Munugode by-election: నన్ను కొనే శక్తి పుట్టలేదు: రాజగోపాల్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-08-22T00:20:34+05:30 IST

నన్ను కొనే శక్తి పుట్టలేదు.. పుట్టబోదు. నేను అమ్ముడుపోయే వ్యక్తిని కాదు.. నేను ఏ తప్పు చేయలేదు

Munugode by-election: నన్ను కొనే శక్తి పుట్టలేదు: రాజగోపాల్‌రెడ్డి

మనుగోడు: ‘‘నన్ను కొనే శక్తి పుట్టలేదు.. పుట్టబోదు. నేను అమ్ముడుపోయే వ్యక్తిని కాదు.. నేను ఏ తప్పు చేయలేదు’’ అని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (Komati Reddy Rajagopal Reddy) ప్రకటించారు. మునుగోడు (Munugode)లో నిర్వహించిన సమరభేరీ సభలో కోమటిరెడ్డి మాట్లాడుతూ మునుగోడు బైపోల్ తెలంగాణ (Telangana) ఆత్మగౌరవం కోసమేనని చెప్పారు. అమ్ముడుపోయానని తనపై దుష్ప్రచారం చేశారని దుయ్యబట్టారు. అమ్ముడుపోతే ఎందుకు పదవికి, పార్టీకి రాజీనామా ఎందుకు చేస్తా? అని ప్రశ్నించారు. ప్రాణం పోయినా మునుగోడు ప్రజలు తలదించుకునే పని చేయనని ప్రకటించారు. అవినీతిపరుల చేతిలో చిక్కిన తెలంగాణను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా యుద్ధం జరుగుతోందని, తెలంగాణలో అరాచక పాలనను అంతమొందించాలని పిలుపునిచ్చారు. మునుగోడు ప్రజల సమస్యలు సీఎం కేసీఆర్‌ (CM KCR)కు తెలియజేయాలనుకున్నానని, ఎన్నిసార్లు అడిగినా సీఎం అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని గుర్తుచేశారు. తనను నమ్ముకున్న ప్రజలకు న్యాయం చేయలేక రాజీనామా చేశానని తెలిపారు. తెలంగాణ ప్రజలు ఆకలిని చంపుకుంటారని, ఆత్మగౌరవాన్ని కాదన్నారు. తన రాజీనామాతో టీఆర్ఎస్ ప్రభుత్వం దిగి వచ్చిందని చెప్పారు. మునుగోడు ప్రజలు చారిత్రక తీర్పు ఇవ్వాలని కోరారు. ఉద్యమకారులు మలి ఉద్యమానికి సిద్ధం కావాలని రాజగోపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు.


Read more