అటకపైకి.. బీఆర్ఎస్!
ABN , First Publish Date - 2022-07-05T08:07:01+05:30 IST
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎ్‌స)ని జాతీయ స్థాయికి విస్తరించి..

- ఇంటిని చక్కదిద్దుకోవడం పైనే కేసీఆర్ దృష్టి
- రాష్ట్ర ప్రభుత్వంపై అసంతృప్తి చల్లార్చేందుకు యత్నం
- 20 నుంచి జిల్లాలకు ముఖ్యమంత్రి.. నేతలతో భేటీ
- సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేకంగా శ్రద్ధ
- ఇళ్లు, పింఛన్లకు నిధుల మంజూరుకు నిర్ణయం
- ధరణి పోర్టల్‌లోని సమస్యల పరిష్కారానికి సదస్సులు
హైదరాబాద్, జూలై 4(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎ్‌స)ని జాతీయ స్థాయికి విస్తరించి.. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గా మార్చే ప్రతిపాదన ప్రస్తుతానికి అటకెక్కిందా? ముందుగా ఇంటిని చక్కదిద్దుకోవడంపైనే సీఎం కేసీఆర్ దృష్టిసారించారా? పార్టీలో, తమ పాలనపై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని చల్లార్చిన తర్వాతనే బీఆర్ఎస్ గురించి ఆలోచించాలని ఆయన భావిస్తున్నారా? టీఆర్ఎస్ వర్గాల సమాచారం ప్రకారం దీనికి ఔననే సమాధానం వస్తోంది. గత నెలలో మంత్రులు, పార్టీ ముఖ్యులతో ప్రగతి భవన్లో భేటీ అయిన సీఎం కేసీఆర్.. జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడం కోసం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని.. భారత రాష్ట్ర సమితిగా మార్చే ప్రతిపాదనను తీసుకొచ్చారు. తర్వాత ఆ దిశగా కొంత కసరత్తు సైతం చేశారు. అయితే, మారిన పరిణామాల్లో దీన్నంతటినీ పక్కనపెట్టి పూర్తిగా పార్టీ, సంక్షేమ పథకాలను గాడినపెట్టే అంశంపైనే దృష్టి సారించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రగతిభవన్‌లో ఇటీవల తన తో సమావేశమైన ఎమ్మెల్యేలకు ఈ మేరకు సంకేతాలిచ్చారని కూడా తెలిసింది. కాగా, సీఎం జిల్లాల పర్యటనను ఈ నెల 20 అనంతరం చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రతి జిల్లాలోనూ కార్యకర్తలకు సమయం ఇవ్వనున్నట్లు తెలిసింది. పలు నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు విజయావకాశాలపై ప్రభావం చూపే పరిస్థితులు ఉన్నాయి. కొందరు నాయకులు ఇతర పార్టీల్లో చేరేందుకూ సన్నాహాలు చేసుకుంటున్నారు. వీటన్నింటినీ చక్కదిద్దేందుకు జిల్లాలకు వెళ్లాలని సీఎం నిర్ణయించారని చెబుతున్నారు.
బీజేపీ ఎదురుదాడితో..
బీఆర్ఎస్ ఏర్పాటు దిశగా కేసీఆర్, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొంత కసరత్తు చేశారు. ప్రధాని మోదీ, బీజేపీ మీద సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ యుద్ధమూ ప్రకటించారు. అయితే బీజేపీనే ఎదురుదాడికి దిగి కేసీఆర్‌ను లక్ష్యం చేసుకుంది. ఈ పరిణామాలతో రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ఆ పార్టీ పట్ల ఆసక్తి పెరుగుతోంది. పార్టీ నేతలు, కార్యకర్తల్లోనూ బీఆర్ఎస్ ప్రతిపాదన పట్ల ఒక రకమైన గందరగోళం, భయాందోళనలూ ఏర్పడ్డాయని టీఆర్ఎస్ వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది. ఇదే అదనుగా బీజేపీ అధినాయకత్వం తెలంగాణలో పాగా వేయడానికి చర్యలు వేగిరం చేయడమూ కేసీఆర్‌ను పునరాలోచనలో పడేసినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ప్రతిపాదనను పక్కన పెట్టి.. సొంత ఇంటిని చక్కదిద్దుకునే ప్రయత్నాలు చేపట్టారని అంటున్నారు.
అసంతృప్తిని సెంటిమెంటుతో కొట్టేందుకే బీఆర్ఎస్..
పార్టీలోని అత్యధిక శాతం ఎమ్మెల్యేల పనితీరు, సంక్షేమ పథకాలు సకాలంలో అమలు కాకపోవడం తదితర కారణాలతో ప్రజల్లో అసంతృప్తి పెరిగిందంటూ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బృందం సర్వేల్లో తేలింది. ఎమ్మెల్యేల వ్యవహార శైలితో 2 నుంచి 5 శాతం మేరకు పార్టీ ఓటింగ్‌కు నష్టం కలుగుతుందన్న అంచనాకు వచ్చింది. ఈ నివేదికలను పరిశీలించాక.. సర్వేల ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ దక్కుతుందంటూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సంకేతాలిస్తూ వస్తున్నారు. మరోవైపు రుణాల సేకరణకు కేంద్రం మోకాలడ్డడంతో సంక్షేమ పథకాల అమలుకూ కటకట ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని సెంటిమెంట్‌తో అధిగమించాలన్న ప్రయత్నంలో భాగంగానే బీఆర్ఎస్ను తెరపైకి తెచ్చారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
ఇళ్లకు డబ్బులిద్దాం.. పింఛన్లు మంజూరు చేద్దాం
సంక్షేమ పథకాలకు సంబంధించి.. ముఖ్యంగా డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం నత్తనడకన సాగుతుండడం, పింఛన్లు సకాలంలో విడుదల కాకపోవడం పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నట్లు పీకే సర్వేల్లో తేలిందని సమాచారం. ఈ నేపథ్యంలో సొంత జాగా ఉన్నవాళ్లకు ఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షల మంజూరును వేగిరం చేయాలని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు.. 57 ఏళ్ల వారికీ ఆగస్టు నుంచి పింఛన్లు విడుదల చేయాలని సీఎం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రగతి భవన్లో తనతో సమావేశమైన ఎమ్మెల్యేలకు ఈ మేరకు ఆయన సంకేతాలు ఇచ్చినట్లు చెబుతున్నారు.
ధరణి తలనొప్పులను తీర్చేద్దాం
ఇక ధరణి అమల్లోకి వచ్చిన తర్వాత క్షేత్ర స్థాయిలో పెరిగిన భూ సమస్యలు ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారాయి. ప్రతి నియోజకవర్గంలోనూ ఇబ్బందులు ఉండడంతో వాటి పరిష్కారంపైనా సీఎం దృష్టిసారించినట్లు చెబుతున్నారు. త్వరలోనే జిల్లాలవారీగా రెవెన్యూ సదస్సు లు పెట్టి కలెక్టర్ల ఆధ్వర్యంలో భూ సమస్యల పరిష్కారం చేపట్టనున్నట్లు పేర్కొంటున్నారు.