కార్పొరేట్‌ కాలేజీల్లో కేసీఆర్‌కు వాటాలు

ABN , First Publish Date - 2022-08-20T10:09:38+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబానికి కార్పొరేట్‌ కళాశాలల్లో వాటాలు ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు.

కార్పొరేట్‌ కాలేజీల్లో కేసీఆర్‌కు వాటాలు

అందుకే ఫీజుల వేధింపులను పట్టించుకోవడం లేదు

కేసీఆర్‌ బహుజనుల ద్రోహి... అన్ని కులాలకు ద్రోహం

మునుగోడు ఉప ఎన్నిక ఉన్నందునే పాపన్న జయంతి

బీజేపీ వస్తే హైదరాబాద్‌లో పాపన్నకు భారీ విగ్రహం

ప్రజాసంగ్రామ యాత్రలో బండి సంజయ్‌


జనగామ, జనగామ టౌన్‌, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబానికి కార్పొరేట్‌ కళాశాలల్లో వాటాలు ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. కార్పొరేట్‌ కాలేజీలను తరిమికొట్టాలని ఉద్యమ సమయంలో కేసీఆర్‌ పిలుపునిచ్చారని గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు నారాయణ, శ్రీ చైతన్య కళాశాలల్లో సీఎం కుటుంబ సభ్యులకు వాటాలు ఉండడంతో ఫీజు వేధింపులతో ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్ర శుక్రవారం రాత్రి జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్‌ కు  చేరుకుంది.


ఈ సందర్భంగా సర్దార్‌ సర్వాయి పాపన్న కో టలో ఏర్పాటు చేసిన పాపన్న జయంతి ఉత్సవ సభలో ఆయ న మాట్లాడారు. కేసీఆర్‌ బహుజన ద్రోహి అని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు అగ్రవర్ణ పేదలను కూడా మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పని కోసం పేద బ్రాహ్మణులు అడుక్కునే పరిస్థితి వచ్చిందన్నారు.


గౌడ్‌లూ.. కేసీఆర్‌ను నమ్మొద్దు

మునుగోడులో గౌడ్‌లు ఎక్కువగా ఉన్నందునే పాపన్న జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నట్లు సీఎం ప్రకటించారని సంజయ్‌ అన్నారు. ‘‘కేసీఆర్‌ తడి బట్టలతో గొంతు కోసే ర కం. గౌడ కులస్థులు ఆయన్ను నమ్మొద్దు. గోల్కొండ కోటను కొల్లగొట్టిన పాపన్న చరిత్ర ఈ తరానికి తెలిసి స్ఫూర్తి పొందితే బహుజనరాజ్యం వస్తుందని కేసీఆర్‌ భయపడుతున్నారు. పాలకులు విస్మరించిన పాపన్న చరిత్రను భావి తరాలకు అందించే బాధ్యతను బీజేపీ తీసుకుంటుంది. అధికారంలోకి రాగానే హైదరాబాద్‌ నడిబొడ్డున భారీ విగ్రహం ఏర్పాటు చేస్తాం. ఖిలాషాపూర్‌ కోటను పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతాం. గౌడ కుల వృత్తిని ప్రోత్సహించేందుకు ప్రణాళిక రూపొందిస్తాం’’ అని హా మీ ఇచ్చారు.  రూ.కోట్లు పెట్టి వంద గదులతో ప్రగతిభవన్‌ కట్టుకున్న సీఎం కేసీఆర్‌.. పాపన్న కోటను ఎందుకు పునరుద్ధరించట్లేదని సంజయ్‌ ప్రశ్నించారు. కమీషన్లు ఇచ్చే వైన్స్‌ల కోసం.. తాటి వనాల వద్ద డ్రంకెన్‌ డ్రైవ్‌ పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ పాలనలో ఏ మంత్రీ వారి కులాల గు రించి మాట్లాడేందుకు ధైర్యం చేయరన్నారు. శ్రీరాముడిని, సీతమ్మను కించపరిచిన మునావర్‌ ఫారుఖీని టీఆర్‌ఎస్‌ హైదరాబాద్‌ రప్పిస్తోందని, అందులో ఆంతర్యం ఏంటో చెప్పాలని    డిమాండ్‌ చేశారు. మునావర్‌ వస్తే హిందువులు ఎవరూ వెళ్లకూడదని, డూప్లికేట్‌ హిందువులు అయితే వెళ్లాలన్నారు.


సంచార జాతులతో రచ్చబండ

ఎన్నికలు వస్తేనే కేసీర్‌కు ప్రజలు గుర్తుకొస్తారని.. ఎంబీసీ కార్పొరేషన్‌కు ఏటా రూ.వెయ్యి కోట్లు ఇస్తానని రూ.67 కోట్లు మాత్రమే ఇచ్చారని సంజయ్‌ ఆరోపించారు. సంచార జాతులను ఏనాడూ పట్టించుకోని కేసీఆర్‌కు ఎన్నికల్లో బుద్ధి చెప్పి, సంచారిగా మార్చాలని పిలుపునిచ్చారు. ప్రజా సంగ్రామ యాత్ర శుక్రవారం జనగామ జిల్లా కేంద్రంలో ప్రారంభమై చీటకోడూరు, చౌడారం, భాషతండా, రామచంద్రగూడెం గ్రామాల్లో కొనసాగింది. రఘునాథపల్లి మండలంలోనూ యాత్ర సాగింది. చీటకోడూరులో సంజయ్‌ సంచార జాతులతో ఏర్పాటు చేసిన రచ్చబండలో సంజయ్‌ పాల్గొన్నారు.


తెలంగాణలో సంచార జాతుల జనాభా 30 లక్షలు ఉందని.. కేసీఆర్‌కు బెల్టుషాపుల మీద ఉన్న శ్రద్ధ సంచార జాతులకు దుకాణాలు పెట్టించడంపై లేకపోవడం విచారకరమన్నారు. గాజులమ్మే అమ్మలు ఇంటింటికీ వెళ్లి ముఖ్యమంత్రి అవినీతిని వివరించాలని, వారు తలుచుకుంటే కేసీఆర్‌ గద్దె దిగడం ఖాయమని అన్నారు. కాగా, సంజయ్‌ చీటకోడూరు వాగులో నుంచే నడుచుకుంటూ వెళ్లారు. వాగుపై బ్రిడ్జి లేదని, భారీ వర్షం పడితే 20 గ్రామాలకు రాకపోకలు ఆగిపోతున్నాయని స్థానికులు విన్నవించారు. మరోవైపు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా పలువురు ఫొటోగ్రాఫర్లను తన బస శిబిరం వద్ద సంజయ్‌ సన్మానించారు. వర్ధన్‌ ఆశ్రమంలో పిల్లలతో కలిసి శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు.

Updated Date - 2022-08-20T10:09:38+05:30 IST