క్షేత్ర స్థాయిలో కమలం ఆపరేషన్‌!

ABN , First Publish Date - 2022-09-30T09:52:00+05:30 IST

రాష్ట్రంలో ఒకవైపు రాజకీయ కార్యకలాపాలను ముమ్మరం చేసిన బీజేపీ జాతీయ నాయకత్వం..

క్షేత్ర స్థాయిలో కమలం ఆపరేషన్‌!

  • నియోజకవర్గాల వారీగా అంతర్గత సర్వే
  • ప్రభావితం చేయగల వ్యక్తుల జాబితా సిద్ధం
  • ఒక్కో సెగ్మెంట్‌లో 500 మంది వివరాల సేకరణ

హైదరాబాద్‌, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఒకవైపు రాజకీయ కార్యకలాపాలను ముమ్మరం చేసిన బీజేపీ జాతీయ నాయకత్వం.. మరోవైపు అసాధారణ రీతిలో సూక్ష్మ స్థాయి సమాచారం సేకరిస్తోంది. క్షేత్రస్థాయిలో పాతుకుపోయేందుకు అంతర్గతంగా సర్వేలు చేయిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్లపై ప్రభావం చూపే వ్యక్తుల జాబితాను సేకరించింది. గత ఆరు నెలల్లో మూడు దఫాలుగా ఈ ప్రక్రియ కొనసాగింది. మొత్తం 90 బృందాలు క్షేత్రస్థాయిలో పని చేసి సామాజిక, రాజకీయ అంశాలకు సంబంధించిన వివరాలను అమిత్‌షాకు నివేదించాయి. ఈ మేరకు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్లను ప్రభావితం చేయగల 500 మంది ప్రముఖుల వివరాల జాబితా పార్టీ జాతీయ నాయకత్వానికి చేరిందని బీజేపీ ముఖ్యనేత ఒకరు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.


‘‘ఇందులో రాజకీయాలతో సంబంధం లేని ప్రముఖులు, కులసంఘాల నేతలు కూడా ఉన్నారు. బీజేపీ పట్ల వారి వైఖరి ఏమిటి? ఇదే సమయంలో కొత్తగా బీజేపీలో చేరినవారి వైఖరి, స్థానికంగా పార్టీ కార్యక్రమాల్లో వారి భాగస్వామ్యం వంటి అంశాలను కూడా ఆ బృందాలు సేకరించాయి’’ అని ఆయన వివరించారు. వాస్తవానికి, పార్టీలకు అతీతంగా ఓటర్లను ప్రభావితం చేయగల ప్రముఖుల వివరాలను సేకరించాలని రాష్ట్రపార్టీ ముఖ్యులను ఏడాది కిందటే అమిత్‌ షా ఆదేశించారు.


  ఈ దిశగా కొంత కసరత్తు జరిగింది. కానీ,  పలు నియోజకవర్గాల నుంచి ఆశించిన మేర వివరాలు రాకపోవడంతో సర్వే బృందాలను అమిత్‌ షా రంగంలోకి దింపి ఉంటారని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, గతంలోనే నమో టీమ్‌లు, అమిత్‌ షా బృందాలు కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతోపాటు సామాజికవర్గాల జాబితాను తయారు చేశాయి. ఆ జాబితా ఆధారంగానే కేంద్ర మంత్రులు పార్లమెంట్‌ నియోజకవర్గాల పర్యటనల సందర్భంగా లబ్ధిదారులు, కొత్త ఓటర్లతో భేటీ అవుతున్నారు. ఆయా సెగ్మెంట్లలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రులు.. సర్వే బృందాల నివేదికలను పరిశీలిస్తూ స్థానిక పార్టీ నేతలతో సమీక్షిస్తున్నారు. ఈ సందర్భంగా తమకు తెలియని సమాచారాన్ని కేంద్రమంత్రులు ప్రస్తావిస్తుండడంతో స్థానిక నేతలే విస్తుపోతున్నారు. ఇదిలా ఉండగా, మొన్నటివరకు యూపీలో పార్టీ సంస్థాగత వ్యవహారాలను పర్యవేక్షించిన సీనియర్‌ నేత సునీల్‌ బన్సల్‌కు తెలంగాణ బాధ్యతలు అప్పగించడం వెనుక దీర్ఘకాలిక వ్యూహం ఉందని పార్టీ సీనియర్‌ నేత ఒకరు చెప్పారు. యూపీలో సాధించిన ఫలితాలను తెలంగాణలోనూ సాధించాలన్న లక్ష్యంతో పార్టీ జాతీయ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. ‘‘యూపీలో పని చేసిన సర్వే బృందాలను ఇప్పటికే బన్సల్‌ ఇక్కడ మోహరించారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితితోపాటు పార్టీ ఓటుబ్యాంకు పెరిగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ బృందాలు సిఫారసు చేయనున్నాయి’’ అని ఆయన వివరించారు.

Read more