‘ఆదర్శ’ పాఠశాలలు

ABN , First Publish Date - 2022-03-05T06:01:56+05:30 IST

‘ఆదర్శ’ పాఠశాలలు

‘ఆదర్శ’ పాఠశాలలు

ఆరు నుంచి పదో తరగతి వరకు అడ్మిషన్లు

మార్చి 10వరకు ఆన్‌లైన్‌  ప్రవేశాలకుదరఖాస్తుల స్వీకరణ

ఏప్రిల్‌ 17న ప్రవేశ పరీక్ష 

జిల్లాలో 8 పాఠశాలలు 800 సీట్లు

‘మోడల్‌’ పాఠశాలలపై ఆసక్తి చూపుతున్న తల్లిదండ్రులు


కేసముద్రం, మార్చి 4 : కార్పొరేట్‌ నమూనాలో అన్ని వసతులు, హంగులతో ఏర్పాటు చేసిన ఆదర్శ పాఠశాలల్లో 2022-23 విద్యాసంవత్సరానికి 6 నుంచి 10వ తరగతి సీట్ల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం అడ్మిషన్‌ కోసం తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మోడల్‌ స్కూళ్లలో మెరుగైన వసతులతోపాటు పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలోనే బోధన అందిస్తుండడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించేందుకు అమిత ఆసక్తి కనబరుస్తున్నారు. పేద, మధ్య తరగతి వర్గాల తల్లిదండ్రులు ప్రైవేటులో ఫీజులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నవారికి ఆదర్శ పాఠశాల వరంగా మారింది. దీంతో ఏటా ఈ ప్రవేశ పరీక్షకు పోటీ అధికంగా ఉంటోంది. 6వ తరగతి ప్రవేశపరీక్ష రాసేందుకు ఫిబ్రవరి 8 నుంచి మార్చి 10వ తేదీ వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు. మహబూబాబాద్‌ జిల్లాలో మహబూబాబాద్‌, తొర్రూరు, మరిపెడ, నర్సింహులపేట, కురవి, డోర్నకల్‌, కేసముద్రం, నెల్లికుదురు మండలాల్లో ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. మండలాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని ఆయా పాఠశాలల్లో 2022-2023 విద్యాసంవత్సరానికి సంబంధించి ఆరో తరగతిలో 100 సీట్ల చొప్పున జిల్లాలో 800 సీట్లను భర్తీ చేయనున్నారు. అలాగే 7 నుంచి 10 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్‌, రిజర్వేషన్‌ఆధారంగా సీట్లను భర్తీ చేస్తారు. 


ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు...

విద్యార్థులు కేవలం ఆన్‌లైన్‌ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం ప్రస్తుతం చదువుతున్న పాఠశాల నుంచి బోనఫైడ్‌ సర్టిఫికెట్‌ తీసుకోవాలి. దీంతో పాటు ఆధార్‌కార్డు, కులం, ఆదాయ ద్రువీకరణపత్రాలతో సమీపంలోని మీసేవ, ఆన్‌లైన్‌ సెంటర్‌, స్వయంగానైనా దరఖాస్తు చేసుకునే వీలుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రూ.75లు, ఓసీలకు రూ.150 దరఖాస్తు రుసుం నిర్ణయించారు. ఈ రుసుం సైతం ఆన్‌లైన్‌ ద్వారానే చెల్లించాలి. ఆన్‌లైన్‌లో దరఖా స్తు పూర్తి చేసిన వివరాల ప్రింట్‌ తీసుకొని ఏ మోడల్‌స్కూల్లో అడ్మీషన్‌ పొం దాలనుకుంటారో సదరు స్కూల్‌ ప్రిన్సిపాల్‌కు దరఖాస్తు కాపీని అందజేయాలి. 


ప్రవేశ పరీక్ష సెలబస్‌ ఇదే...

ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు ఐదో తరగతి సెలబ్‌సకు సంబంధించిన ప్రశ్న లు వస్తాయి. ప్రశ్నలు తెలుగు, గణితం, సామాన్య, సాంఘికశాస్త్రాలు, ఇంగ్లీ్‌షలుగా నాలుగు విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగానికి 25 మల్టిపుల్‌ చాయి స్‌లో ఆబ్జెక్టీవ్‌ ప్రశ్నలు, 25 మార్కుల చొప్పున 100 మార్కులు ఉంటాయి. 7 నుంచి 10వ తరగతి ప్రవేశపరీక్షలో అంతకంటే వెనుక తరగతి సెలబ్‌సకు సంబంధించిన ఇంగ్లీష్‌, గణితం, సామాన్యశాస్త్రం, సాంఘిక శాస్త్రాలకు 25 మార్కుల చొప్పున 100 మార్కులుంటాయి. తెలుగు, ఇంగ్లీష్‌ మినహా ఇతర సబ్జెక్టుల ప్రశ్నలు తెలుగు, ఇంగ్లీష్‌ రెండు మాధ్యమాల్లో ముద్రించి ఉంటాయి. 


అర్హతలు ఇవే...

ఐదో తరగతి పాస్‌ అయిన ఉన్నవారే ఆరో తరగతి ప్రవేశ పరీక్ష రాసేందు కు అర్హులు. తెలుగు, ఇంగ్లీష్‌ మీడియంలలో ఏ మీడియం వారైనా దరఖాస్తు చేసుకునే వీలుంది. దరఖాస్తు చేసే విద్యార్థి 2020-2021, 2021-2022 విద్యాసంవత్సరాల్లో మోడల్‌ స్కూల్‌ ఉన్న జిల్లాలోనే గుర్తింపుపొందిన పాఠశాలలో విద్యనభ్యసిస్తూ ఉండాలి. తల్లిదండ్రుల ఆదాయం రూ.1లక్షకు మించరాదు. మోడల్‌ స్కూల్‌ ఉన్న జిల్లాకు సంబంధించిన విద్యార్ధి అయిఉండాలి. 6వ తరగతి కోసం పరీక్ష రాసే విద్యార్థి ఈ ఏడాది ఆగస్టు 31నాటికి 10ఏళ్లు పూర్తయి ఉండాలి. 7 నుంచి 10 తరగతి ప్రవేశం కోసం అంతకుముందు తరగతి పాసై ఉండాలి. ఈ తరగతులకు కులాల వారీగా వయస్సు అర్హతను నిర్ణయించారు.


ప్రతిభగల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి

డాక్టర్‌ కోమటిరెడ్డి శ్రీనివా్‌సరెడ్డి, ప్రిన్సిపాల్‌, నెల్లికుదురు ఆదర్శ పాఠశాల 

ప్రతిభ గల పేద, మధ్య తరగతి విద్యార్థులు అన్ని సౌకర్యాలతో 6 నుంచి ఇంటర్‌ వరకు ఇంగ్లీష్‌ మీడియం ఉచిత విద్యనందించే ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అన్ని సరైన ద్రువీకరణపత్రాలతో ఒకటికి రెండుసార్లు పరిశీలించుకుని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన తర్వాత ఒక కాపీని మోడల్‌స్కూల్లో సమర్పించాలి. 

Updated Date - 2022-03-05T06:01:56+05:30 IST