CIT: సిట్‌కు ఎదురుదెబ్బ

ABN , First Publish Date - 2022-12-07T02:33:50+05:30 IST

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందాని (సిట్‌)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌, కేరళకు చెందిన రాజకీయ పార్టీ నేత తుషార్‌ వెల్లపల్లి, వైద్యుడు జగ్గు స్వామి, కరీంనగర్‌కు చెందిన న్యాయవాది భూసారపు శ్రీనివాస్‌లను నిందితులుగా చేర్చాలని పేర్కొంటూ సిట్‌ దాఖలు చేసిన మెమోను ఏసీబీ కోర్టు మంగళవారం తిరస్కరించింది.

CIT: సిట్‌కు ఎదురుదెబ్బ

సంతోష్‌, తుషార్‌, జగ్గుస్వామి, శ్రీనివాస్‌లను నిందితులుగా చేర్చాలన్న మెమో కొట్టివేత

అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన

కేసు దర్యాప్తు అధికారం సిట్‌కు లేదు

ఏసీబీ న్యాయస్థానం స్పష్టీకరణ

ఆ నలుగురికీ వ్యతిరేకంగా ఎలాంటి

ప్రాథమిక ఆధారాలూ లేవు

నిందితుల వాంగ్మూలాల్లోనూ

వారి ప్రస్తావన లేదని స్పష్టీకరణ

ఏసీబీ దర్యాప్తు చేయని కేసు

తమ పరిధిలోకి రాదని వ్యాఖ్య

హైదరాబాద్‌, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందాని (సిట్‌)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌, కేరళకు చెందిన రాజకీయ పార్టీ నేత తుషార్‌ వెల్లపల్లి, వైద్యుడు జగ్గు స్వామి, కరీంనగర్‌కు చెందిన న్యాయవాది భూసారపు శ్రీనివాస్‌లను నిందితులుగా చేర్చాలని పేర్కొంటూ సిట్‌ దాఖలు చేసిన మెమోను ఏసీబీ కోర్టు మంగళవారం తిరస్కరించింది. శాంతిభద్రతల పోలీసులు గానీ, సిట్‌ గానీ అవినీతి నిరోధక చట్టం కేసులను దర్యాప్తు చేయలేవని స్పష్టం చేసింది. నిందితుల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. అవినీతి నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేసే అధికారం సాధారణ పోలీసులకు లేదన్నారు. ప్రభుత్వం ప్రత్యేక జీవో ద్వారా ఒక ప్రాంతాన్ని మెట్రోపాలిటన్‌ ఏరియాగా గుర్తించినప్పుడు శాంతిభద్రతల విభాగం పోలీసులు కూడా కేసు పెట్టవచ్చని.. అయితే ఏసీపీ స్థాయి అధికారి మాత్రమే ఈ కేసు నమోదు చేయగలరని పేర్కొన్నారు. కేసు పెట్టిన ఏసీపీ స్థాయి అధికారి దాన్ని వెంటనే ఏసీబీకి బదిలీ చేయాలని తెలిపారు. ప్రస్తుతం అలాంటి ప్రత్యేక జీవో ఏదీ లేదు కాబట్టి శాంతిభద్రతల విభాగం పోలీసులకు అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసే అధికారం లేదని స్పష్టం చేశారు. మరోవైపు సిట్‌ను ఏర్పాటు చేసినంత మాత్రాన అవినీతి నిరోధక చట్టం కింద కేసు దర్యాప్తు చేసే అధికారం దానికి ఉండదని పేర్కొన్నారు. ఏసీబీ దర్యాప్తు చేయని కేసులను ప్రత్యేక కోర్టు అయిన ఏసీబీ కోర్టుకు విచారించే పరిధి లేదని తెలిపారు. సిట్‌ తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదనలు వినిపిస్తూ.. అవినీతి నిరోధక చట్టం కింద కేసు పెట్టినప్పటికీ కేసును దర్యాప్తు చేసే అధికారం సిట్‌కు ఉంటుందని చెప్పారు.

ఆ నలుగురికి వ్యతిరేకంగా ఆధారాలేవీ..?

ఇరువర్గాల వాదనలు నమోదు చేసుకున్న ఏసీబీ న్యాయస్థానం.. రామచంద్ర భారతి, నందకుమార్‌, సింహయాజి ఇచ్చిన వాంగ్మూలాల్లో సంతోష్‌, తుషార్‌, జగ్గుస్వామి, శ్రీనివా్‌సల పాత్ర ఉన్నట్లు ఎక్కడా పేర్కొనలేదని తెలిపింది. ప్రతిపాదిత నిందితులకు వ్యతిరేకంగా ఆధారాలు చూపడం దర్యాప్తు అధికారి కనీస బాధ్యత అని.. అలాంటి ఆధారాలేవీ చూపలేదని గుర్తుచేసింది. ఎఫ్‌ఐఆర్‌లో గానీ, రిమాండ్‌ రిపోర్ట్‌లో గానీ, మొదటి ముగ్గురు నిందితుల స్టేట్‌మెంట్లలో గానీ ఈ నలుగురికీ వ్యతిరేకంగా ఎలాంటి ఆరోపణలూ లేవని స్పష్టం చేసింది. అవినీతి నిరోధక చట్టం సెక్షన్‌ 17 ప్రకారం కేసు నమోదు చేసే, దర్యాప్తు చేసే, నిందితులను అరెస్టు చేసే అధికారం సాధారణ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌కు లేదని తేల్చిచెప్పింది.

2003లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏసీబీ కోర్టు పరిధిని నిర్ధారిస్తూ జీవోలు జారీ చేసిందని.. దాని ప్రకారం ఏసీబీ మాత్రమే అవినీతి నిరోధక చట్టం కేసులను దర్యాప్తు చేయగలదని తెలిపింది. శాంతిభద్రతల పోలీసులు గానీ, సిట్‌ గానీ అవినీతి నిరోధక చట్టం కేసులను దర్యాప్తు చేయలేవని స్పష్టం చేసింది. అవినీతి నిరోధక చట్టం సెక్షన్‌ 4 ప్రకారం ప్రత్యేక ఏసీబీ కోర్టులు మాత్రమే విచారించగలవని తెలిపింది. ఏసీబీ మాత్రమే అవినీతి నిరోధక చట్టం కేసులను దర్యాప్తు చేయగలదని.. ఏసీబీ కేసు నమోదైన సందర్భంలోనే తమకు విచారణ చేపట్టే పరిధి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ అంశాల ఆధారంగా సిట్‌ దాఖలు చేసిన మెమోను తిరస్కరిస్తున్నట్లు ఏసీబీ న్యాయస్థానం తెలిపింది.

Updated Date - 2022-12-07T02:34:04+05:30 IST