మేడిగడ్డ బ్యారేజీకి పెరుగుతున్న వరద

ABN , First Publish Date - 2022-07-05T05:32:49+05:30 IST

మేడిగడ్డ బ్యారేజీకి పెరుగుతున్న వరద

మేడిగడ్డ బ్యారేజీకి పెరుగుతున్న వరద

45,580 క్యూసెక్కుల నీరు 

16 గేట్ల ఎత్తి వేత.. దిగువకు 43,570 క్యూసెక్కులు

నిల్వ ఉన్న 9.63 టీంఎసీలు  

మహదేవపూర్‌ రూరల్‌, జూలై 4 : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మండలంలో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీకి వరదనీ రు పెరుగుతోంది. ఆదివారం సాయంత్రం వరకు బ్యారేజీలోకి ఇన్‌ఫ్లో 14వేల క్యూసెక్కులు ఉండగా సోమవారం సాయం త్రం 45వేల 580 క్యూసెక్కులకు చేరింది. దీంతో ఆదివారం వరకు 10 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేసిన అధికారులు సోమ వారం మరో ఆరు గేట్లను ఎత్తారు. మొత్తంగా 16 గేట్లను ఎత్తి దిగువకు 43,570 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. రెండు రోజులుగా ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో బ్యారేజీకి ఇన్‌ఫ్లో పెరుతోందని అధికారులు తెలిపారు. ఇది మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.  సోమవారం బ్యారేజీలో నీటి నిల్వ 9.63 టీఎంసీలు ఉండగా నీటిమ ట్టం 9.1మీటర్లుగా నమోదైనట్టు చెప్పారు. 

లోతట్టు ప్రాంతాలకు హెచ్చరికలు 

గోదావరి నదిపై నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీకి వరదనీరు పోటెత్తుతుండటంతో బ్యారేజీ 85గేట్లలో సోమవారం వరకు 16గేట్లను ఎత్తివేశారు. దీంతో దిగువకు 45వేల క్యూసెక్కుల మేర నీరు విడుదలవుతోంది. ఇంతకు ముందు గేట్లు మూసి ఉంచడటంతో దిగువ ప్రాంతాల్లో నీటి పారుదల తక్కువగా ఉండగా గేట్లు ఎత్తడంతో వరద ప్రవాహం పెరుతోంది. దీంతో బ్యారేజీకి దిగువన ఉన్న అంబట్‌పల్లి, లెంకలగడ్డ, పంకెన, సర్వాయిపేట, పలిమెల, దమ్మూర్‌, ముకునూర్‌, నీలంపల్లి, ఇచ్చంపల్లి తదితర గ్రామాలతో పాటు మహారాష్ట్రకు సరిహద్దుగా ఉన్న గ్రామాలకు హెచ్చరికలు జారీ చేశారు. నీటి ప్రవాహం అధికంగా ఉన్న నేపథ్యంలో గోదావరి తీర ప్రాంతాల్లోకి ప్రజలు ఎవరూ అటువైపు వెళ్లొద్దని సూచించారు. పశువుల కాపపరులు, జాలర్లు గోదావరి తీరంలోకి వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. 

Read more