తప్పు చేసి.. కులం పేరు చెప్పుకోడానికి సిగ్గనిపించట్లేదా?

ABN , First Publish Date - 2022-04-24T09:33:34+05:30 IST

తప్పు చేసి కులం పేరు చెప్పుకునేందుకు మంత్రి పువ్వాడ అజయ్‌కు సిగ్గనిపించట్లేదా? అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు

తప్పు చేసి.. కులం పేరు చెప్పుకోడానికి సిగ్గనిపించట్లేదా?

  • చనిపోయిన వ్యక్తిదీ కమ్మ కులమే
  • ప్రాణం పోతే అది చిన్న విషయమా? 
  • మంత్రి పువ్వాడ అజయ్‌పై జగ్గారెడ్డి ఫైర్‌ 
  • ఆయనను మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలి
  • అజయ్‌ మెడికల్‌ కాలేజీలో అవకతవకలపైనా..
  • విచారణ జరపాలని డిమాండ్‌
  • గాంధీభవన్‌ ముందు అజయ్‌ దిష్టిబొమ్మ దహనం


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): తప్పు చేసి కులం పేరు చెప్పుకునేందుకు మంత్రి పువ్వాడ అజయ్‌కు సిగ్గనిపించట్లేదా? అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. పువ్వాడ అజయ్‌ ఒక్కడే కమ్మ కాదని, ఆయన వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న యువకుడూ కమ్మ కులానికి చెదినవాడేనన్నారు. కమ్మకులం స్థాయిని దిగజార్చే ప్రయత్నం అజయ్‌ చేస్తున్నారంటూ మండిపడ్డారు. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరిదీ కమ్మ కులమేనని, ఆమె కూడా అజయ్‌ను విమర్శిస్తున్నారని చెప్పారు. పువ్వాడ అజయ్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ శనివారం గాంధీభవన్‌ ముందు కాంగ్రెస్‌ నేతలు ఆందోళన నిర్వహించారు. మంత్రి పువ్వాడ దిష్టిబొమ్మనూ దహనం చేశారు.


ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ఒక ప్రాణం పోతే చిన్న విషయమంటున్న మంత్రి పువ్వాడకు అసలు బుర్ర ఉందా అని ప్రశ్నించారు. ఖమ్మం జిల్లాలో పువ్వాడ అరాచకాలు అన్నీ, ఇన్నీ కావని, కాంగ్రెస్‌ నేతలపైన పీడీ చట్టం కింద కేసులు పెట్టించి హింసించారని ఆరోపించారు. పువ్వాడ అజయ్‌ను బర్తరఫ్‌ చేయాలంటూ సీఎం కేసీఆర్‌కు మరోమారు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. అజయ్‌కి చెందిన మెడికల్‌ కాలేజీలో అవకతవకలు జరిగాయని, వాటిపైనా విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. ‘‘ఖమ్మంలో ప్రతిపక్ష పార్టీల నేతలను మంత్రి పువ్వాడ వేధిస్తుంటే.. ఆయనపై సీఎం కేసీఆర్‌ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? సీఎంకు మంత్రి ముఖ్యమా.. ప్రజలు ముఖ్యమా? కోర్టు నోటీసులు ఇచ్చినా చలనం లేదా? న్యాయస్థానానికీ విలువ ఇవ్వరా?ప్రభుత్వం నాన్చుడు ధోరణి వీడాలి. పువ్వాడను మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేయకుంటే ఆయన ఇంటిని, ఖమ్మంలో పువ్వాడ ఆస్పత్రిని ముట్టడిస్తాం. ఆయన ఎక్కడ తిరిగినా అడ్డుకుంటాం’’ అని జగ్గారెడ్డి హెచ్చరించారు. 

Read more