MLA Jeevan Reddy: జీవన్‌రెడ్డి హత్యకు కుట్ర కేసు.. పోలీసుల విచారణలో కీలక అంశాలు
ABN , First Publish Date - 2022-08-03T22:25:13+05:30 IST
ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి (Jeevan Reddy) ‘హత్యకు కుట్ర’ కేసు విచారణలో పోలీసులకు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.

హైదరాబాద్: ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి (Jeevan Reddy) ‘హత్యకు కుట్ర’ కేసు విచారణలో పోలీసులకు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. నాందేడ్‌లో రూ.32 వేలకు పిస్టల్ కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు తెలుస్తోంది. ఈ కేసులో అనుమానితులు ప్రసాద్‌గౌడ్, అతని స్నేహితులు, డీలర్ సంతులను టాస్క్‌ఫోర్స్ అదుపులో తీసుకుంది. ఎఫ్ఐఆర్ (FIR)లోని వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో బంజారాహిల్స్ (Banjara Hills) రోడ్డు నంబరు 12లోని జీవన్‌రెడ్డి నివాసానికి కారులో ప్రసాద్‌గౌడ్ చేరుకున్నారు. వాహనాన్ని బయట పార్క్ చేసి లోపలికి ప్రవేశించారు. అప్పటికి హాల్లో కొంత మంది పనివారు ఉండటాన్ని గమనించి విజిటర్స్ గదిలోకి వెళ్లారు. పనివారంతా అక్కడి నుంచి వెళ్లిపోయేదాకా వేచివుండి.. ఒక్కసారిగా లిఫ్టు ఎక్కి మూడో అంతస్తుకు చేరుకున్నారు.
నేరుగా జీవన్‌రెడ్డి పడకగదిలోకి వెళ్లారు. అక్కడ తన జేబులో ఉన్న పిస్తోలు తీసి జీవన్‌రెడ్డి నుదుటికి గురిపెట్టారు. తనకు న్యాయం చేయాలని, లేదంటే చంపేస్తానని ఆయన్ను బెదిరించారు. షాక్‌లోంచి తేరుకున్న జీవన్‌రెడ్డి గట్టిగా అరవడంతో వంటమనిషి గంగాధర్ మిగతా సిబ్బంది అక్కడికి వచ్చి ప్రసాద్‌గౌడ్‌ను వెనుక నుంచి పట్టుకున్నారు. అతడి జేబులో కత్తి కూడా ఉన్నట్లు గుర్తించారు. అనంతరం సిబ్బంది, బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. జీవన్‌రెడ్డి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు ప్రసాద్‌గౌడ్‌పై హత్యాయత్నం, అక్రమ చొరబాటు, ఆయుధాల వాడకం, బెదిరింపు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. గతంలో మావోయిస్టు సానుభూతిపరుడిగా ప్రసాద్ ఉన్నట్లు చెబుతున్నారు.