జై శ్రీరాం అంటే.. మనం జై హనుమాన్‌ అనాలి

ABN , First Publish Date - 2022-05-22T08:44:27+05:30 IST

మోదీ పాలనలో సామాన్యులు జీవించడం కష్టంగా మారిందని, బీజేపీ హామీలు ఆకాశంలో ఉంటే.

జై శ్రీరాం అంటే.. మనం జై హనుమాన్‌ అనాలి

  • దేవుడి పేరుతో రాజకీయాలను సహించం
  • రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీజేపీ మ్యాచ్‌ ఫిక్సింగ్‌
  • వరంగల్‌ రైతు డిక్లరేషన్‌ హాస్యాస్పదం
  • కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ కవిత


జగిత్యాల, మే 21 (ఆంధ్రజ్యోతి): మోదీ పాలనలో సామాన్యులు జీవించడం కష్టంగా మారిందని, బీజేపీ హామీలు ఆకాశంలో ఉంటే.. వాటి అమలు పాతాళంలో ఉందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. తెలంగాణను దేశంలో నంబర్‌ వన్‌గా నిలిపిన పార్టీ టీఆర్‌ఎస్‌ అని, ఈ విషయాన్ని సగర్వంగా ప్రతిపక్షాలకు చెప్పాలని కార్యకర్తలకు ఆమె పిలుపునిచ్చారు. దేవుడి పేరుతో రాజకీయం చేస్తే ఊరుకునేది లేదని, వాళ్లు జై శ్రీరాం అంటే.. మనం జై హనుమాన్‌ అనాలని సూచించారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని గండి హనుమాన్‌ దేవస్థానంలో శనివారం ఆమె ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మెట్‌పల్లిలో జరిగిన కోరుట్ల నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. మల్యాల మండలంలోని కొండగట్టు దేవస్థానాన్ని సందర్శించి, హనుమాన్‌ చాలీసా పారాయణంలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మోదీ పాలనలో జీడీపీ నేల మీదకి వచ్చిందని దుయ్యబట్టారు. సిలిండర్‌ ధర రూ.వెయ్యిపైన ఉందని, పెట్రోల్‌ ధర రూ.120, డీజిల్‌ ధర రూ.100కు చేరిందని, నూనెలు, ఉప్పు, పప్పుల ధరలు ఆకాశం దిశగా పరుగులు తీస్తున్నాయని పేర్కొన్నారు. ఇలాగైతే సామాన్యులు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. బీజేపీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు, నిరుపేదల అకౌంట్లలో రూ.15 లక్షలు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. దళితబంధు సహా అనేక పథకాలను అమలు చేస్తున్నామని, 281 బీసీ హాస్టళ్లు ఏర్పాటు చేసి, రూ.1,300 కోట్లతో 1.32 లక్షల బీసీ విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తున్నామని గుర్తు చేశారు.  


అబద్ధాలకు ప్రతిరూపం అర్వింద్‌

ఎంపీ అర్వింద్‌ అబద్ధాలకు ప్రతిరూపమని కవిత విమర్శించారు. ఎంపీగా గెలిచి మూడేళ్లు కావస్తున్నా రైతులకు ఆయన చేసిందేమీ లేదన్నారు. టీఆర్‌ఎస్‌ చేసిన పనులను కూడా తామే చేసినట్టు బీజేపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారన్నారు. ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి బీజేపీని ఎందుకు విమర్శించరని, పసుపు బోర్డు, ధరల పెరుగుదలపై ఎందుకు ప్రశ్నించరని ఆమె నిలదీశారు. రాష్ట్రంలో జరుగుతున్నవన్నీ చూస్తుంటే.. ఇరు పార్టీల మధ్య మ్యాచ్‌ ఫిక్సింగ్‌ జరిగిందేమోనని అనుమానంగా ఉందన్నారు. రాష్ట్రానికి రావాల్సిన బకాయిల గురించి పార్లమెట్‌లో రాహుల్‌ గాంధీ మాట్లాడేలా చూడాలని జీవన్‌రెడ్డికి సవాల్‌ విసిరారు. రచ్చబండ పేరిట పల్లెల్లోకి వస్తున్న కాంగ్రెస్‌ నేతలకు గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ సర్కారు ఆధ్వర్యంలో జరుగుతున్న వైకుంఠధామాలు, డంపింగ్‌ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, సీసీ రహదారులు తదితర అభివృద్ధి పనులను చూయించి నిలదీయాలని కార్యకర్తలకు సూచించారు. వరంగల్‌లో రాహుల్‌గాంధీ ప్రకటించిన రైతు డిక్లరేషన్‌ హాస్యాస్పదంగా ఉందని, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా వాటిని అమలు చేస్తున్నారా? అని కవిత ప్రశ్నించారు. 

Updated Date - 2022-05-22T08:44:27+05:30 IST