పీఆర్సీని ఏడాది వాయిదా వేసుకుందాం

ABN , First Publish Date - 2022-02-19T07:12:19+05:30 IST

‘‘విద్యుత్‌ సంస్థల ఆర్థిక పరిస్థితేం బాగాలేదు. ఆదాయమంతా

పీఆర్సీని ఏడాది వాయిదా వేసుకుందాం

    • ప్రతిపాదనను ఉద్యోగులు పరిశీలించాలి
    • విద్యుత్తు సంస్థల ఆర్థిక పరిస్థితి బాగాలేదు
    • కార్మిక సంఘాలతో భేటీలో విద్యుత్తు సంస్థల సీఎండీలు
  •   కచ్చితంగా కావాలంటే వేతన సవరణకు కమిటీ వేస్తాం

  •  ఏడేళ్లలో 150ు వేతనాలు పెంచుకున్నాం
  •  విద్యుత్‌ సంస్థల ఆర్థిక పరిస్థితేం బాగాలేదు
  •  ఆదాయమంతా కరెంటు కొనుగోళ్లకే పోతోంది
  •  వేతన సవరణపై గొంతెమ్మ కోర్కెలు కోరొద్దు
  •  కార్మిక సంఘాలతో భేటీలో  ‘విద్యుత్‌’ సీఎండీలు  


హైదరాబాద్‌, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): ‘‘విద్యుత్‌ సంస్థల ఆర్థిక పరిస్థితేం బాగాలేదు. ఆదాయమంతా కరెంట్‌ కొనుగోళ్లకే సరిపోతుంది. విద్యుత్‌ సంస్థల పట్ల కేంద్రం వైఖరేం బాగాలేదు. రుణాల మంజూరు/విడుదలపై ఆంక్షలు అమలవుతున్నాయి. ఏడేళ్లలో విద్యుత్‌ ఉద్యోగుల వేతనాలు 150ు మేర పెరిగాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, డిస్కమ్‌ల ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని ఏడాది పాటు వేతన సవరణ (పీఆర్సీ)ను వాయిదా వేసుకుందాం. ఈ పరిస్థితిని ఉద్యోగులు అర్థం చేసుకోవాలి. సంస్థల ఆర్థిక పరిస్థితిని ప్రతి ఉద్యోగికి వివరించాలి. వేతన సవరణపై మీ అభిప్రాయాలు కూడా చెప్పండి. కచ్చితంగా వేతనాలు పెరగాల్సిందే అంటే.. దానికి ముఖ్యమంత్రి కూడా సుముఖంగానే ఉన్నారు. వేతన సవరణ కమిటీ వేస్తాం. గొంతెమ్మ కోర్కెలు కోరొద్దు. మా విజ్ఞప్తిని సంఘాలు పరిశీలించాలి’’ అని విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలు విద్యుత్‌ ఉద్యోగులు, కార్మికులకు విజ్ఙప్తి చేశాయి.


శుక్రవారం హైదరాబాద్‌ (ఎర్రగడ్డ జీటీఎస్‌ కాలనీలోని శక్తిభవన్‌)లో ఉద్యోగ, కార్మిక సంఘాలతో జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు, జేఎండీ చెరుకూరి శ్రీనివాసరావు, ఎస్పీడీసీఎల్‌ సీఎండీ జి.రఘుమారెడ్డి, ఎన్పీడీసీఎల్‌ సీఎండీ ఎ.గోపాలరావు తదితరులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు సంస్థల ఆర్థిక పరిస్థితిని సమగ్రంగా వివరించారు. ‘‘2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.6831 కోట్ల మేర కరెంట్‌ చార్జీల పెంపును ప్రతిపాదించాం. ఆ మేరకు ఈఆర్‌సీ అనుమతినిస్తే.. రెవెన్యూ లోటును రూ.4097 కోట్ల మేరకు అంతర్గత సామర్థ్యంతో భర్తీ చేసుకోవాలి, ట్రాన్స్‌కో, జెన్‌కో పనితీరు బాగానే ఉన్నా, పంపిణీ సంస్థలు (ఎస్పీడీసీఎల్‌, ఎన్పీడీసీఎల్‌)ల పరిస్థితేం బాగాలేదు. విద్యుత్‌ పంపిణీ వ్యవస్థను మెరుగుపరచడానికి వేల కోట్లు వెచ్చిస్తున్నాం. మార్పులేం రావడం లేదు’’ అని పేర్కొన్నారు.


కొత్త కనెక్షన్లు ఇస్తూనే.. లోడు ఆధారంగా చార్జీలు వసూలు చేయాలని అధికారులకు వారు సూచించారు. పెరిగిన లోడును క్రమబద్ధీకరించుకోని వారిని గుర్తించి వెంటనే నోటీసులు ఇవ్వాలని, నిరంతరం తనిఖీలు చేయాలని ఆదేశించారు. ఏడేళ్లుగా ప్రభుత్వం కరెంట్‌ చార్జీలు పెంచడానికి అనుమతినివ్వలేదని, దీనివల్ల నష్టాలు భారీగా పెరిగాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రగతిలో మనం కూడా భాగస్వాములయ్యామని, అన్నివర్గాలకు 24 గంటల పాటు విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని, సగటు విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ దేశంలోనే అగ్రభాగంలో ఉందని చెప్పారు.


కరోనా కారణంగా పరిశ్రమలు, వాణిజ్యానికి సంబంధించి విద్యుత్‌ వినియోగం పెరగలేదని. గృహ వినియోగం పెరిగినా.. వాణిజ్య, పారిశ్రామిక వినియోగం పెరిగితేనే డిస్కమ్‌లకు ఆదాయం పెరుగుతుందన్నారు. సంస్థల ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని ఫిట్‌మెంట్‌ను కోరాలని విద్యుత్‌ సంఘాలను సంస్థల సీఎండీలు కోరారు. ఈ సమావేశంలో 33 విద్యుత్‌ సంఘాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-02-19T07:12:19+05:30 IST