వైద్య విద్యలో లోకల్‌ కోటా

ABN , First Publish Date - 2022-09-30T08:04:37+05:30 IST

వైద్య విద్యను అభ్యసించాలనుకునే రాష్ట్ర విద్యార్థులకు తీపి కబురు. వీరికి మరిన్ని ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ సీట్లు అందుబాటులోకి రానున్నాయి.

వైద్య విద్యలో లోకల్‌ కోటా

  • స్థానికులకే దక్కనున్న మరో 1,068 ఎంబీబీఎస్‌ సీట్లు
  • ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ సీట్ల కేటాయింపుల్లో మార్పులు
  • 35% బీ-కేటగిరీ సీట్లలో 85% స్థానికులకే రిజర్వ్‌
  • 15 శాతం సీట్లు మాత్రమే ఇతర రాష్ట్రాల ఓపెన్‌ కేటగిరీకి 
  • నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు

హైదరాబాద్‌, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): వైద్య విద్యను అభ్యసించాలనుకునే రాష్ట్ర విద్యార్థులకు తీపి కబురు. వీరికి మరిన్ని ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లోని బీ-కేటగిరీలో ఉన్న 35శాతం మేనేజ్‌మెంట్‌ కోటాలో 85శాతం సీట్లను స్థానికులకే రిజర్వ్‌ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫలితంగా స్థానికులకు అదనంగా మరో 1,068 ఎంబీబీఎస్‌ సీట్లు దక్కనున్నాయి. ఈ మేరకు ‘ది తెలంగాణ స్టేట్‌ అన్‌-ఎయిడెడ్‌ మైనారిటీ, నాన్‌-మైనారిటీ ప్రొఫెషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌(రెగ్యులేషన్స్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌ ఇన్‌ టు అండర్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ అండ్‌ డెంటల్‌ ప్రొఫెషనల్‌ కోర్సె్‌స)-2017’ను సవరిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్‌ఏఎం రిజ్వీ గురువారం 129, 130 నంబర్ల జీవోలు జారీ చేశారు. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల బీ-కేటగిరీ కింద ఉన్న 35 శాతం సీట్లల్లో 85శాతం సీట్లను స్థానికులకు రిజర్వ్‌ చేసి, మిగతా 15 శాతం సీట్లను దేశంలోని ఇతర రాష్ట్రాల విద్యార్థులకు ఓపెన్‌ కేటగిరీ కింద కేటాయించారు. అంటే.. ఇతర రా ష్ట్రాల్లోని విద్యార్థులకు ఇక మీదట 15 శాతం సీట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. 


వాస్తవానికి ‘నీట్‌’లో లభించే ర్యాంకు ల ఆధారంగా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ సీట్లను కేటాయిస్తారు. 100 సీట్లలో 50 శాతం ఏ-కేటగిరీ(కన్వీనర్‌ కోటా) కింద, 35 శాతం బీ-కేటగిరీ (మేనేజ్‌మెంట్‌ కోటా) కింద, 15 శాతం ఎన్‌ఆర్‌ఐ కోటా కింద ఉంటాయి. బీ-కేటగిరీ కింద ఉన్న 35 శాతం మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల కోసం దేశంలోని అన్ని రాష్ట్రాల విద్యార్థులు పోటీ పడుతున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు అన్యా యం జరుగుతోందని ప్రభుత్వం భావించింది. ఇక్కడి సీట్లను ఇతర రాష్ట్రాలవారు తన్నుపోతుండటంతో రాష్ట్ర విద్యార్థులు నష్టపోవాల్సి వస్తోంది. అందుకే రాష్ట్ర విద్యార్థులకు ఎక్కువ సీట్లు దక్కేలా ఈ సవరణ తీసుకొచ్చింది. 35 శాతం బీ-కేటగిరీ సీట్లలో 15శాతాన్ని మాత్రమే ఓపెన్‌ కేటగిరీగా నిర్దేశిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో స్వరాష్ట్రంలో ఎంబీబీఎస్‌ చదవాలనుకునే విద్యార్థులకు మరో 1,068 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. 


రాష్ట్రంలో ప్రస్తుతం 20 నాన్‌-మైనారిటీ, 4 మైనారిటీ ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు ఉన్నాయి. వీటిలో 3,750 సీట్లున్నాయి. నాన్‌-మైనారిటీ కాలేజీల్లో 3,200 సీట్లు ఉండగా, ఇందులో బీ-కేటగిరీ కింద 35 శాతం అంటే 1,120 సీట్లు ఉన్నాయి.  తాజా సవరణ ప్రకారం బీ-కేటగిరీలోని 35ు సీట్లలో 85ు సీట్లు అంటే.. 952 సీట్లను ప్రత్యేకంగా తెలంగాణ విద్యార్థులను కేటాయిస్తారు. మిగతా 15ు(168) సీట్లకు మాత్రమే ఓపెన్‌ కోటాలో ఇతర రాష్ట్రాల విద్యార్థులు పోటీ పడుతారు. ఈ ఓపెన్‌ కోటాకు తెలంగాణ విద్యార్థులకు కూడా పోటీ పడవచ్చు. అదేమాదిరి.. మైనారిటీ కాలేజీల్లో 25ు బీ-కేటగిరీ కింద ఇప్పటివరకు 137 సీట్లు ఉన్నాయి. తాజా సవరణతో ఇందులోనూ 85ు అంటే 116 సీట్లు ఇక్కడి విద్యార్థులకే దక్కనున్నాయి. ఇలా నాన్‌-మైనారిటీ కాలేజీల్లోని 952 సీట్లు, మైనారిటీ కాలేజీల్లోని 116 సీట్లు.. మొత్తం 1,068 సీట్లు అదనంగా తెలంగాణ విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయి. బీడీఎస్‌ సీట్లలోనూ ఇదే విధానాన్ని అమలు చేయనున్నారు. 


మంత్రి హరీశ్‌రావు చొరవతో

ఇప్పటి వరకు రాష్ట్రంలో మేనేజ్‌మెంట్‌ కోటాలోని సీట్లలో తెలంగాణ విద్యార్థులకు ప్రత్యేకంగా ఎలాంటి రిజర్వేషన్‌ లేదు. ఫలితంగా ఇక్కడి మెడికల్‌ కాలేజీల్లోని బీ-కేటగిరీలో ఉన్న 35 శాతం ఎంబీబీఎస్‌ సీట్లలో ఎక్కువ సీట్లను ఇతర రాష్ట్రాల విద్యార్థులు సొంతం చేసుకుంటున్నారు. తద్వారా తెలంగాణ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఈ విషయంపై రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మహారాష్ట్ర, గుజరాత్‌, కేరళ, ఒడిసా, మధ్యప్రదేశ్‌, జమ్ము కశ్మీర్‌, పంజాబ్‌ తదితర రాష్ట్రాల్లో ఓపెన్‌ కోటా విధానమే లేదు. నిరుటి నుంచి అన్ని సీట్లు ఆయా రాష్ట్రాల విద్యార్థులకే దక్కేలా అక్కడి నిబంధనల్లో మార్పులు చేశారు. ఒక వైపు రిజర్వేషన్‌ లేక సొంత రాష్ట్రంలో, మరో వైపు ఇతర రాష్ట్రాల్లోని సీట్లు పొందలేక తెలంగాణ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. బీ-కేటగిరీ సీట్లలో సవరణ తీసుకొచ్చారు. దీంతో ఎంబీబీఎస్‌ విద్య కోసం ఇతర రాష్ట్రాలు, ఉక్రెయిన్‌, చైనా, రష్యా వంటి దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్వరాష్ట్రంలోనే వైద్య విద్యను అభ్యసించే అవకాశాలు కలగనున్నాయి.

Read more