బీజేపీని గద్దె దించే వరకూ పోరాడదాం
ABN , First Publish Date - 2022-01-12T07:44:00+05:30 IST
‘‘బీజేపీ విచ్చిన్నకర విధానాలను తిప్పికొట్టేందుకు దేశంలోని లౌకిక శక్తులు ఏకం కావాల్సిన అవసరం ఉంది.
- లౌకిక శక్తులన్నీ ఏకం కావాలి.. త్వరలో కార్యాచరణ
- సీఎం కేసీఆర్, ఆర్జేడీ ముఖ్యనేత తేజస్వీల భేటీలో చర్చ!
- జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించండి
- కేసీఆర్‌కు లాలూ ప్రసాద్ ఆహ్వానం.. ఫోన్లో సంభాషణ
హైదరాబాద్, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): ‘‘బీజేపీ విచ్చిన్నకర విధానాలను తిప్పికొట్టేందుకు దేశంలోని లౌకిక శక్తులు ఏకం కావాల్సిన అవసరం ఉంది. బీజేపీని గద్దె దించేందుకు పోరాటం చేయాలి. ఇందుకోసం కార్యాచరణను త్వరలో నిర్ణయించుకోవాలి’’ అని రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) ముఖ్యనేత, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వీ ప్రసాద్‌యాదవ్, సీఎం కేసీఆర్‌ల భేటీలో ఏకాభిప్రాయానికి వచ్చారు. తేజస్వీ, ఆర్జేడీ నేతలు మంగళవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ చర్చల్లో మంత్రి కేటీఆర్, ఎంపీ జోగినిపల్లి సంతో్‌షకుమార్ పాల్గొన్నారు. టీఆర్ఎస్ వర్గాల సమాచారం ప్రకారం.. లౌకికవాద ప్రజాస్వామిక శక్తుల ఐక్యసంఘటన దిశగా దేశ రాజకీయ పోరాటాన్ని ఉధృతం చేయాలన్న అంశంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశం నుంచే లాలూ ప్రసాద్‌యాదవ్‌కు ఫోన్ చేసిన సీఎం కేసీఆర్.. ఆయన ఆరోగ్య క్షేమ, సమాచారాలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అప్పట్లో ఆర్జేడీ మద్దతు ఇచ్చిన సంగతినీ గుర్తు చేసుకున్నారు. జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించేందుకు ముందుకు రావాలంటూ కేసీఆర్‌ను లాలూ ప్రసాద్ ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథాన నడిపిస్తున్న కేసీఆర్ పాలనా అనుభవం దేశానికి అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
యూపీ రాజకీయాలపై విశ్లేషణ
దేశ సమగ్రతను కాపాడే దిశగా జాతీయ రాజకీయాలను బలోపేతం చేయాలని, అందుకోసం సాగే బీజేపీ వ్యతిరేక పోరాటంలో కలిసి సాగుతామని తేజస్వీ యాదవ్, ఆర్జేడీ నేతలు సీఎం కేసీఆర్‌కు తెలిపారు. ఇందులో కేసీఆర్ ప్రధాన పాత్ర పోషించాల్సిన అవసరం ఉందంటూ వారు అన్నారు. యూపీలో మంత్రి సహా ఒక్కొక్క ఎమ్మెల్యే బీజేపీని వీడుతుండడం ఆ పార్టీ పతనానికి నాందిగా సమావేశంలో విశ్లేషణ జరిగింది. అఖిలేశ్‌కు ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ మద్దతు పలకడం గొప్ప పరిణామమన్న ప్రస్తావనా వచ్చింది. లౌకిక శక్తుల పునరేకీకరణ దిశగా కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు ఆర్జేడీ నుంచి మద్దతు ఉంటుందని తేజస్వీ బృందం స్పష్టం చేసింది.