కారుకు కటీఫ్.. రూటు మార్చబోతున్న ఎంఐఎం..!

ABN , First Publish Date - 2022-09-26T23:44:11+05:30 IST

ఎంఐఎం పార్టీ (MIM) పాతబస్తీలో బలమైన పార్టీ. ఇప్పుడు ఆ పార్టీ ఇతర ప్రాంతాల్లో పాగా వేయాలని ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణ (Telangana)లో...

కారుకు కటీఫ్.. రూటు మార్చబోతున్న ఎంఐఎం..!

ఎంఐఎం పార్టీ (MIM) పాతబస్తీలో బలమైన పార్టీ. ఇప్పుడు ఆ పార్టీ ఇతర ప్రాంతాల్లో పాగా వేయాలని ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణ (Telangana)లో ఎవరు అధికారంలో ఉన్నా మజ్లీస్‌ సహాయ సహకారాలు ఉండాల్సిందే.  అయితే టీఆర్ఎస్ (Trs) పరిస్థితి ఏంటనేది ఆసక్తిగా మారుతోంది. తెలంగాణలో గులాబీ దళానికి.. ఒకవైపు బీజేపీ (Bjp), మరోవైపు కాంగ్రెస్  (Congress) పార్టీలు ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నాయి.


అయితే మజ్లీస్ పార్టీ బౌండరీలను పెంచుకోవాలని ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) భావిస్తున్నారట. వాస్తవానికి కేసీఆర్‌ (Kcr)కు ఓవైసీకి చాలా మంచి సంబంధాలున్నాయి. కానీ ఇప్పుడు ఇన్ని రోజులు వేరు, ఇప్పుడు వేరు అనే ధోరణిలో మజ్లీస్ చీఫ్ ఆలోచిస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెప్పుకొస్తున్నారట. 


ఇక అదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్‌లలో ఎంఐఎంకు మంచి క్యాడర్ ఉంది. 2018లో టీఆర్ఎస్‌తో ఉన్న అవగాహన మేరకు ఓల్డ్ సిటీకే పరిమితం అయింది. కానీ.. దానికంటే ముందు జరిగిన 2014 ఎన్నికల్లో నిజామాబాద్‌లో పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో నిజామాబాద్ నుండి పోటీ చేసిన బిగాల గణేష్ గుప్తాకు 42,148 ఓట్లు రాగా.. మజ్లీస్ నుండి పోటీ చేసిన మీర్ మజాజ్ అలీకి ఎటువంటి ప్రచారం చేయకున్నా 31,840 ఓట్లు వచ్చాయి. అంటే దాదాపు 23.53 శాతం ఓట్లు కైవసం చేసుకొని సెకండ్ ప్లేస్‌లో నిలిచారు. ఇక.. నిజమాబాద్ కార్పొరేషన్లలో 60 డివిజన్లలో 16 డివిజన్లు ఎంఐఎం సొంతం చేసుకుంది.


నిజామాబాద్ అర్బన్‌లో మైనార్టీ ఓట్లు ఎక్కువ ఉండగా, ఆ తర్వాతి స్థానంలో మున్నూరు కాపు ఓటర్లు ఉన్నారు. దీంతో మున్నురుకాపు సామాజికవర్గం నుండి అభ్యర్థిని నిలబెడితే ఎంఐఎం గెలుపొందుతుందని అసద్ స్కెచ్ వేస్తున్నారట. ఇక.. బోధన్ నుంచి కూడా మైనార్టీ నేత ఎమ్మెల్యేగా ఉన్నారు. మజ్లీస్ ప్రభావం ఉంది కాబట్టి.. అక్కడ కూడా పోటీ చేయాలని భావిస్తోందట. 13 శాతం ఓటు బ్యాంకు ఉండి.. రానున్న ఎన్నికల్లో సెక్యులర్‌గా ఉన్న కాంగ్రెస్‌తో కలిసి వెళ్తే బాగుంటుందని మజ్లీస్‌ నేతలు భావిస్తున్నారట. రాహుల్ పాదయాత్రతో కాంగ్రెస్‌కు మంచి ఊపు వస్తుందని, కాస్త హెల్ప్ చేస్తే వాళ్ళతో కలిసి అధికారం షేర్ చేసుకోవచ్చని ఎంఐఎం పార్టీలో చర్చ జరుగుతుందట. ఇన్ని రోజులు వేరే పార్టీలకు హెల్ప్ చేసిన మజ్లీస్.. అధికారాన్ని మాత్రం షేర్ చేసుకోలేదు. ఈసారి మాత్రం అదే టార్గెట్‌గా పెట్టుకొని అధికారంలో భాగం కావాలని అడుగులేస్తున్నట్లు టాక్‌ నడుస్తోంది.

Read more