంతో శంషాబాద్‌ విమానాశ్రయానికి వెళ్లేవారికి సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఉదయం 10 గంటలకు భూమి పూజ చేసిన అనంతరం, తెలంగాణ పోలీస్‌ అకాడమీలో జరిగే బహిరంగ సభలో సీఎం పాల్గొననున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను చేవేళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్‌ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు పోలీస్‌ అకాడమీ ప్రహారీని మూడు చోట్ల తాత్కాలికంగా తొలగించారు. అనంతరం ఎంపీ రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం సభలో 30వేల మంది పాల్గొంటారని తెలిపారు. కాగా... మైండ్‌స్పే్‌స-శంషాబాద్‌ మెట్రో లైన్‌ పనులను హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రో లిమిటెడ్‌ (హెచ్‌ఏఎంల్‌) ఆధ్వర్యంలో చేపడుతున్నారు. మూడేళ్లలో దీన్ని పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మెట్రో మార్గంలో టౌన్‌షి్‌పలు, ప్రయాణీకుల రద్దీ ఆధారంగా స్టేషన్లను నిర్మిస్తారు.

మైండ్‌స్పేస్‌ తర్వాత బయోడైవర్సిటీ, నానక్‌రామ్‌గూడ, నార్సింగి, తెలంగాణ పోలీస్‌ అకాడమీ, రాజేంద్రనగర్‌, శంషాబాద్‌ టౌన్‌, ఎయుర్‌పోర్టు కార్గోస్టేషన్‌, టర్మినల్‌ వద్ద స్టేషన్లను నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఓఆర్‌ఆర్‌ నిర్మించిన సమయంలోనే రైట్‌ ఆఫ్‌ వే ఉన్నందున, మెట్రో పనులకు ఎలాంటి అడ్డంకులు ఉండవని అధికారులు భావిస్తున్నారు. కాగా.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు ప్రస్తుతం రోజూ 40 పుష్పక్‌ ఎలక్ర్టిక్‌ ఏసీ బస్సులను నడిపిస్తున్నారు. వీటిలో రోజూ సుమారు 5వేల మంది ప్రయాణిస్తుంటారు. శని, ఆదివారాల్లో రద్దీ అధికంగా ఉంటుంది. అలాగే జేబీఎస్‌, మియాపూర్‌, సికింద్రాబాద్‌ ప్రాంతాల నుంచి వెళ్తున్న బస్సుల్లో శంషాబాద్‌ విమానాశ్రయం వరకు వెళ్లేవారు 1,000 నుంచి 1,500 మంది వరకు ఉంటారు. అలాగే ఓఆర్‌ఆర్‌ పక్కన ఉన్న గ్రామాల ఉద్యోగులు, ప్రజలు వందలాదిగా బస్సులు, క్యాబ్‌ల్లో నిత్యం నగరానికి వచ్చివెళ్తుంటారు. ఈ నేపథ్యంలో... మెట్రో ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్‌ కారిడార్‌ ద్వారా విదేశాలు వెళ్లేవారితోపాటు నానక్‌రామ్‌గూడ, నార్సింగి, పోలీస్‌ అకాడమీ, శంషాబాద్‌ గ్రామాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందనుంది.

ఎయిర్‌పోర్టు మెట్రో వేగం 120 కిలోమీటర్లు: ఎన్వీఎస్‌ రెడ్డి

నగరంలో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్‌ కారిడార్‌లో కమ్యూనికేషన్‌ బేస్డ్‌ ట్రైన్‌ కంట్రోల్‌ (సీబీటీసీ) సాంకేతికతను వినియోగిస్తామని హైదరాబాద్‌ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం గంటకు 35 కిలోమీటర్ల వేగంతో రైళ్లు నడుస్తున్నాయని, ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్‌ మార్గంలో మాత్రం గంటకు 120 కిలోమీటర్ల వేగంతో రైళ్లు నడిచేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. ఈ మేరకు రసూల్‌పురలోని మెట్రోభవన్‌లో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దీన్ని అనుసరించి.. కేవలం 26 నిమిషాల్లోనే ప్రయాణికులు విమానాశ్రయానికి చేరుకునేలా ఏర్పా ట్లు ఉంటాయి. ఎయిర్‌పోర్టు కారిడార్‌ మార్గంలో సుమారు 4 నుంచి 5 కిలోమీటర్లకు ఒక స్టేషన్‌ను ఏర్పాటు చేసే విధంగా డీపీఆర్‌ను రూపొందించారు. మొత్తంగా 8 నుంచి 9 స్టేషన్లను నిర్మించే అవకాశముంది. 27 కిలోమీటర్లు ఎలివేటెడ్‌ (ఆకాశమార్గంలో), ఒక కిలోమీటరు రోడ్‌ లెవెల్‌లో, 2.5 కిలోమీటర్ల వరకు భూగర్భ మార్గంలో (అండర్‌గ్రౌండ్‌) ట్రాక్‌ నిర్మాణం ఉంటుంది. అలాగే మైండ్‌ స్పేస్‌ జంక్షన్‌ స్టేషన్‌లో విదేశాలకు వెళ్లేవారి లగేజీలను చెకిన్‌ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తారు. భూసేకరణ పూర్తయితే మెట్రో పనులను మూడేళ్లలో పూర్తి చేసే అవకాశముందని ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు.

Updated Date - 2022-12-09T02:29:03+05:30 IST