న్యాయవాది హత్య కేసు.. సుమోటోగా స్వీకరించిన హైకోర్టు
ABN , First Publish Date - 2022-08-04T10:50:45+05:30 IST
న్యాయవాది మల్లారెడ్డి హత్య కేసును హైకోర్టు సుమోటో ప్రజాహిత వ్యాజ్యంగా విచారణకు స్వీకరించింది.
హైదరాబాద్, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): న్యాయవాది మల్లారెడ్డి హత్య కేసును హైకోర్టు సుమోటో ప్రజాహిత వ్యాజ్యంగా విచారణకు స్వీకరించింది. న్యాయవాది మల్లారెడ్డి హత్యకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిన హైకోర్టు న్యాయవాదులు.. అడ్వొకేట్ ప్రొటెక్షన్ బిల్లుకు ఆమోదం తెలుపాలని తీర్మానం చేశారు. ఈ ఘటనపై సుమోటోగా విచారణ చేపట్టాలని హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.రఘునాథ్ నేతృత్వంలో చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌కు మంగళవారం లేఖ రాశారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం చట్టబద్ధంగా విధులు నిర్వహిస్తున్న న్యాయవాదులకు రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయిందని ఆ లేఖలో పేర్కొన్నారు. సరైన రక్షణ వ్యవస్థ లేకపోతే దాడుల ద్వారా, హింస ద్వారా న్యాయాన్ని అడ్డుకునే పరిస్థితులు ఏర్పడుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న దాడులతో లాయర్లు భయాందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అడ్వొకేట్ ప్రొటెక్షన్ బిల్లు ను ఆమోదించేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేయాలని ఆ లేఖలో కోరారు. గట్టు వామన్‌రావు దంపతులను కూడా నడిరోడ్డుపై హత్య చేశారని గుర్తుచేశారు. కేసులను న్యాయస్థానాల్లో ఎదుర్కోలేకే హత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. హైకోర్టు ప్రత్యక్ష పర్యవేక్షణ ద్వారానే నేరస్థులకు కఠిన శిక్షలు పడుతాయని పేర్కొన్నారు. దీంతో ప్రధాన న్యాయమూర్తి ఈ కేసును సుమోటోగా స్వీకరించారు. దీన్ని చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నేతృత్వంలోని ధర్మాసనం త్వరలో విచారణ చేపట్టనుంది. ఈ కేసులో చీఫ్ సెక్రటరీ, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, డీజీపీ, ములుగు ఎస్పీ తదితరులను పార్టీలు చేర్చారు.