బీసీ కమిషన్‌ ముందే వాదనలు వినిపించండి

ABN , First Publish Date - 2022-10-12T10:08:23+05:30 IST

ముదిరాజ్‌ సామాజికవర్గాన్ని బీసీ(ఏ)లోనే కొనసాగించే విషయమై తెలంగాణ బీసీ కమిషన్‌ ముందే వాదనలు వినిపించాలని ముదిరాజ్‌ మహాసభకు సుప్రీంకోర్టు సూచించింది.

బీసీ కమిషన్‌ ముందే వాదనలు వినిపించండి

ముదిరాజ్‌ మహాసభకు సుప్రీంకోర్టు సూచన

న్యూఢిల్లీ, అక్టోబరు 10 (ఆంరధ్రజ్యోతి): ముదిరాజ్‌ సామాజికవర్గాన్ని బీసీ(ఏ)లోనే కొనసాగించే విషయమై తెలంగాణ బీసీ కమిషన్‌ ముందే వాదనలు వినిపించాలని ముదిరాజ్‌ మహాసభకు సుప్రీంకోర్టు సూచించింది. 2009లో ముదిరాజ్‌ సామాజికవర్గాన్ని బీసీ (డీ) నుంచి బీసీ (ఏ)కి మార్చుతూ జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టివేసింది. దాన్ని సవాలు చేస్తూ 2010లో ఏపీ ముదిరాజ్‌ మహాసభ దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు. లలిత్‌, జస్టిస్‌ ఎస్‌. రవీంద్ర భట్‌, జస్టిస్‌ బేలా ఎం త్రివేదితో కూడిన త్రిసభ్య ధర్మాసనం  విచారణను ముగించింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది వైద్యనాథన్‌ వాదనలు వినిపిస్తూ బీసీలపై అధ్యయనానికి 2021లో కొత్త బీసీ కమిషన్‌ ఏర్పాటయ్యిందని చెప్పారు. అయితే ప్రస్తుతం ఉప ఎన్నికల నేపథ్యంలో కమిషన్‌ బహిరంగ ప్రకటన జారీ చేయలేదని తెలిపారు. నాలుగు వారాల పాటు సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వెనుకబడిన వర్గాల స్థితిగతులపై బీసీ కమిషన్‌ అధ్యయనం చేయనున్న నేపఽథ్యంలో ఈ అంశంపై దాని ముందే వాదనలు వినిపించాలని ముదిరాజ్‌ మహాసభకు ధర్మాసనం సూచించింది.  

Updated Date - 2022-10-12T10:08:23+05:30 IST