గజ్వేల్‌కు కేసీఆర్‌ గుడ్‌బై?

ABN , First Publish Date - 2022-06-07T08:19:26+05:30 IST

వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ గజ్వేల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేయడంలేదా? అంటే.. లేదన్న అభిప్రాయాలే టీఆర్‌ఎస్‌ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్‌ ఈసారి..

గజ్వేల్‌కు కేసీఆర్‌ గుడ్‌బై?

మెదక్‌ నుంచి లోక్‌సభకు పోటీ!

మరో అసెంబ్లీ స్థానానికి వెళ్తారనీ ప్రచారం

దుబ్బాక బరిలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి

గజ్వేల్‌లో వంటేరు ప్రతాపరెడ్డికి చాన్స్‌!

కేసీఆర్‌ లోక్‌సభకు పోటీ చేయకపోతే

మెదక్‌ ఎంపీ టికెట్‌ కోసం పలువురి పేర్లు


సంగారెడ్డి, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ గజ్వేల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేయడంలేదా? అంటే.. లేదన్న అభిప్రాయాలే టీఆర్‌ఎస్‌ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్‌ ఈసారి నియోజకవర్గం మారవచ్చని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా నల్లగొండ జిల్లా మునుగోలు నియోజకవర్గం పేరు కూడా వినిపించింది. అయుతే తాజాగా ఆయన మెదక్‌ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా బరిలోకి దిగుతారనే అభిప్రాయం వినిపిస్తోంది. జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించే ప్రయత్నాల్లో ఉన్న కేసీఆర్‌.. దేశాన్ని గాడిలో పెట్టేలా ప్రజలు తనను ఆశీర్వదించాలంటూ పదే పదే కోరుతున్న విషయం తెలిసిందే. పైగా ప్రస్తుతం మెదక్‌ నుంచి టీఆర్‌ఎస్‌ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్‌రెడ్డి ఈసారి లోక్‌సభకు కాకుండా.. దుబ్బాక నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారన్న ప్రచారం కూడా కేసీఆర్‌ పార్లమెంటుకు వెళతారన్న అభిప్రాయాలకు బలం చేకూరుస్తోంది. వాస్తవానికి శాసనసభలో అడుగు పెట్టాలని కొత్త ప్రభాకర్‌రెడ్డికి ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. అయితే ఆయన సొంత నియోజకవర్గమైన దుబ్బాక నుంచి టీఆర్‌ఎస్‌ టికెట్‌ను ప్రతి ఎన్నికల్లోనూ సోలిపేట రామలింగారెడ్డికి అధిష్ఠానం ఇవ్వాల్సివచ్చింది. మరోవైపు 2014 సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్‌ గజ్వేల్‌ అసెంబ్లీతో పాటు మెదక్‌ పార్లమెంట్‌ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి.. ఎంపీ పదవికి సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో అదే ఏడాది మెదక్‌ లోక్‌సభ స్థానానికి  వచ్చిన ఉప ఎన్నికలో కొత్త ప్రభాకర్‌రెడ్డికి టికెట్‌ ఇచ్చారు. తిరిగి 2019లోనూ ఆయనకే ఇచ్చారు. 


రామలింగారెడ్డి మరణంతో ప్రభాకర్‌రెడ్డి వైపు..

దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఏడాదిన్నర క్రితం మరణించడంతో జరిగిన ఉప ఎన్నికలో ఆయన భార్యకు టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం టికెట్‌ ఇచ్చింది. కానీ, ఆ ఉప ఎన్నికలో సానుభూతి కూడా పనిచేయకుండా బీజేపీ అభ్యర్థి చేతిలో రామలింగారెడ్డి భార్య ఓడిపోయారు. దీంతో రానున్న ఎన్నికల్లో అదే ప్రాంతానికి చెందిన ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిని బరిలోకి దించాలని పార్టీ సూత్రపాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఈ విషయమై పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మంత్రి హరీశ్‌రావు ఇప్పటికే ప్రభాకర్‌రెడ్డికి సూచన చేసినట్టు సమాచారం.


ఆయన కూడా పోటీకి సిద్ధమవుతున్నారు. ఇటీవల నియోజకవర్గంలో పర్యటిస్తూ.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. మరోవైపు లోక్‌సభకు కేసీఆర్‌ పోటీపై ఇంకా స్పష్టత లేకపోవడంతో మెదక్‌ ఎంపీ స్థానానికి టీఆర్‌ఎస్‌ టికెట్‌ కోసం పలువురు నాయకులు పోటీ పడుతున్నారు. వారిలో అటవీ అభివృద్ధి సంస్థ  చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డితోపాటు మెదక్‌, నర్సాపూర్‌ నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకుల పేర్లు వినిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్‌ గజ్వేల్‌ నుంచి తిరిగి అసెంబ్లీకే పోటీ చేస్తే మెదక్‌ ఎంపీ టికెట్‌ ప్రతా్‌పరెడ్డికి వచ్చే అవకాశాలున్నాయి. అయితే ఈసారి గజ్వేల్‌ నుంచి తాను పోటీ చేయనని, వంటేరు ప్రతా్‌పరెడ్డిని సిద్ధంగా ఉండాలని కేసీఆర్‌ చెప్పినట్టు ఆయన వర్గీయులు అంటున్నారు.


ఇటీవల జరిగిన స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల అనంతరం సిద్దిపేట జిల్లా ముఖ్య అధికారులను, ఎమ్మెల్సీగా ఎన్నికైన డాక్టర్‌ యాదవరెడ్డిని, వంటేరు ప్రతా్‌పరెడ్డిని సీఎం కేసీఆర్‌ తన ఫాంహౌ్‌సకు పిలుపించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ యాదవరెడ్డిని ఉద్దేశించి ‘డాక్టర్‌ సాబ్‌ నీ గెలుపుకోసం ప్రతా్‌పరెడ్డి బాగా కష్టపడ్డారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతా్‌పరెడ్డి విజయానికి కృషి చేయాలి’ అని కేసీఆర్‌ సూచించినట్టు పార్టీ వ ర్గాలు తెలిపాయి. దీంతో ప్రతా్‌పరెడ్డి కూడా గజ్వేల్‌ అసెంబ్లీ నుంచి పోటీకి సిద్ధమై విస్త్తృతంగా పర్యటిస్తున్నారు. 


ప్రతా్‌పరెడ్డికి లైన్‌ క్లియర్‌?

సీఎం కేసీఆర్‌ అటు మెదక్‌ నుంచి లోక్‌సభకు పోటీ చేయకపోయినా.. రాష్ట్రంలోని ఏదైనా మరో నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి వెళితే ప్రతా్‌పరెడ్డికి గజ్వేల్‌ లైన్‌ క్లియర్‌ అయినట్లే. అప్పుడు మెదక్‌ నుంచి మరొకరికి అవకాశం ఉంటుంది. దీనికోసం మెదక్‌, నర్సాపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పలువురు నేతల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ రెండు చోట్ల టీఆర్‌ఎస్‌ నేతలు రెండు గ్రూపులుగా విడిపోయి పని చేస్తున్నారు. రెండు గ్రూపులకు ముఖ్య నాయకులే నాయకత్వం వహిస్తుండడం, ఒక వర్గం కార్యక్రమాలకు మరో వర్గం హాజరు కాకపోతుండడం పార్టీ అధిష్ఠానానికి సమస్యగా మారింది. ఈ పరిస్థితుల్లో ఒకరిని అసెంబ్లీకి, మరొకరిని పార్లమెంట్‌కు పంపించాలని పార్టీ నాయకత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.


మెదక్‌ అసెంబ్లీ టికెట్‌ కోసం సిట్టింగ్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభా్‌షరెడ్డి మధ్య పోటీ ఉంది. ఇక నర్సాపూర్‌ నియోజకవర్గంలోనూ సిటింగ్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎ్‌సలో చేరి మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా ఉన్న మాజీ మంత్రి వి.సునితారెడ్డి వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్‌ కోసం గట్టిగా పట్టుపడుతున్నారు. ఇక్కడ కూడా ఒకరిని అసెంబ్లీకి, మరొకరిని పార్లమెంట్‌కు పోటీ చేయించే ఆలోచనలో పార్టీ నాయకత్వం ఉన్నట్టు టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఎవరు, ఎక్కడ పోటీ చేస్తారోనని ఇప్పటినుంచే ఆసక్తి మొదలైంది. 

Updated Date - 2022-06-07T08:19:26+05:30 IST