కోట్ల భూమికి.. లక్షలా..?

ABN , First Publish Date - 2022-02-23T08:04:52+05:30 IST

గ్రీన్‌ఫీల్డ్‌ రహదారులు.. ఈ పేరు వింటే ఖమ్మం జిల్లా రైతులు లబోదిబోమంటున్నారు.

కోట్ల భూమికి.. లక్షలా..?

ఎకరం రూ.1-3 కోట్లు.. పరిహారం 25 లక్షలా?

గ్రీన్‌ఫీల్డ్‌ హైవేకు భూములివ్వం 

ఖమ్మం రైతుల స్పష్టీకరణ 

మహబూబాబాద్‌ జిల్లాలోనూ ఆందోళన

కలెక్టర్‌ ఎదుట కంటతడి పెట్టిన మహిళా రైతు

ఇదెక్కడి పరిహారం.. ఇదేం న్యాయం? 


ఖమ్మం, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): గ్రీన్‌ఫీల్డ్‌ రహదారులు.. ఈ పేరు వింటే ఖమ్మం జిల్లా రైతులు లబోదిబోమంటున్నారు. ఖమ్మం-దేవరపల్లి, నాగ్‌పూర్‌-విజయవాడ రెండు గ్రీన్‌ఫీల్డ్‌ జాతీయ రహదారులు ఖమ్మం జిల్లా మీదుగా వెళుతుండడంతో ఇక్కడి రైతులు విలువైన భూములు కోల్పోతున్నారు. ఖమ్మం చుట్టుపక్కల ఎకరం రూ.కోటి నుంచి 3 కోట్లకు పైగా ధరలు పలుకుతుండగా నేషనల్‌ హైవే అథారిటీ మాత్రం ఎకరానికి రూ.25 లక్షల వరకే చెల్లిస్తామని చెబుతోంది. దీంతో రైతులు భూములు ఇవ్వబోమని తెగేసి చెబుతున్నారు. ఖమ్మంలో రైతులు ఇటీవల ధర్నా నిర్వహించి, తక్కువ ధరలకు భూములు ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఖమ్మం-దేవరపల్లి రహదారికి సంబంధించి కల్లూరు డివిజన్‌లో కొంత భూసేకరణకు సహకరిస్తున్నా, ఖమ్మం రెవెన్యూ డివిజన్‌లో మాత్రం నేషనల్‌ హైవే అథారిటీ ఇచ్చే భూమి విలువ తమకు గిట్టుబాటు కాదని, భూములు ఇవ్వబోమని రైతులు భీష్మించారు. మరోవైపు, ఖమ్మం నుంచి ఏపీలోని దేవరపల్లి వరకు నిర్మించబోతున్న గ్రీన్‌ఫీల్డ్‌ రహదారికి కేంద్రం రూ.3,500 కోట్లు కేటాయించింది. ఇందులో ఖమ్మం జిల్లాలో రూ.1,800 కోట్లకు పైగా ఖర్చు చేయనున్నారు.


ఖమ్మం నుంచి సత్తుపల్లి మండలం వేంసూరు వరకు సుమారు 92 కి.మీ. మేర రహదారి నిర్మాణం పంట పొలాల మీదుగానే జరగనుంది. ఈ గ్రీన్‌ఫీల్డ్‌ రహదారికి సంబంధించి తల్లాడ, కల్లూరు, సత్తుపల్లి మండలాల రైతులు ఎకరానికి రూ.25 లక్షలకు అంగీకారం కుదుర్చుకోవడంతో వారికి డబ్బులు కూడా చెల్లించారు. ఖమ్మం నుంచి వైరా వరకు రైతులు మాత్రం భూములు ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు. ఖమ్మం అర్బన్‌ మండలంలోని ధంసలాపురం ప్రాంతంలో భూముల ధర ఎకరం రూ.3 కోట్ల వరకు ఉంది. చింతకాని, వైరా మండలాల్లో భూములు ఎకరం రూ.50 లక్షల నుంచి కోటిన్నరపైగా పలుకుతున్నాయి. దీంతో పరిహారం సరిపోదని రైతులు చెబుతున్నారు.


నాగ్‌పూర్‌-అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ రహదారికీ.. 

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ నుంచి ఏపీ రాజధాని అమరావతి వరకు నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్‌ జాతీయ రహదారి భూసేకరణలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఖమ్మం జిల్లాలో సుమారు 102 కి.మీ. నిర్మించనున్న ఈ రహదారి నిర్మాణానికి 1,100 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఎకరం రూ.కోటి నుంచి 3 కోట్లకు పైగా మార్కెట్‌ విలువ ఉంది. ఈ భూములపై రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల పర్యావరణ అనుమతి కోసం నిర్వహించిన సమావేశాల్లో తాము ఎట్టిపరిస్థితుల్లో భూములు ఇచ్చేది లేదన్నారు. మార్కెట్‌ విలువ ప్రకారం ధరలు చెల్లించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.


భూ సేకరణపై రైతుల ఆగ్రహం

కలెక్టర్‌ ఎదుట కన్నీరు పెట్టిన మహిళా రైతు

నెక్కొండ, ఫిబ్రవరి  22: నాగ్‌పూర్‌-విజయవాడ గ్రీన్‌ఫీల్డ్‌ జాతీయ రహదారి నిర్మాణంలో రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని మహబూబాబాద్‌ కలెక్టర్‌ బి.గోపి అన్నారు. భూములు కోల్పోతున్న జిల్లా రైతులతో నెక్కొండలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ రహదారి హనుమకొండ, వరంగల్‌, మహబూబాబాద్‌, ఖమ్మం జిల్లాల్లోని 48 గ్రామాల మీదుగా వెళుతోందని చెప్పారు. జాతీయ రహదారికి సంబంధించి రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించిన తర్వాతే ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు. తమ అభిప్రాయాలను తీసుకోకుండానే గ్రీన్‌ఫీల్డ్‌ నేషనల్‌ హైవే అధికారులు తప్పుడు నివేదికలతో రహదారి నిర్మాణానికి రంగం సిద్ధం చేస్తున్నారంటూ పలు గ్రామాలరైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వేలో 85 శాతం మంది రైతులు సుముఖత వ్యక్తం చేసినట్లు అధికారులు నివేదికలో పొందుపర్చడంపై మండిపడ్డారు. అలాంటి అధికారులపై రాజద్రోహం కేసులు నమోదుచేయాలని డిమాండ్‌ చేశారు. హైవే నిర్మాణంతో తన కూతురుకి వివాహం సమయంలో ఇచ్చిన అరఎకరం సాగుభూమి కోల్పోవాల్సి వస్తుందంటూ కలెక్టర్‌ సమక్షంలో గీసుకొండ మండలం గంగదేవిపల్లికి చెందిన మహిళారైతు పెండ్లి సునీత కన్నీటి పర్యంతమయ్యారు.


రైతులను షేర్‌ హోల్డర్లుగా చేయాలి 

గ్రీన్‌ఫీల్డ్‌ భూనిర్వాసిత రైతులకు కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వడంతోపాటు షేర్‌ హోల్డర్‌లుగా గుర్తించాలి. రైతుల నుంచి భూములు తీసుకుని, రహదారులు నిర్మించి ప్రైవేటు కంపెనీలకు లీజుకు ఇస్తోంది. టోల్‌గేట్ల ద్వారా ఆయా కంపెనీలు భారీగా సంపాదించుకుంటున్నాయి. ఇలా వచ్చే ఆదాయంలో రైతులకూ ఏటా కొంత వాటా ప్రకటించాలి. - కె.రాజశేఖరరెడ్డి, భూనిర్వాసిత రైతు, కల్లూరు


మార్కెట్‌ ధరకు మించి పరిహారం ఇవ్వాలి      

గ్రీన్‌ఫీల్డ్‌ జాతీయ రహదారికి రైతులు ఇష్టపూర్తిగా భూములు ఇవ్వడంలేదు. ఎకరం భూమి రూ.3 కోట్ల వరకు ఉంటే ప్రభుత్వం ఎకరానికి రూ.25 లక్షలు ఇస్తామని చెప్పడం ఎంత వరకు న్యాయం? ఖమ్మం నగరానికి సమీపంలోని భూములకు డిమాండ్‌ ఉంది. భారీ ధరలు పలుకుతున్నాయి. ఎంతోకాలంగా భూములను నమ్ముకుని బతుకుతున్న రైతులకు తక్కువ పరిహారం ఇస్తే ఎలా? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల గురించి ఆలోచించాలి. 

- వేములపల్లి సుధీర్‌, కామంచికల్‌

Read more