రూ.95 కోట్లతో లింక్‌ రోడ్లు

ABN , First Publish Date - 2022-04-05T08:15:47+05:30 IST

హైదరాబాద్‌లో మరిన్ని లింక్‌ రోడ్లు అందుబాటులోకి వచ్చాయి.

రూ.95 కోట్లతో లింక్‌ రోడ్లు

  • రాష్ట్ర మంత్రుల చేతుల మీదుగా ప్రారంభం 
  • మూడు లింక్‌ రోడ్లపై రాకపోకలు షురూ
  • మల్కం చెరువునూ ప్రారంభించిన సర్కారు


హైదరాబాద్‌ సిటీ/రాయదుర్గం, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో మరిన్ని లింక్‌ రోడ్లు అందుబాటులోకి వచ్చాయి. రూ.95 కోట్లతో వివిధ ప్రాంతాల్లో నిర్మించిన లింక్‌ రోడ్లు, కార్పొరేట్‌ సామాజిక బాధ్యత(సీఎ్‌సఆర్‌)లో భాగంగా అభివృద్ధి చేసిన మల్కం చెరువును మంత్రులు కేటీఆర్‌, మహమూద్‌ అలీ, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ కలిసి సోమవారం ప్రారంభించారు. ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌ ఇబ్బందులు తగ్గించేలా కేటీఆర్‌ సూచన మేరకు జీహెచ్‌ఎంసీ మిస్సింగ్‌/లింక్‌ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు 12 ప్రాంతాల్లో రహదారులు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 51లో రూ.30.30 కోట్లతో నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జి, రూ.15.07 కోట్లతో పాత ముంబై హైవే నుంచి ఖాజాగూడ రోడ్డు వయా మల్కం చెరువు రోడ్డు, చిత్రపురి కాలనీ వరకు, ఖాజాగూడ లేక్‌ నుంచి ఉర్దూ యూనివర్సిటీ కాంపౌండ్‌ వాల్‌ వరకు ఓఆర్‌ఆర్‌కు సమాంతరంగా రూ.47.66 కోట్లతో నిర్మించిన లింక్‌ రోడ్లపై రాకపోకలు ప్రారంభమయ్యాయి.


మరిన్ని ప్రాంతాల్లో లింక్‌ రోడ్ల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. సైలెంట్‌ వ్యాలీ బ్రిడ్జి నిర్మాణంతో జూబ్లీహిల్స్‌ వైపు నుంచి ఖాజాగూడ, రాయదుర్గం, ఔటర్‌ రింగ్‌రోడ్డు మీదుగా విమానాశ్రయానికి రాకపోకలు సులువు కానున్నాయి. ఈ మార్గం అందుబాటులోకి రావడంతో సుమారు రెండు కిలోమీటర్ల దూరం తగ్గనుంది. పాత ముంబై హైవే నుంచి చిత్రపురి కాలనీ వరకు నిర్మించిన రహదారితో చిత్రపురి కాలనీ వాసులు ఓల్డ్‌ ముంబై హైవేకు నేరుగా చేరుకునే వెసులుబాటు కలుగుతుంది.


ప్రభుత్వ కార్యక్రమాల్లో ‘గులాబీ’ రంగులు 

మహానగరంలో ప్రభుత్వ కార్యక్రమాలు పార్టీ వేడుకలుగా మారుతున్నాయి. ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమం ఏదైనా.. టీఆర్‌ఎస్‌ నేతల హడావిడి అధికమవుతోంది. ప్రజాధనంతో చేపట్టిన ప్రాజెక్టుల వద్ద గులాబీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. కేటీఆర్‌ కార్యక్రమమైతే.. ఆ హంగామా మరింత ఎక్కువగా ఉంటోంది. ఫ్లెక్సీలు, బ్యానర్లు, జెండాలు ఏర్పాటు చేయొద్దన్న నిబంధనలను అధికార పార్టీ గత కొంతకాలంగా తుంగలో తొక్కుతోంది. సోమవారం జూబ్లీహిల్స్‌ విస్పర్‌ వ్యాలీలో ప్రారంభించిన బ్రిడ్జికి ఇరువైపులా గులాబీ జెండాలు ఏర్పాటు చేశారు. మరోవైపు, ఖాజాగూడ పెద్ద చెరువు నుంచి ఉర్దూ వర్సీటీ ప్రహారీని ఆనుకొని రెండు కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల రోడ్డు రూ.47.66 కోట్లతో నిర్మించారు. 3.5 కి.మీ. నిర్మించాల్సిన ఈ రోడ్డును ఆస్తుల సేకరణ జరగకపోవడంతో 2 కి.మీ. మాత్రమే నిర్మించారు. కొన్ని రియల్‌ సంస్థల ప్రాజెక్టులకు డిమాండ్‌ పెంచేందుకే రహదారి నిర్మించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Read more