దోచుకుందాం.. దాచుకుందాం!
ABN , First Publish Date - 2022-12-16T02:18:47+05:30 IST
కరీంనగర్, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఇద్దరూ ఏకమయ్యారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. ‘కమీషన్లతో దోచుకుందాం.. దాచుకుందాం’ అన్నట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సీఎంలు ఇద్దరూ కుమ్మక్కయ్యారన్నారు. ప్రజలు తిరస్కరిస్తే ‘జై
తెలుగు రాష్ట్రాల సీఎంల తీరిదే
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రులు కుమ్మక్కయ్యారు
జనం తిరస్కరిస్తే ‘జై తెలంగాణ’..
‘జై ఆంధ్ర’ నినాదాలు తెరపైకి
కరీంనగర్ గడ్డ.. బీజేపీ అడ్డా: బండి
కరీంనగర్, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఇద్దరూ ఏకమయ్యారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. ‘కమీషన్లతో దోచుకుందాం.. దాచుకుందాం’ అన్నట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సీఎంలు ఇద్దరూ కుమ్మక్కయ్యారన్నారు. ప్రజలు తిరస్కరిస్తే ‘జై తెలంగాణ అని నేనంటా.. జై ఆంధ్రా అని నువ్వు అను’ అని ఇద్దరూ అవగాహనకు వచ్చారని చెప్పారు. ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా గురువారం కరీంనగర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో సంజయ్ మాట్లాడారు. ‘‘తెలుగు రాష్ట్రాలు సీఎంలు కలిసి బిర్యానీలు తిన్నరు. ఇద్దరు కలిసి కాంప్రమైజ్ పాలిటిక్స్ చేస్తూ.. దోచుకుందాం.. కమీషన్లు దాచుకుందాం అనుకుంటున్నరు’’ అని ఆరోపించారు. రెండు రాష్ట్రాల నాయకుల చరిత్రను తెలంగాణ ప్రజలు గుర్తుంచుకోవాలని బండి వ్యాఖ్యానించారు. ‘తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజలు టీఆర్‌ఎస్ కారు గుర్తుకు రెండుసార్లు ఓటేశారు. తెలంగాణ తల్లికి పెద్ద కొడుకునని, రాష్ట్రాన్ని, ప్రజల్ని కాపాడుకుంటానని చెప్పిన కేసీఆర్.. ఉద్యమకారులను బయటకు పంపాడు. ఇప్పుడు తెలంగాణ బంధాన్ని తెంపుకొని బీఆర్‌ఎస్ పార్టీ పెట్టి కన్నతల్లికి ద్రోహం చేసిన మూర్ఖుడు’ అని విమర్శించారు. ఒక్క మోదీని ఎదుర్కొనేందుకు గుంట నక్కలు ఏకమవుతున్నాయన్నారు. ఈ గడ్డ మీద పౌరుషం, ఆవేఽశం ఉందని.. తాను ఇక్కడే పుట్టానని, ధర్మం కోసం పనిచేయడమే తప్ప విజయం కోసం అడ్డదారులు తొక్కనని చెప్పారు. తనకు గెలుపు ముఖ్యం కాదని, ధర్మం కోసం పని చేయడమే లక్ష్యమని అన్నారు. బీజేపీ అధిష్ఠానం 2019లో కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించిందని.. ఆ ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాదని హేళన చేశారని తెలిపారు. కానీ, గులాబీ జెండాను బొంద పెట్టి లక్ష మెజారిటీతో కాషాయ జెండాను ఎగురవేసిన తర్వాత యావత్ దేశం ఆశ్చర్యపోయిందని అన్నారు. ఇక్కడి ప్రజలు గెలిపించడం వల్లే జాతీయ నాయకత్వం గుర్తించి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని చేసిందని తెలిపారు. కరీంనగర్ ప్రజలకు రుణపడి ఉంటానన్నారు.
ఫాంహౌస్ నుంచిలాక్కొచ్చాం
టీఆర్‌ఎస్ పాలన అవినీతిమయమైందని, కేసీఆర్ గడీలను బద్ధలు కొట్టాలని, ప్రతి యువకుడి చేతిలో కాషాయం జెండా పెట్టాలని, ప్రతి నోటా జై శ్రీరాం అనేలా చేయాలనే బాధ్యతను తనకు అప్పగించారని సంజయ్ ఉద్వేగంగా చెప్పారు. ఎనిమిదేళ్లు ప్రగతి భవన్‌కు, ఫామ్‌హౌస్‌కే పరిమితమైన కేసీఆర్‌ను ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా బయటకు లాక్కొచ్చామని తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీ పెట్టి దేశాన్ని దోచుకునే ప్రయత్నం మొదలు పెట్టారన్నారు. అభివృద్ధి కోసం కేంద్రం నిధులు ఇస్తుంటే, రాష్ట్రం వాటా చెల్లించకుండా అడ్డు పడుతున్నారని, ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా 24 గంటలు ప్రధాని మోదీని తిడుతున్నాడని ధ్వజమెత్తారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక పేదలకు ఇళ్లు కట్టిస్తామని చెప్పారు. ఒకటో తేదీ నాడు వేతనాలు ఇచ్చే ప్రభుత్వం కావాలా? జీతాలు ఇచ్చినా, ఇవ్వకపోయినా పర్వాలేదనుకునే ప్రభుత్వం కావాలో తేల్చుకోవాలని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ అంటే బంది పోట్ల రాష్ట్ర సమితి అని, బార్ అండ్ రెస్టారెంట్ పార్టీ అని ఎద్దేవా చేశారు. భాగ్యలక్ష్మి గుడి నుంచి ప్రారంభించిన యాత్రను భైంసా వరకు చేశామని, అక్కడి హిందూ సమాజం, కుటుంబాలను కాపాడుకుంటామని, చకినాలపై ఉచ్చ పోసిన వాళ్లకు హెచ్చరికలు చేశామని సంజయ్ చెప్పారు. కరీంనగర్ గడ్డ.. బీజేపీ అడ్డా అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనన్నారు. సభలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీలు ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, డీకే అరుణ, జి.వివేక్, బూర నర్సయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.