రుణాలు చెల్లించలేదని అన్నదాతల ఇంట్లో సామగ్రి జప్తు

ABN , First Publish Date - 2022-02-19T06:40:29+05:30 IST

రుణాలు చెల్లించలేదని అన్నదాతల ఇంట్లో సామగ్రి జప్తు

రుణాలు చెల్లించలేదని అన్నదాతల ఇంట్లో సామగ్రి జప్తు
రాంపురంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సిబ్బంది జప్తులు చేసి సామగ్రిని స్వాధీనం చేసుకుంటున్న అధికారులు

గార్ల, ఫిబ్రవరి 18: రైతుల రుణమాఫీ సంగతి దేవుడేరుగు.. కానీ, గార్ల మండలంలో బ్యాంకులో పెట్టుబడుల కోసం తీసుకున్న రుణం చెల్లించలేదని అన్నదాత ఇంట్లో శుక్రవారం అధికారులు సామగ్రిని జప్తు చేస్తున్నారు. గార్ల మండల కేంద్రంతో పాటు రాంపురం, పెద్దకిష్టాపురం, జీవంచిపల్లి, పినిరెడ్డిగూడెం గ్రామాల్లో జిల్లా కేంద్ర సహాకార బ్యాంకు అధికారులు రైతులు తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించని వారి ఇళ్లలో సామాన్లు, ద్విచక్ర వాహనాలను జప్తుచేసి వాహానాల్లో తీసుకుపోయారు. ఆయా గ్రామాల్లో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నం కాగా,  ఇంట్లో ఎవరు లేనిసమయంలో బ్యాంకు సిబ్బంది ఇళ్ల తాళాలు పగులగొట్టి విలువైన వస్తువులను తీసుకపోయారని అన్నదాతలు బోరున విలపిస్తూ తమగోడును వెలుబుచ్చారు. ఖరీ్‌ఫలో అధిక వర్షాలు పడి పంటలు దెబ్బతిని నష్టపోవడం, దీనికి తోడు మిర్చి పంటలను తామర వైరస్‌ సోకి పంటలు పూర్తిగా ఎండిపోయి ఆర్థికంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణ మాఫీలు సకాలంలో జరుగకపోవడం, మరోపక్క అప్పులతో సతమతమవుతున్న తరుణంలో బ్యాంకు అధికారులు ఈ చర్యలకు పాల్పడడమేంటని రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈవిషయంపై జిల్లా కేంద్ర సహకార బ్యాంకు గార్ల బ్రాంచ్‌ మేనేజర్‌ సౌజన్యను వివరణ కోరగా మండల వ్యాప్తంగా పెండింగ్‌ బకాయిలు రూ.5లక్షలు ఉండ గా పలుమార్లు నోటీసులు అందించి న రైతులు స్పందించక పోవడంతో జప్తులు చేశామని, మొదటి రోజు రూ.78 వేలను రికవరీ చేశామని తెలిపారు.   సీఇవో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 

బ్యాంకు అధికారుల తీరుపై మండిపాటు...

గార్ల మండలంలో సహాకార బ్యాంకు అధికారుల తీరుపై సీపీఐ, ఎల్‌హెచ్‌పీఎ్‌స నేతలు మండిపడ్డారు. బ్యాంకు సిబ్బంది గ్రామాల్లో రైతులు ఇంట్లోలేని సమయంలో సామాన్లు జప్తు చేయడం సరైంది కాదని సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యడు కట్టెబోయిన శ్రీనివాస్‌ అన్నారు. పంటలు నష్టపోయి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రైతులను ప్రభుత్వం అదుకోవాలే తప్పా జప్తులు చేయడమేంటని ప్రశ్నించారు. రైతుల పక్షాన ఎల్‌హెచ్‌పీఎ్‌స పోరాడుతుందని జిల్లా అఽధ్యక్షుడు వాకుండోత్‌ మంగిలాల్‌ తెలిపారు.

Read more