కవిత విచారణ 11న!

ABN , First Publish Date - 2022-12-07T03:06:21+05:30 IST

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ అధికారులు ఈ నెల 11న విచారించనున్నారు. ఈ మేరకు తాము 11వ తేదీ ఉదయం 11 గంటలకు వస్తామని ఎమ్మెల్సీ కవితకు వారు సమాచారం అందించారు.

కవిత విచారణ 11న!

11 గంటలకు వస్తామన్న సీబీఐ

మెయిల్‌ ద్వారా కవితకు సమాచారం

అందుబాటులో ఉంటానని

సీబీఐ అధికారులకు బదులిచ్చిన కవిత

ఢిల్లీకి వెనుదిరిగిన సీబీఐ బృందం

హైదరాబాద్‌, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ అధికారులు ఈ నెల 11న విచారించనున్నారు. ఈ మేరకు తాము 11వ తేదీ ఉదయం 11 గంటలకు వస్తామని ఎమ్మెల్సీ కవితకు వారు సమాచారం అందించారు. దీంతో తాను ఆరోజు తన నివాసంలో అందుబాటులో ఉంటానని కవిత కూడా సీబీఐకి బదులిచ్చారు. అయితే మంగళవారం మధ్యాహ్నం దాకా సీబీఐ నుంచి కవితకు సమధానం రాకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. సీబీఐ అధికారులు ఇచ్చిన నోటీసుల మేరకు మంగళవారం విచారణకు అందుబాటులో ఉంటానని తొలుత చెప్పిన కవిత.. ఆ తరువాత ఎఫ్‌ఐఆర్‌లో తన పేరు లేదని, ముందే ఖరారైన షెడ్యూల్‌ కారణంగా 6న అందుబాటులో ఉండటం లేదని వారికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నెల 11, 12, 14, 15 తేదీల్లో విచారణకు అందుబాటులో ఉంటానని, సీబీఐ అధికారులు ఏ రోజు విచారణకు వస్తారో తెలపాలంటూ ఆ లేఖలో కోరారు. అయితే దీనికి సీబీఐ అధికారుల నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు ఎలాంటి బదులు రాలేదు. ముందుగా అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం మంగళవారం కవితను విచారించేందుకు ఢిల్లీ సీబీఐ బృందం ప్రత్యేక ప్రశ్నావళితో సోమవారం సాయంత్రమే హైదరాబాద్‌ చేరుకుంది.

కానీ, ఢిల్లీ ఉన్నతాధికారుల నుంచి సంకేతాలు అందకపోవడంతో మంగళవారం వారు కవిత ఇంటికి వెళ్లలేదు. మరోవైపు తాను గడువు కోరుతూ రాసిన లేఖకు సీబీఐకి నుంచి ఎలాంటి బదులు రాకపోవడంతో ఎమ్మెల్సీ కవిత సైతం మంగళవారం మధ్యాహ్నం వరకు బంజారాహిల్స్‌లోని తన ఇంటి వద్దే ఉన్నారు. అయితే బుధవారం సీఎం కేసీఆర్‌ జగిత్యాలలో పర్యటిస్తుండటం, ఆ కార్యక్రమానికి కవిత ఇన్‌చార్జిగా వ్యవహరిస్తుండడంతో ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు మధ్యాహ్నం అక్కడికి బయలుదేరి వెళ్లారు. ఇంతలో ఢిల్లీ సీబీఐ అధికారులు ఈ-మొయిల్‌లో కవితకు తాము 11న విచారణకు వస్తామని సమాచారం అందించారు. ఆమె నివాసానికి సంబంధించిన పూర్తి చిరునామాను కూడా మొయిల్‌లో సీబీఐ డీఐజీ రాఘవేంద్ర వత్స పేర్కొన్నారు. ఇందుకు కవిత కూడా తాను అందుబాటులో ఉంటానని బదులివ్వడంతో సీబీఐ ప్రత్యేక బృందం తిరిగి విమానంలో ఢిల్లీకి పయనమైంది. కాగా, కవితను సీబీఐ అధికారులు విచారించేందుకు వచ్చే అవకాశం ఉండటంతో మంగళవారం ఉదయం నుంచే ఆమె ఇంటి వద్ద అభిమానులు, మీడియా హడావిడి నెలకొంది. మధ్యాహ్నం ఆమె జగిత్యాలకు బయలుదేరాక అక్కడ తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు వరుస పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత నివాసం, పరిసర ప్రాంతాల్లో పోలీ్‌సలు ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు.

Updated Date - 2022-12-07T03:06:22+05:30 IST