కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డీ బీజేపీలోకి?

ABN , First Publish Date - 2022-08-04T09:11:55+05:30 IST

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా నిర్ణయం కాంగ్రెస్‌ పార్టీలో చిచ్చు రేపుతోంది.

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డీ బీజేపీలోకి?

  • వారి కుటుంబాన్ని అవమానించేలా రేవంత్‌ వ్యాఖ్యలు
  • రాజగోపాల్‌ను బుజ్జగించాలన్నా ఠాగూర్‌ వినలేదు
  • సోదరులిద్దరూ పార్టీని వీడితే కాంగ్రెస్‌కు నష్టం
  • ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ వద్ద
  • నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌ సీనియర్ల అభిప్రాయం
  • జానారెడ్డి కుమారుడి పైనా బీజేపీ కన్ను!


న్యూఢిల్లీ, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా నిర్ణయం కాంగ్రెస్‌ పార్టీలో చిచ్చు రేపుతోంది. ఏడాది కాలంగా రాజగోపాల్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా.. ఆయనను పార్టీలో కొనసాగించే విషయంపై రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌ ఆసక్తి చూపలేదని నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్‌ నేతలతోపాటు కొందరు ఇతర ప్రాంతాల నేతలు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. రాజగోపాల్‌రెడ్డితోపాటు కోమటిరెడ్డి కుటుంబాన్ని కూడా అవమానించేలా మాట్లాడారని, దీంతో ఆయన సోదరుడు, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా బీజేపీలో చేరే అవకాశం ఉందని వారు చెప్పినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రాజగోపాల్‌రెడ్డి నిష్క్రమణ వల్ల కాంగ్రె్‌సకు రెండు మూడు నియోజకవర్గాల్లో నష్టం జరుగుతుందని, కానీ.. వెంకట్‌రెడ్డి కూడా వెళ్లిపోతే ఐదారు నియోజకవర్గాలను కోల్పోతామని వేణుగోపాల్‌ వద్ద వారు అన్నారు. 


భవిష్యత్తులో ఈ నష్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని నివేదించారు. రాజగోపాల్‌రెడ్డి అసంతృప్తితో ఉన్న చిన్నపిల్లాడి లాంటివారని, ఆయనను బుజ్జగించాలని తాము మాణిక్కం ఠాగూర్‌కు ఏడాది క్రితమే చెప్పామని తెలిపారు. జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్‌ బాబు లాంటివారు కూడా చెప్పారని అన్నారు. అయినా ఠాగూర్‌ పట్టించుకోలేదని, పైగా ఆయనను పార్టీ నుంచి పంపించే విధంగానే వ్యవహరించారని చెప్పారు. రోశయ్య, పొన్నాల పీసీసీ అధ్యక్షులుగా ఉన్నప్పడు కూడా రాజగోపాల్‌రెడ్డి ఇదేవిధంగా వ్యవహరించారని, అయినా.. తమ సీట్లను గెలిపించుకుంటూ వచ్చారని వారు గుర్తు చేశారు. కాగా, ఈ నష్టం ఇంతటితో ఆగకపోవచ్చునని, బీజేపీ నేతలు జానారెడ్డి కుమారుడిపై కూడా కన్నేశారని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. మరోవైపు రాజగోపాల్‌రెడ్డి రాజీనామాపై బీజేపీ జాతీయస్థాయి నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నల్లగొండ జిల్లాలో తమ ఓటు శాతం ఎంత పెరిగినా అది తమకు ప్రయోజనకరమేనని, తాము కాంగ్రెస్‌ను అధిగమించగలమని బీజేపీ సీనియర్‌ నాయకుడు ఒకరు అన్నారు. 

Read more