మళ్లీ మెరిసిన రెండు గ్రామాలు

ABN , First Publish Date - 2022-02-25T07:00:42+05:30 IST

మళ్లీ మెరిసిన రెండు గ్రామాలు

మళ్లీ మెరిసిన రెండు గ్రామాలు
గంగదేవిపల్లి

గంగదేవిపల్లి, మరియపురం పంచాయతీలకు అరుదైన గుర్తింపు

 బీకాన్‌ పంచాయతీ లీడర్లుగా కూసం రాజమౌళి, అల్లం బాలిరెడ్డి 

 జాతీయస్థాయి   ఓరియెంటేషన్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొనాలని ఆహ్వానం

 ‘ఆదర్శ గ్రామ పంచాయతీ క్లస్టర్ల సృష్టి’లో భాగస్వామ్యం

 తెలంగాణ నుంచి నాలుగు పంచాయతీల ఎంపిక 


వరంగల్‌, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): దేశంలో ఉత్తమ బీకాన్‌ పంచాయతీ లీడర్ల ఎంపికలో వరంగల్‌ జిల్లాకు చెందిన ఇద్దరు సర్పంచ్‌లు అవకాశం దక్కింది. తెలంగాణ రాష్ట్రం నుంచి నాలుగు పంచాయతీల సర్పంచ్‌లను బీకాన్‌ పంచాయతీ లీడర్లుగా ఎంపిక చేయగా, వాటిలో రెండు గ్రామ పంచాయతీలు వరంగల్‌ జిల్లా గీసుగొండ మండలానివే కావడం విశేషం. గ్రామాలను చిన్నతనంగా చూడడం గ్రామస్థులకు నచ్చక అందరు సంఘటితమై తమ శక్తిని ప్రదర్శించడంతో రెండు గ్రామాలు జాతీయస్థాయిలో ఉత్తమ పంచాయతీలుగా ఎదిగాయి. గ్రామస్తుల ఐకమత్యం కారణంగా  శివారు పల్లెలుగా ఉన్న గంగదేవిపల్లి, మరియపురం గ్రామాలు దేశంలోనే ఉత్తమమైనవిగా నిలబడి పలు అవార్డులను సొంతం చేసుకున్నాయి. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలనే నినాదాన్ని గంగదేవిపల్లి, మరియపురం గ్రామస్థులు నిజం చేసి సత్తా చాటారు. 

వరంగల్‌ జిల్లా గీసుగొండ మండలం గంగదేవిపల్లి, మరియపురం గ్రామాలు దేశంలోనే ఆదర్శ పంచాయతీలుగా నిలిచా యి. గ్రామ అభివృద్ధి కోసం గ్రామస్థులను ఏకం చేసి ఉత్తమ పంచాయతీలుగా మారే లా కృషి చేసిన సర్పం చ్‌లను జాతీయ గ్రామీణా భివృద్ధి, పంచాయతీరాజ్‌ సంస్థ ఉత్తమ సర్పంచ్‌ లుగా గుర్తించింది. దేశంలోని 1,500 క్లస్టర్లను ఏర్పాటు చేసిన ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌.. తెలంగాణ రాష్ట్రంలో నాలుగు క్లస్టర్లను గుర్తించగా వాటిలో రెండు క్లస్టర్లు వరంగల్‌ జిల్లాకు చెందినవే ఉం డడం గమనార్హం. ఇప్పటికే గంగదేవిపల్లి జాతీయ ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డును కైవసం చేసుకొని దేశంలో అందరికంటే ముందుండగా, దానికి పోటీగా ఇదే మండలంలోని మరియపురం గ్రామం కూడా పరుగులు పెట్టి సఫ లీకృతమైంది. గంగదేవిపల్లి గ్రామం రూపురేఖలు మారడంలో అప్పటిసర్పంచ్‌, ఇప్పటి గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్‌ కూసం రాజమౌళి కృషి కీలకమైనది. మరియపురం సర్పంచ్‌గా ఉన్న పారిశ్రామికవేత్త అల్లం బాల్‌రెడ్డి సైతం గ్రామా న్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడంలో ఎనలేని కృషి చేయడం మూలంగా నేడు జాతీయ ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులను కైవసం చేసుకుంది. 


చాలా ఆనందంగా ఉంది

అల్లం బాల్‌రెడ్డి, మరియపురం సర్పంచ్‌, గీసుగొండ, వరంగల్‌ జిల్లా

బీకాన్‌ పంచాయతీ లీడర్‌గా నన్ను ఎంపిక చేయడం చాలా ఆనందంగా ఉంది. దేశంలో 1500 క్లస్టర్లను జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌ సంస్థ గుర్తించగా, వాటిలో తెలంగాణలో రెండు గ్రామాలను ఉత్తమంగా గుర్తించినందుకు గర్వంగా ఉంది. ప్రజల భాగస్వామ్యంతో మరియపురం గ్రామాన్ని అహర్నిశలు మానిటరింగ్‌ చేయడం ద్వారా ఈ రోజు దేశంలో ఉత్తమ పంచాయతీ సర్పంచ్‌గా గుర్తింపు లభించింది. హైదరాబాద్‌లో మార్చి 1 నుంచి జరిగే శిక్షణ కార్యక్రమంలో ఇంకా గ్రామ అభివృద్ధి కోసం ఏం చేయాలో శిక్షణ ఇవ్వనున్నారు.  


ప్రజలభాగస్వామ్యంతోనే అభివృద్ధి

-  కూసం రాజమౌళి, గ్రామాభివృద్ధి కమిటీ వ్యవస్థాపక చైర్మన్‌, గంగదేవిపల్లి

ప్రజల స్వచ్ఛంద భాగస్వామ్యంతోనే గ్రామాల సమగ్రాభివృద్ధి జరుగుతుంది. సర్పంచ్‌ పట్ల ప్రజల్లో పూర్తిస్థాయి నమ్మకం ఉండాలి. గ్రామాల్లో మద్యనిషేధం తప్పనిసరిగా విధించాలి. దీంతో గ్రామాల్లోని ప్రధానంగా ఉన్న పలు సమస్యలు సమసిపోతాయి. గ్రామాభివృద్ధికి తక్షణం అవసరమైన పనులను గ్రామసభల ద్వారా గుర్తించి ప్రజలకు వివరించాలి. మార్చి 1 నుంచి 3 వరకు జరిగే జాతీయ శిక్షణ సమావేశంలో ఇదే విషయాలను చెబుతాను. స్థానికంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రజల సూచనలు తీసుకోవాలి. ప్రభుత్వ సహకారం ఏవిధంగా అందుతుందో వివరించాలి. దీనివల్ల ప్రజల్లో కూడా నమ్మకం కుదురుతుంది.  



Updated Date - 2022-02-25T07:00:42+05:30 IST