JP NADDA: బీఆర్‌ఎస్‌కు వీఆరెఎస్సే

ABN , First Publish Date - 2022-12-16T02:13:46+05:30 IST

‘కేసీఆర్‌ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. అరాచక పాలన సాగిస్తూ.. ప్రశ్నించే వారి గొంతు నొక్కుతోంది. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీఆర్‌ఎ్‌సకు అధికారంలో ఉండే అర్హత లేదు. కేసీఆర్‌కు గుడ్‌ బై చెప్పాల్సిన సమయం...

JP NADDA: బీఆర్‌ఎస్‌కు వీఆరెఎస్సే

కేసీఆర్‌కు గుడ్‌బై చెప్పాల్సిన సమయం వచ్చేసింది

బండి వెరీ గుడ్‌! నడ్డా కితాబు

రాష్ట్రంలో అవినీతి.. అరాచక పాలన

దోచుకునేందుకే ధరణి పోర్టల్‌ తెచ్చారు

సీఎం కుమార్తె విచారణ ఎదుర్కొంటోంది

తెలంగాణ అమర వీరుల్ని వంచించారు

ఇలాంటి వ్యక్తిని ఉంచాలా? దించాలా?

ఇక తెలంగాణలో బీజేపీదే అధికారం

గెలిచాక అధికారికంగా ‘విమోచనం’

సంగ్రామ యాత్ర ముగింపు సభలో నడ్డా

సంజయ్‌ చేపట్టిన యాత్ర ప్రారంభం మాత్రమే. రానున్న రోజుల్లో ‘ప్రజా గోస-బీజేపీ భరోసా’ పేరుతో గ్రామగ్రామాన యాత్రలు ఉంటాయి. ఉట్టికి ఎగుర లేనమ్మ.. స్వర్గానికి ఎగిరిందన్నట్టుగా కేసీఆర్‌ మాటలు ఉంటాయి. ప్రజలతోపాటు తెలంగాణ అమరవీరులను వంచించారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన ఆయనకు.. ఇప్పుడు కొడుకు, అల్లుడు, కూతురు తప్ప ఇంకెవరూ కనిపించడం లేదు. ఇలాంటి వ్యక్తిని అధికారంలో ఉంచుదామా? దించుదామా?

- బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా

కరీంనగర్‌, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ‘కేసీఆర్‌ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. అరాచక పాలన సాగిస్తూ.. ప్రశ్నించే వారి గొంతు నొక్కుతోంది. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీఆర్‌ఎ్‌సకు అధికారంలో ఉండే అర్హత లేదు. కేసీఆర్‌కు గుడ్‌ బై చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ సర్కార్‌ను బొందపెట్టి.. ప్రజాస్వామ్య, అభివృద్ధి కాముకులకు పట్టం కట్టాలి’ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర గురువారం ముగిసింది. ఈ సందర్భంగా ఎస్సార్‌ఆర్‌ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరై ప్రసంగించారు. రాజరాజేశ్వర స్వామి, కొండగట్టు అంజన్నకు నమస్కారం అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన నడ్డా.. సీఎం కేసీఆర్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఇక్కడికి వస్తుండగా బీఆర్‌ఎస్‌ నేతలు తనను అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్య దేశమని, కేసీఆర్‌ లాంటి వారిని ప్రజలే కాలగర్భంలో కలిపేస్తారని హెచ్చరించారు. సంజయ్‌ చేపట్టిన యాత్ర ప్రారంభం మాత్రమేనని, ‘ప్రజా గోస.. బీజేపీ భరోసా’ నినాదంతో గ్రామగ్రామాన ఇలాంటి పాదయాత్రలు చేపడతామని తెలిపారు. ‘సాలు దొర.. సెలవు దొర’, ‘గుడ్‌ బై కేసీఆర్‌’ అనే నినాదాలతో పార్టీ శ్రేణులు ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. సబ్‌ కా సాత్‌, సబ్‌ కా వికాస్‌, సబ్‌ కా విశ్వాస్‌, సబ్‌ కా ప్రయాస్‌.. అన్నదే తమ పార్టీ లక్ష్యమని తెలిపారు. దేశంలోని పేదలు, పీడితులు, దళితులు, గిరిజనులు, యువకులు, మహిళలు, రైతులను శక్తివంతుల్ని చేసేందుకు మోదీ సర్కారు కృషి చేస్తోందని అన్నారు.

తెలంగాణలో 4,996 కి.మీ. హైవేలు

గత ఐదేళ్లలో తెలంగాణలో 4,996 కిలో మీటర్ల జాతీయ రహదారులను కేంద్రం నిర్మించిందని తెలిపారు. నాలుగు లేన్ల ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్‌ కారిడార్లు పూర్తి చేశామని చెప్పారు. దేశవ్యాప్తంగా జల్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా దేశవ్యాప్తంగా కోటి 96 లక్షల ఇళ్లకు తాగునీటిని అందించే కృషి చేస్తున్నామని వివరించారు. సంపన్న రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్‌ ఎనిమిదేళ్లలో అప్పుల కుప్పగా మార్చారని దుయ్యబట్టారు. తెలంగాణ అప్పు రూ.3.29లక్షల కోట్లకు చేరిందని గుర్తు చేశారు. ఉట్టికి ఎగుర లేనమ్మ.. స్వర్గానికి ఎగిరిందన్నట్టుగా కేసీఆర్‌ మాటలు ఉంటాయని ఎద్దేవా చేశారు. ఇలాంటి వ్యక్తిని అధికారంలో ఉంచుదామా? దించుదామా? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎ్‌సగా మారిన టీఆర్‌ఎ్‌సకు రానున్న కాలంలో వీఆర్‌ఎస్‌ తప్పదని అన్నారు. గతంలో దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన కేసీఆర్‌కు.. ఇప్పుడు కొడుకు, అల్లుడు, కూతురు తప్ప ఇంకెవరూ కనిపించడం లేదని విమర్శించారు. ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి.. ప్రజలతోపాటు తెలంగాణ అమరులను కేసీఆర్‌ వంచించారని ధ్వజమెత్తారు. ధరణి పోర్టల్‌.. టీఆర్‌ఎస్‌ శ్రేణులకు దోచుకునే మార్గంగా మారిందని దుయ్యబట్టారు. అభివృద్ధి చేయకపోగా.. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని మండిపడ్డారు. అవినీతిని కేసీఆర్‌ మైక్రో స్థాయికి తీసుకెళ్లారని, మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన బాటలోనే నడుస్తున్నారని ఆరోపించారు. సీఎం కుమార్తె కవిత కూడా విచారణను ఎదుర్కొంటోందని గుర్తు చేశారు. తాము అధికారంలోకి వస్తే అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు. తెలంగాణ ప్రజాల ఆకాంక్షలు నెరవేరాలంటే, ఇక్కడ బీజేపీ అధికారంలోకి రావాలని, తెలంగాణ అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరూ బీజేపీతో కలిసి రావాలని పిలపునిచ్చారు.

నడ్డా వస్తున్న విమానానికి సాంకేతిక లోపం

శంషాబాద్‌ రూరల్‌, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో వెంటనే స్పందించిన పైలెట్లు విమానాన్ని కర్ణాటకలోని కొప్పు ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేశారు. మరమ్మతుల అనంతరం బయలుదేరిన విమానం.. సాయంత్రం 4.30గంటలకు శంషాబాద్‌లో ల్యాండ్‌ అయింది. విమానాశ్రయంలో నడ్డాకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యులు ఎన్‌.ఇంద్రసేనారెడ్డి, విజయశాంతి, ఎమ్మెల్యే రఘునందన్‌రావు, రాష్ట్ర ఇన్‌చార్జి తరుణ్‌ఛుగ్‌ స్వాగతం పలికారు. అనంతరం జేపీ నడ్డా ప్రత్యేక హెలికాప్టర్‌ ద్వారా కరీంనగర్‌ బయలుదేరి వెళ్లారు. తిరుగుప్రయాణంలో చీకటి పడడంతో రోడ్డుమార్గంలో ఆయన శంషాబాద్‌ చేరుకున్నారు.

Updated Date - 2022-12-16T02:51:58+05:30 IST