మిగులు భూమినీ మింగేస్తున్నారు...

ABN , First Publish Date - 2022-03-11T05:04:50+05:30 IST

అవి కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములు.. సీలింగ్‌ కింద ప్రకటించి ప్రజల అవసరాల కోసం నిర్దేశించిన ఈ భూములపై భూ కబ్జాదారుల కన్ను పడింది.

మిగులు భూమినీ మింగేస్తున్నారు...
జామాయిల్‌ తోట కంచెకు ప్రభుత్వ భూమి అని రాసిన దృశ్యం

నగర శివారులోని జక్కలొద్దిలో  50 ఎకరాల్లో కబ్జాల పర్వం

20 ఎకరాల్లో పాగా వేసిన అక్రమార్కులు

తాజా సర్వేలో గుర్తించిన  రెవెన్యూ అధికారులు

హద్దులు పాతి, ఎర్రజెండాల ప్రదర్శన

భూ మాయలో చక్రం తిప్పుతున్న టీఆర్‌ఎస్‌ నేత

వరంగల్‌, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): అవి కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములు.. సీలింగ్‌ కింద ప్రకటించి ప్రజల అవసరాల కోసం నిర్దేశించిన ఈ భూములపై భూ కబ్జాదారుల కన్ను పడింది. ఇతర సర్వే నెంబర్లలో తమకు భూమి ఉన్నట్టు రికార్డుల్లో చూపుతూ, వాస్తవంలో మాత్రం మిగులు(సీలింగ్‌) భూముల్లో పాగా వేస్తున్నారు. కోట్ల విలువ చేసే భూములను అప్పనంగా హాంఫట్‌ చేసేందుకు పావులు కదుపుతున్నారు. ఈ భూకుంభకోణం నగరపరిధిలోని జక్కలొద్దిలో (మైనారిటీ రెసిడెన్షియల్‌ గురుకులం సమీపంలో) దర్జాగా సాగుతోంది.  తూర్పు నియోజకవర్గపరిధిలోని ఓ ద్వితీయ శ్రేణి టీఆర్‌ఎస్‌ నాయకుడు ఇందులో  కీలకపాత్ర పోషిస్తుండటం గమనార్హం.  గత మూడు రోజులుగా రెవెన్యూ అధికారుల సర్వేలో మిగులు భూముల కబ్జా వెల్లడి కాగా, హద్దులు పాతి వాటిపైన ప్రభుత్వ భూములు అని అందరికీ కనిపించేలా రాశారు. వివరాల్లోకి వెళ్లితే...

వరంగల్‌ జిల్లా ఖిలావరంగల్‌ మండలంలోని జక్కలొద్ది ప్రాంతంలో మెయినోద్దీన్‌ ఖాద్రీ అనే వ్యక్తికి దశాబ్దాల క్రితం 298 ఎకరాల భూమి ఉండేది. అయితే ఈ భూములకు సంబంధించి రైతులకు, టెనెంట్‌దారులకు అనేక సంవత్సరాలుగా వివాదాలు నడుస్తున్నాయి. 2006 నుంచి రాజకీయ పలుకుబడి ఉన్న బడావ్యక్తులు...  రైతులను, టెనెంట్‌దారులను, డిక్లరెంట్‌లను నయానోభయానో బెదిరించి, ఒప్పించి వారినుంచి చౌకగా భూములు కొనుగోలుచేస్తూ వచ్చారు.  ఈ వ్యవహారంలో కోట్లరూపాయల చేతులు మారాయి. అనేక సంవత్సరాలుగా సాగు చేసుకున్న రైతులు రాజకీయ దళారుల వలలో చిక్కి భూములను అమ్ముకొని రోడ్డున పడ్డారు. ఈ భూముల విషయంలో ఇంకా కోర్టు కేసులు నడుస్తున్నాయి. చట్టబద్దమైన హక్కులు తమకే ఉన్నాయంటూ  టెనెంట్‌దారులు ఇప్పటికీ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. 

మరోవైపు ఇదే ప్రాంతంలో 50 ఎకరాల ప్రభుత్వ మిగులు భూమి ఉంది. తిమ్మాపురం రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్లు 102తో పాటు 105 నుంచి 108 వరకు, 120, 121, 128లలో ఈ భూములు ఉన్నాయి. ఈ సర్వే నెంబర్లలో రైతులు/టెనెంట్‌దారులు, డిక్లరెంట్‌లకు కూడా భూములు ఉన్నాయి. భూ కబ్జాదారులు వీరి నుంచి భూములను కొనుగోలు చేసినట్టుగా రికార్డుల్లో చూపుతూ, వాస్తవంలో మాత్రం మిగులుభూముల్లో పాగా వేస్తున్నారు. ఇలా 50 ఎకరాల మిగులు భూముల్లో గరిష్ట భాగం  అన్యాక్రాంతమయ్యాయి. వీటిలో కొందరు వరి, యూకలిప్టస్‌, జనుము, మొక్కజొన్న సాగు చేస్తుండగా, కొందరు ఏకంగా రేకులషెడ్‌లతో తాత్కాలిక నిర్మాణాలు చేశారు.  ఇంకా కొందరైతే మిగులు భూములకు రైతుబంధు సైతం పొందుతున్నట్టు సమాచారం.  అనేక ఏళ్లుగా ఈ కబ్జాలపర్వం బహిరంగంగా జరుగుతుండగా, రెవెన్యూసిబ్బంది చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఎంతో విలువైన ఈ 50 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రజల అవసరాల కోసం ఉపయోగించాలని వినతులు వెల్లువెత్తినా, వాటిని కాపాడటంతో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. 

తాజా సర్వే...

ఖిలా వరంగల్‌ మండలాన్ని గత ఏడాది హనుమకొండ (వరంగల్‌ అర్బన్‌) జిల్లా నుంచి వరంగల్‌ (రూరల్‌)జిల్లాకు మార్చడంతో  రెవెన్యూ అధికారులు గత కొన్ని రోజులుగా  ప్రభుత్వ భూములను తనిఖీ చేసున్నారు. ఈ క్రమంలో వరంగల్‌ రెవెన్యూ డివిజనల్‌ అధికారి మహేందర్‌జీ నేతృత్వంలో అధికారులు మ్యాపులు, సర్వే నెంబర్ల ప్రకారం జక్కలొద్దిలో క్షుణ్ణంగా సర్వే నిర్వహించారు. ప్రభుత్వానికి చెందిన మిగులు భూమి 50 ఎకరాల్లో దాదాపు 20 ఎకరాల్లో ప్రైవేటు వ్యక్తులు నిబంధనలకు విరుద్దంగా కబ్జాలో ఉన్నట్టు తేలింది. జనుము, యూకలిప్టస్‌, వరి, మొక్కజొన్న లాంటి పంటలను సాగు చేస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు.   దీంతో స్థానిక రెవెన్యూ అధికారులు వివిధ సర్వే నెంబర్లలో ఉన్న 50 ఎకరాలకు సిమెంట్‌ దిమ్మెలతో హద్దులు ఏర్పాటు చేసి, ఎర్రజెండాలు పాతారు.  అందరికీ కనిపించే విధంగా ప్రభుత్వ భూమి అని సిమెంట్‌ దిమ్మెలపై పెయింట్‌ చేశారు. 

కోట్ల రూపాయల భూమిపై కన్ను

నగరానికి అత్యంత సమీపంలో ఉన్న జక్కలొద్ది భూములపై బడా నేతల కళ్లుపడ్డాయి. ఇప్పటికే అనేకమంది రాజకీయ, రాజకీయేతర ప్రముఖులు ఇక్కడ భూములు కొనుగోలు చేశారు. ఒకప్పుడు పచ్చని పొలాలతో కనువిందు చేసిన ఈ ప్రాంతం.. ఇప్పుడు సిమెంట్‌ ప్రహరీలతో కాంక్రీటు వనంగా దర్శనమిస్తోంది.  రైతులు-టెనెంట్‌దారుల మధ్య ఉన్న వివాదాలను ఆసరా చేసుకొని 15 ఏళ్ల క్రితం  పలువురు బడా బాబులు  రూ.3లక్షలకు ఎకరం చొప్పున కొనుగోలుచేశారు. ఇప్పుడు ఎకరం రూ.3కోట్లకుపైగా పలుకుతోంది. ఈ క్రమంలోనే దళారులు 50 ఎకరాల ప్రభుత్వ మిగులు భూమిపై కన్నేశారు. ఉన్న ఈ భూమిని కూడా బినామీ పత్రాలు, అక్రమ పాస్‌పుస్తకాలు, బోగస్‌ సర్వేనెంబర్లతో కాజేసే ప్రయత్నం చేస్తున్నారు. మిగులు భూమి మొత్తం విలువ ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం రూ.150 కోట్ల పైనే ఉంటుంది. దీంతో రాజకీయ పలుకుబడిని ప్రయోగించి హాంఫట్‌ చేసే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. మొత్తం 8 సర్వే నెంబర్లలో మిగులు భూములు ఉండగా, వీటిలో ఇతర భూములను కొన్నట్టుగా చూపి, వాటిని గుప్పిట పడుతున్నారు. మొదటి నుంచీ జక్కలొద్ది భూముల కుంభకోణంలో ఆరితేరిన టీఆర్‌ఎస్‌కు చెందిన ఓ నాయకుడు... మిగులు భూముల మాయలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నట్టు తెలిసింది. ఈయన గుప్పిట్లోనే ఎక్కువభాగం ఉన్నట్టు చెబుతున్నారు. అమాయక రైతులను బురిడీ కొట్టిస్తూ పావులుగా వాడుకుంటున్నట్టు తెలిసింది. 

ప్రహరీ నిర్మించాలి...

జక్కలొద్దిలోని 50 ఎకరాల ప్రభుత్వ మిగులు భూమి పరిరక్షణకు ఉన్నతాధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా హద్దురాళ్లు పాతారని, కానీ కబ్జాదారులు వాటిని తొలగించినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం పాతిన సిమెంట్‌ దిమ్మెలు కూడా ఎన్నో రోజులు ఉండవని వారు  అంటున్నారు. అందువల్ల తాజా సర్వేలో గుర్తించిన మిగులుభూముల చుట్టూ ప్రహరీ నిర్మించి, బోర్డులు ప్రదర్శించాలని కోరుతున్నారు. అలాగే ఈ భూములను ప్రజావసరాల కోసం ఉపయోగించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ప్రస్తుతం గుర్తించిన మిగులు భూముల్లో ఉన్న పంటలను, నిర్మాణాలను వెంటనే తొలగించాలని పలువురు సూచిస్తున్నారు.  


Updated Date - 2022-03-11T05:04:50+05:30 IST