Lost MOBILE: సెల్‌ఫోన్ పోయిందా? మీ-సేవలో చలాన్ కట్టండి!
ABN , First Publish Date - 2022-12-15T02:55:50+05:30 IST
మీ సెల్‌ఫోన్ పోయిందా? వెంటనే పోలీ్‌సస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలనుకుంటున్నారా? అయితే గతం లో మాదిరిగా పోలీ్‌సస్టేషన్‌కు వెళ్లి.. కాగితంపై వివరాలు రాసి ఫిర్యాదు ఇస్తే పోలీసులు తీసుకోరు. ముందుగా మీ-సేవ కేంద్రానికి వెళ్లి, అక్కడ వివరాలు చెప్పి రూ.200 చలాన్ కట్టి.. రశీదు తీసుకొచ్చి పోలీ్‌సస్టేషన్‌లో ఇవ్వాల్సి ఉంటుంది.
బాధితులు రూ.200 చార్జీ చెల్లించాలి
ఆ రశీదు తెచ్చి పోలీస్‌స్టేషన్‌లో ఇవ్వాలి
అందులో రూ.145 రాష్ట్ర ప్రభుత్వానికి,
మిగతా మొత్తం మీ-సేవ వినియోగ రుసుము
సెల్‌ఫోన్ మిస్సింగ్‌లపై పోలీసు శాఖ కొత్త నిబంధన
పోలీస్స్టేషన్లలో ఫిర్యాదుల స్వీకరణకు స్వస్తి
నిత్యం వందలాది ఫిర్యాదులు వస్తుండటం,
ఎఫ్ఐఆర్ల సంఖ్య పెరుగుతుండడమే కారణం!
హైదరాబాద్, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): మీ సెల్‌ఫోన్ పోయిందా? వెంటనే పోలీ్‌సస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలనుకుంటున్నారా? అయితే గతం లో మాదిరిగా పోలీ్‌సస్టేషన్‌కు వెళ్లి.. కాగితంపై వివరాలు రాసి ఫిర్యాదు ఇస్తే పోలీసులు తీసుకోరు. ముందుగా మీ-సేవ కేంద్రానికి వెళ్లి, అక్కడ వివరాలు చెప్పి రూ.200 చలాన్ కట్టి.. రశీదు తీసుకొచ్చి పోలీ్‌సస్టేషన్‌లో ఇవ్వాల్సి ఉంటుంది. గత కొంతకాలంగా సెల్‌ఫోన్ మిస్సింగ్లకు సంబంధించిన ఫిర్యాదుల విషయంలో పోలీసులు అనుసరిస్తున్న విధానం ఇదే. దీంతో అసలే సెల్‌ఫోన్ పోయిందన్న బాధలో ఉన్న బాఽధితులకు ఈ నిబంధన మరింత ఇబ్బందికరంగా మారుతోంది. ఇంత చేసినా పోయిన ఫోన్ దొరుకుతుందా.. అంటే ఆ గ్యారంటీ కూడా లేదు. సెల్‌ఫోన్ పోయిందంటూ పోలీసులను ఆశ్రయించేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుండటం, దీంతో ఎఫ్ఐఆర్ల సంఖ్య పెరిగిపోతుండటమే ఈ కొత్త నిబంధన తీసుకురావడానికి కారణమని తెలుస్తోంది. సెల్‌ఫోన్ వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం అరచేతిలోకి వచ్చినట్లు కావడంతో.. వాటి వాడకం విపరీతంగా పెరిగింది. చాలా మంది కనీసం రెండు సెల్ఫోన్లను ఉపయోగిస్తున్నారు. వీటి ధర కూడా వివిధ సంస్థలు అందించే ఫీచర్స్‌ను బట్టి రూ.10 వేల నుంచి రూ.లక్ష దాకా ఉంటోంది. ఈ క్రమంలోనే సెల్‌ఫోన్ దొంగతనాలు కూడా పెరిగిపోయాయి. ఈజీ మనీకి అలవాటు పడుతున్న దొంగలు బస్సుల్లో, బస్టాండ్లలో ప్రయాణికులను, మార్కెట్లలో జనాలను టార్గెట్‌గా చేసుకుని సెల్‌ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్నారు.
ప్రతిరోజూ రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది సెల్‌ఫోన్ పోగొట్టుకుంటున్న బాధితులు ఉంటున్నారు. ఫలితంగా పోలీసులను ఆశ్రయించేవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. నిబంధనల ప్రకారం పోలీ్‌సస్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి ఉంటుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీ్సస్టేషన్లలో నమోదవుతున్న కేసుల సగటు కూడా పెరిగిపోతోంది. దీనిని అరికట్టేందుకే పోలీసులు నేరుగా ఫిర్యాదు తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా మీ-సేవ ద్వారా తీసుకుంటున్నారు. ఏదైనా ముఖ్యమైన కేసుల్లో మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు.
ప్రభుత్వానికి పెద్దమొత్తంలో ఆదాయం..
రాష్ట్ర వ్యాప్తంగా సెల్‌ఫోన్ మిస్సింగ్, దొంగతనం కేసులు ప్రతి రోజు పెద్ద సంఖ్యలో ఉంటాయి. సగటున ప్రతి జిల్లాలో రోజుకు పది సెల్‌ఫోన్ మిస్సింగ్ కేసులు నమోదు అయ్యాయనుకుంటే 330 ఫిర్యాదులు ఉంటాయి. 330 మంది మీ-సేవకు వెళ్లి రూ.200 చొప్పున చలాన్ కట్టాల్సిందే. రూ.200లో రూ.145 ప్రభుత్వ ఖజానాకు జమ అవుతుంది. మిగతా మొత్తం మీ-సేవ కేంద్రం నిర్వాహకులు సర్వీస్ చార్జీ కింద వసూలు చేస్తారు. అంటే 330 మంది నుంచి రూ.145 వసూలు చేస్తే రోజుకు సుమారు 50 వేల వరకు వస్తుంది. ప్రతి నెలా కేవలం సెల్‌ఫోన్ మిస్సింగ్ కేసుల నుంచే రూ.15 లక్షల వరకు ప్రభుత్వ ఖజానాకు జమ అవుతాయి. అయితే పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెల్‌ఫోన్ పోగొట్టుకున్న బాధితులు పోలీస్ స్టేషన్, మీ-సేవా కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లో ఫిర్యాదు చేసే సదుపాయం ఉంది. కొన్ని జిల్లాల్లో ప్రత్యేకంగా జిల్లా అధికారులు పోర్టల్‌లో ఫిర్యాదులు స్వీకరించి పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌ను వెతికి పట్టుకుని బాధితులకు ఇస్తున్నారు. ఒక్క ఏపీలోనే కాకుండా చాలా రాష్ట్రాల్లో ఈ విధానం అమల్లోఉంది. తెలంగాణలో మాత్రం అందుకు భిన్నంగా మీ-సేవాలో చలాన్ కట్టాలంటున్నారు. ‘సెల్‌ఫోన్ మిస్సింగ్‌కు గతంలోలా కేసులు నమోదు చేయడం లేదు. మీ-సేవకు వెళ్లి చలాన్ కడితే ఆ వివరాల మేరకు సర్వర్ ద్వారా ట్రేసింగ్ పెడుతున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొంత కాలంగా ఈ విధానం అనుసరిస్తున్నాం’’ అని పోలీస్ అధికారి ఒకరు చెప్పారు.
ఫోన్ దొరకడంపై లేని గ్యారంటీ..
మీ-సేవ కేంద్రంలో రూ.200 చలాన్ కట్టి, ఆ రశీదు తెచ్చి పోలీ్‌సస్టేషన్‌లో ఇచ్చినా.. పోయిన ఫోన్ దొరుకుతుందా.. అంటే ఆ గ్యారంటీ లేదు. మీ-సేవ రశీదులో ఉన్న సమాచారం మేరకు సర్వర్‌లో వివరాలు నమోదు చేసి ఏదైనా, ఎక్కడైనా ఫోన్ వాడుకలో ఉంటే అలాంటి వాటిని గుర్తించి పట్టుకుంటున్నారు. సెల్‌ఫోన్ దొంగతనాలే పనిగా పెట్టుకున్న ముఠాలు హైదరాబాద్‌లో దొంగిలించిన ఫోన్లను ఇతర మెట్రో నగరాల్లోని దుకాణాల్లో బల్క్‌గా అమ్ముతున్నాయి. అక్కడ దొంగిలించిన ఫోన్లను హైదరాబాద్ తెచ్చి అమ్ముతున్నారు. దొంగ ఫోన్లను కొనుగోలు చేసిన దుకాణదారులు ఏవైనా ఖరీదైన ఫోన్లు ఉంటే వాటి ఐఎంఈఐ నంబర్లను ట్యాంపర్ చేసి సెకండ్ హ్యాండ్లో విక్రయిస్తున్నారు. తక్కువకు సెకండ్ హ్యాండ్లో కొనుగోలు చేసిన వినియోదగారుడు ఆ ఫోన్‌ను పోలీసులకు ఇచ్చి చేసేదిలేక మిన్నుకుంటున్నాడు. దుకాణదారుడ్ని ప్రశ్నిస్తే.. ఎవరో ఖర్చులకు అవసరమని చెప్పి అమ్మితే తీసుకున్నామని బుకాయించి తప్పించుకుంటున్నారు. కాగా సెల్‌ఫోన్ మిస్సింగ్‌లో దొంగతనాలకు గురవుతున్న వాటికంటే నిర్లక్ష్యం కారణంగా జారిపడిపోవడం, ఎక్కడో పెట్టి మర్చిపోవడం వల్ల ఎవరికో దొరుకుతున్న కేసులు ఎక్కువగా ఉంటున్నాయని పోలీ్‌సలు చెబుతున్నారు.