కేసీఆర్‌కు గుణపాఠం తప్పదు

ABN , First Publish Date - 2022-10-11T09:38:32+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఫాంహౌస్‌ నుంచి, ప్రగతి భవన్‌ నుంచి మారుమూల గ్రామమైన లెంకలపల్లికి తీసుకొచ్చిన ఘనత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిది అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు.

కేసీఆర్‌కు గుణపాఠం తప్పదు

  • ఫాంహౌస్‌ నుంచి మారుమూల లెంకలపల్లికి కేసీఆర్‌ను తీసుకొచ్చిన ఘనత రాజగోపాల్‌రెడ్డిది
  • టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కలిసి పోటీ
  • అయినా బీజేపీదే గెలుపు: బండి సంజయ్‌ 
  • కేసీఆర్‌కు భంగపాటు తప్పదు: కిషన్‌రెడ్డి

నల్లగొండ, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఫాంహౌస్‌ నుంచి, ప్రగతి భవన్‌ నుంచి మారుమూల గ్రామమైన లెంకలపల్లికి తీసుకొచ్చిన ఘనత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిది అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. హామీలు విస్మరించిన కేసీఆర్‌కు గుణపాఠం చెప్పడానికి మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్‌రెడ్డి సోమవారం నామినేషన్‌ దాఖలు చేసిన అనంతరం చండూరులో ఏర్పాటుచేసిన ర్యాలీనుద్దేశించి ఆయన మాట్లాడారు. తాను హైదరాబాద్‌ నుంచి చండూరుకు వస్తుంటే అందరి చేతుల్లోనూ బీజేపీ జెండా కనిపిస్తుండగా, టీఆర్‌ఎస్‌ కార్యకర్తల చేతుల్లో మాత్రం మందు గ్లాసులు కనిపిస్తున్నాయన్నారు. రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసిన తర్వాతే గట్టుప్పల్‌ మండలం వచ్చిందని గుర్తు చేశారు. 


రాజగోపాల్‌రెడ్డిపై ఈసీకి ఫిర్యాదు చేయడానికి టీఆర్‌ఎస్‌ పార్టీకి సిగ్గుండాలని, ఆయన కుటుంబం మొదటి నుంచి కాంట్రాక్టు పనులు చేస్తోందని పేర్కొన్నారు.  కేసీఆర్‌ గతంలో బండి కొనుక్కొని డబ్బులు కట్టకపోవడంతో గుంజుకుపోయారని, అలాంటిది ఇప్పుడు ఆయన విమానాలు కొంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, కమ్యూనిస్టులు కలిసి పోటీ చేస్తున్నాయని సంజయ్‌ ఆరోపించారు. బీజేపీ మాత్రమే సింహంలా ఒంటరిగా పోటీ చేస్తోందని, గుంపులు ఎన్ని కలిసినా గెలిచేది మాత్రం బీజేపీనే అని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. మునుగోడులో కేసీఆర్‌కు భంగపాటు తప్పదన్నారు. తెలంగాణ ఉద్యమకారులెవరూ ఇప్పుడు టీఆర్‌ఎ్‌సలో లేరని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని మంటగలుపుతూ పార్టీ పేరును కూడా మార్చారని విమర్శించారు. కాగా, సీఎం కేసీఆర్‌ తెలంగాణ రాజపక్సే అని బీజేపీ జాతీయ నాయకుడు వివేక్‌ వెంకటస్వామి అన్నారు. శ్రీలంకలో ప్రధాని రాజపక్సే అవినీతి సొమ్ముతో విమానాలు కొంటే ప్రజలు బుద్ది చెప్పారని, తెలంగాణ రాజపక్సే కేసీఆర్‌కు మునుగోడు ప్రజలు సరైన బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు.


భారీ ర్యాలీతో రాజగోపాల్‌రెడ్డి నామినేషన్‌

బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భారీ ర్యాలీగా వచ్చి నామినేషన్‌ వేశారు. ఉదయం 10 గంటలకు కుటుంబసభ్యులతో కలిసి మునుగోడులోని క్యాంపు కార్యాలయం నుంచి చండూరుకు బయలుదేరిన రాజగోపాల్‌రెడ్డికి బంగారిగడ్డ వద్ద అభిమానులు, బీజేపీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో ఘనస్వాగతం పలికారు. అక్కడినుంచి ఐదు కిలోమీటర్ల దూరంలోని చండూరు వరకు ఓపెన్‌ టాప్‌ వాహనంలో వెళ్లగా పెద్దసంఖ్యలో కార్యకర్తలు, నాయకులు ర్యాలీగా వచ్చారు. నామినేషన్‌ దాఖలు సందర్భంగా వచ్చిన ప్రజలతో చండూరు మండల కేంద్రం కిక్కిరిసిపోయింది. బీజేపీ నేతలు పెద్దసంఖ్యలో రాగా రెండు సెట్లుగా నామినేషన్లు దాఖలు చేశారు. 


రాజగోపాల్‌ ఆస్తుల విలువ 222.67 కోట్లు

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సోమవారం నామినేషన్‌ దాఖలు చేసిన సందర్భంగా తన ఆస్తులు, అప్పుల వివరాలతో ఎన్నికల కమిషన్‌కు అఫిడవిట్‌ సమర్పించారు. తన మొత్తం ఆస్తుల విలువ రూ.222,67,64,742గా చూపించగా, రూ.61,54,80,220 అప్పులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఆస్తుల్లో చరాస్తుల విలువ రూ.69,97,70,142 కాగ,ా స్థిరాస్తుల విలువ రూ.152,69,94,600 అని తెలిపారు. తన భార్య లక్ష్మి పేరిట ఉన్న ఆస్తుల విలువ రూ.52,44,88,417 కాగా, ఇందులో చరాస్తుల విలువ రూ.3,89,63,167, స్థిరాస్తుల విలువ రూ.48,55,25,250గా పేర్కొన్నారు. భార్య లక్ష్మి పేరిట అప్పులేమీ లేవని తెలిపారు. కాగా, మునుగోడు ఉప ఎన్నికకు సోమవారం నాటికి 12 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. 7న స్వతంత్ర అభ్యర్థి ఒక్కరే నామినేషన్‌ వేయగా, సోమవారం 11 నామినేషన్లు దాఖలయ్యాయి. 

Read more