జలమ్ము నిశ్చయమ్మురా..

ABN , First Publish Date - 2022-07-20T05:09:25+05:30 IST

జలమ్ము నిశ్చయమ్మురా..

జలమ్ము నిశ్చయమ్మురా..
మత్తడి పోస్తున్న పాకాల సరస్సు, నల్లబెల్లి మండలంలోని గోవిందపూర్‌ శివారులోని మత్తడి పోస్తున్న రంగాయ చెరువు

చెరువులు, కుంటల్లో జలసవ్వడి

భారీ వర్షాలకు 291 చెరువులు మత్తళ్లు

జూలైలోనే పాకాల పరవళ్లు

రైతుల్లో వెల్లివిరుస్తున్న ఆనందం 


వరంగల్‌, జూలై 19 (ఆంధ్రజ్యోతి): ఇటీవల ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు జిల్లాలోని జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి. ఆగస్టులో నిండాల్సిన చెరువులు, కుంటలన్నీ జూలైలోనే మత్తళ్లు పడడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. వారం రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు చెరువుల్లోకి వరద నీరు భారీ వచ్చి చేరింది. కాకతీయుల నిర్మించిన గొలుసు కట్టు చెరువుల్లో ప్రధానంగా ఉండే పాకాల సరస్సు 31అడుగుల పూర్తి నీటిమట్టానికి చేరుకోవడంతో విశేషం. ప్రస్తుతం మత్తడితో జల సవ్వడి సందడి చేస్తోంది. వరుసగా కురిసిన ముసురుతో పెట్టిన నారు ఎర్రబడడం, పత్తి మొలకలు పాడవ్వడంతో రైతులకు నష్టం వాటిల్లినా, అనూహ్యంగా వానాకాలం ఆరంభంలోనే చెరువులు నిండడం రికార్డుగా నిలిచింది. జిల్లాలో జూలైలో జిల్లా సరాసరి వర్షపాతం 115.6 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, దానికి రెండింతలుగా మరో పది రోజుల గడువు ఉండగానే 266.1 మి.మీ నమోదవడం గమనార్హం. సాధారణ వర్షపాతం కంటే జూలైలో 90 శాతం అధికంగా వర్షం పడింది. గత ఏడాది జూలైలో 141.6 మి.మీ సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 201.0మి.మీ నమోదయింది. 


నిండిన చెరువులు..

జిల్లా వ్యాప్తంగా 815 చెరువులుండగా, వాటిలో 291 చెరువులు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పూర్తిస్థాయిలో నిండి మత్తళ్లు పడ్డాయి. మరో 431 చెరువులు పూర్తి సామర్థ్యానికి చేరువలో ఉండగా, మరో 74 చెరువులు 75 శాతం మేర వరద నీరు చేరింది. గీసుగొండ మండలంలో 76 చెరువులుండగా వాటిలో నాలుగు చెరువులు మత్తడి పడగా, మిగిలిన 63 చెరువులు పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరువలో ఉన్నాయి. సంగెం మండలంలో 70 చెరువులుండగా 22 చెరువులు మత్తళ్లు పడగా, 48 చెరువులు నిండే దశకు చేరాయి. పర్వతగిరి మండలంలో 64 చెరువులకు 38 చెరువులు మత్తడిపడగా, 26 చెరువుల్లోకి 75శాతం మేర వరద నీళ్లు చేరాయి. వర్ధన్నపేట మండలంలో 68 చెరువులుండగా కేవలం 7 చెరువులు మాత్రమే మత్తడి పడగా, మిగిలిన 61చెరువులు 75శాతం మేర నీళ్లు చేరాయి. ఖిలావరంగల్‌ మండలంలో 48 చెరువులకు గాను, 1 చెరువు మినహా మిగిలిన 47 చెరువుల్లో సగం వరకే నీళ్లు వచ్చాయి. వరంగల్‌ మండలంలో 20 చెరువులకు 7 చెరువులు మత్తళ్లు పడగా, 13 చెరువులు 90 శాతం మేర నీళ్లు చేరాయి. రాయపర్తి మండలంలో 96 చెరువులకు 28 చెరువులు మత్తడి పోయగా, 68చెరువులు 50 శాతం వరకు నీళ్లు వచ్చాయి. దుగ్గొండి మండలంలోని 73 చెరువులకు 21 చెరువులు మత్తడి పడగా, 52 చెరువులు 90శాతం మేర నీళ్లు వచ్చాయి. నల్లబెల్లి మండలంలో 84 చెరువులకు 62 చెరువులు మత్తడి పడగా 22 చెరువులు 90శాతం మేర నీళ్లు చేరాయి. నర్సంపేట మండలంలో 67 చెరువులకు 12 చెరువులు పూర్తి స్థాయిలో నిండగా, మిగిలిన 55 చెరువులు మత్తడి దగ్గరిలో ఉన్నాయి. ఖానాపూర్‌ మండలంలో 23 చెరువులకు 23 చెరువులు మత్తడి పడ్డాయి. నెక్కొండ మండలంలో 81 చెరువులకు 60 చెరువులు మత్తడి పడగా, 21 చెరువులు మత్తడికి దగ్గరిలో ఉన్నాయి. చెన్నారావుపేట మండలంలో 45 చెరువులుండగా, 6 చెరువులు మత్తడి పడగా, 39 చెరువులు మత్తడికి దగ్గరిలో ఉన్నాయి. 


ఖానాపూర్‌లో వంద శాతం

ఖానాపూర్‌ మండలంలోని 23 చెరువులకు అన్నీ కూడా మత్తడి దూకాయి. జిల్లాలోనే పెద్ద జలాశ యంగా ఉన్న పాకాల సరస్సులో 31 అడుగుల పూర్తి స్థాయి నీటి సామర్థ్యం ఉండగా మూడు రోజుల ముసురుకే నిండి మత్తడి పడింది. దీంతో పర్యాటకుల రాకతో సందడిగా మారింది. జూలైలోనే పాకాల మత్త డి పడడంతో ఆయకట్టు కింద ఉన్న రైతులు ఆనం దంలో ఉన్నారు. నల్లబెల్లి మండలం 84 చెరువులకు 62 చెరువులు మత్తడి పడ్డాయి. ఇక్కడ కూడా భారీ వర్షం పడడంతో రంగాయచెరువు రిజర్వాయర్‌ కూడా మత్తడి పడింది. నెక్కొండ మండలంలో సైతం 81 చెరువులకు 60 పెద్ద చెరువులు పూర్తి స్థాయిలో నిండి జలకళను సంతరించుకున్నాయి. గీసుగొండ, వర్ధన్నపేట, రాయపర్తి మండలాల్లో చెప్పుకొదగిన స్థాయిలో వర్షాలు పడకపోవడంతో చెరువుల్లో నీళ్లు కనిపించడం లేదు. 



Updated Date - 2022-07-20T05:09:25+05:30 IST