రాష్ట్రంలో నేతల ఫోన్లపై కేసీఆర్‌ నిఘా

ABN , First Publish Date - 2022-10-08T09:34:02+05:30 IST

KCR surveillance on the phones of leaders in the state

రాష్ట్రంలో నేతల ఫోన్లపై కేసీఆర్‌ నిఘా

  • ఇజ్రాయెల్‌ సాంకేతికతతో ట్యాపింగ్‌
  • టీఆర్‌ఎస్‌ వాళ్లే బాహాటంగా చెబుతున్నారు
  • మునుగోడులో ఓటుకు రూ.40 వేలు పంచేందుకు టీఆర్‌ఎస్‌ సిద్ధం: సంజయ్‌
  • ఇజ్రాయిల్‌ సాంకేతికతతో ట్యాపింగ్‌
  • టీఆర్‌ఎస్‌ వాళ్లే బాహాటంగా చెబుతున్నారు
  • మునుగోడులో ఓటుకు రూ.40 వేలు పంచేందుకు టీఆర్‌ఎస్‌ సిద్ధం: సంజయ్‌ 

హనుమకొండ/హైదరాబాద్‌, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో విపక్ష నాయకులు, ప్రజా ప్రతినిధుల ఫోన్లను ట్యాప్‌ చేయడానికే కేసీఆర్‌ ఇజ్రాయిల్‌ సాంకేతిక సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. ఈ విషయాన్ని టీఆర్‌ఎస్‌ మంత్రులు, నాయకులే బాహాటంగా చెబుతున్నారని అన్నారు. మునుగోడులో ఓటుకు రూ.40 వేలు పంచేందుకు టీఆర్‌ఎస్‌ రంగం సిద్ధం చేసుకుంటోందని, ఎన్ని గిమ్మిక్కులు చేసినా అక్కడ బీజేపీ గెలుపు ఖాయమని అన్నారు. శుక్రవారం హనుమకొండ హంటర్‌ రోడ్డులోని అభిరాం గార్డెన్స్‌లో జరిగిన ఏబీవీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గుజ్జుల నర్సయ్య సంస్మరణ సభలో పాల్గొనేందుకు సంజయ్‌ నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తాగి తందనాలు ఆడటానికే రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, మునుగోడులో మకాం వేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాకుండా ఉండేందుకు టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. బీజేపీ హవాను అడ్డుకునేందుకు మునుగోడు ఎన్నికలో ఇప్పటి నుంచే అనేక కుతంత్రాలు పన్నుతున్న టీఆర్‌ఎస్‌.. కాంగ్రెస్‌ అభ్యర్థికి ఆర్థిక సాయం కూడా చేస్తోందన్నారు. మందు, మంది, మంత్రులతో మునుగోడు ఓటర్ల తీర్పును మార్చలేరని చెప్పారు. అంతకు ముందు బండి సంజయ్‌ గుజ్జుల నర్సయ్య సంస్మరణ సభలో పాల్గొన్నారు. నర్సయ్య చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. 


మునుగోడుపై నేడు బీజేపీ సమావేశం

మునుగోడులో ప్రచార వ్యూహం ఖరారు లక్ష్యంగా శనివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్‌ అధ్యక్షతన బీజేపీ ముఖ్య నేతల కీలక సమావేశం జరుగుతుంది. మరోవైపు, సంజయ్‌ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లను నియమించారు. కాగా, కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌ ఆదివారం నర్సాపూర్‌కు రానున్నారు. టీఆర్‌ఎస్‌ నేత మురళీ యాదవ్‌, పరకాల మాజీ ఎమ్మెల్యే భిక్షపతి, పలువురు నాయకులు బీజేపీలో చేరనున్నారు.


 టీఆర్‌ఎస్‌ వివరణ ఇవ్వాలి: సుభాష్‌ 

అవినీతి సొమ్ముపై టీఆర్‌ఎస్‌ వివరణ ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్‌ డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లోని ఒక దినపత్రిక కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఈడీ దాడుల్లో మద్యం కుంభకోణానికి సంబంధించి దొరికిన ఆధారాలు టీఆర్‌ఎస్‌ పార్టీ, వారి కుటుంబ సభ్యుల మీడియా మేనేజ్‌మెంట్‌ను బట్టబయలు చేస్తున్నాయని తెలిపారు. మద్యం కుంభకోణంలో పంజాబ్‌లోని ఆప్‌ ప్రభుత్వం ఈ మీడియా హౌస్‌కి రూ.20 కోట్లు బదిలీ చేసిందన్న ఆరోణలున్నాయని పేర్కొన్నారు. ఈ దినపత్రికలో పెట్టుబడులు పెట్టిన అభిషేక్‌రెడ్డి ఎమ్మెల్సీ కవితకు అత్యంత సన్నిహితుడని ఒక ప్రకటనలో తెలిపారు. దాడుల్లో దొరికిన సొమ్ముతో టీఆర్‌ఎస్‌ అధి నాయకులకు సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు వస్తున్న దృష్ట్యా, ప్రభుత్వం వాస్తవాలను బహిర్గతం చేయాలని సుభాష్‌ డిమాండ్‌ చేశారు.

Read more