రేవంత్‌కు విమర్శించే హక్కులేదు

ABN , First Publish Date - 2022-08-04T09:14:02+05:30 IST

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తనపై విమర్శలు చేయడంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

రేవంత్‌కు విమర్శించే హక్కులేదు

  • ఓటుకు నోటు కేసులో అరెస్టయిన వ్యక్తి 
  • అధిష్ఠానానికి మాయమాటలు చెప్పి..
  • టీపీసీసీ అధ్యక్ష పదవి తెచ్చుకున్నారు
  • కాంగ్రెస్‌ పార్టీకి ఆయన చేసిందేమీ లేదు
  • మునుగోడు అభివృద్ధి కోసమే రాజీనామా
  • కురుక్షేత్ర సంగ్రామానికి సిద్ధం: రాజగోపాల్‌రెడ్డి


మర్రిగూడ, ఆగస్టు 3: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తనపై విమర్శలు చేయడంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏనాడూ పోరాడని, ఓటుకు నోటు కేసులో అరెస్టయిన రేవంత్‌రెడ్డికి తనను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా నాంపల్లిలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంట్రాక్టులకు ఆశపడి కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశానని రేవంత్‌రెడ్డి ఆరోపించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. రేవంత్‌రెడ్డి బీజేపీ, టీఆర్‌ఎస్‌, టీడీపీ నుంచి చివరికి కాంగ్రె్‌సలో చేరిన వ్యక్తి అని, అలాంటిది తనను పదవుల కోసం, కాంట్రాక్టుల కోసం పార్టీ మారాననడం సిగ్గుచేటన్నారు. అధిష్ఠా నం వద్ద మాయమాటలు చెప్పి పీసీసీ అధ్యక్ష పద వి తెచ్చుకున్నారు తప్ప.. పార్టీ కోసం రేవంత్‌ చేసిందేమీ లేదన్నారు. మునుగోడు నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసమే తాను రాజీనామా చేశానని స్పష్టం చేశారు. కురుక్షేత్ర సంగ్రామానికి సిద్ధమని ప్రకటించారు. 


సీఎం కేసీఆర్‌ మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయడంలేదని, ఉప ఎన్నిక వచ్చిన నియోజకవర్గాలకు మాత్రమే అధిక నిధులు మంజూరు చేస్తున్నారని ఆరోపించారు. మునుగోడు అభివృద్ధికి వెయ్యి కోట్లు కేటాయిస్తే తాను రాజీనామాకు సిద్ధమని గతంలోనే ప్రకటించానని గుర్తు చేశారు. ఉప ఎన్నిక కేసీఆర్‌ కుటుంబ పాలనను అంతమొందించడానికి జరిగే ధర్మ యుద్ధమని పేర్కొన్నారు. అంతకుముందు నాంపల్లి మండలం ఉన్నత పాఠశాల విద్యార్థులకు ప్రొజెక్టర్‌ ద్వారా విద్యనందించడానికి వీలుగా కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్‌ ద్వారా రూ.2 లక్షల విలువైన ప్రొజెక్టర్‌ను రాజగోపాల్‌రెడ్డి బహూకరించారు. నియోజకవర్గంలో 159 పాఠశాలల విద్యార్థుల కోసం డిజిటల్‌ ప్రొజెక్టర్‌ అందజేయడానికి ఆరునెలల క్రితమే రూ.3 కోట్లను ఫౌండేషన్‌ ద్వారా కేటాయించినట్లు ఆయన తెలిపారు.

Updated Date - 2022-08-04T09:14:02+05:30 IST