తెలంగాణ భారత్‌లో లేదా?

ABN , First Publish Date - 2022-02-04T08:41:01+05:30 IST

తెలంగాణ భారత్‌లో లేదా?

తెలంగాణ భారత్‌లో లేదా?

 రాష్ట్రానికి కేంద్రం ఏమీ ఇవ్వలేదు

 లోక్‌సభలో నామా నాగేశ్వర రావు 

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): ‘‘తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వడం లేదు. తెలంగాణ.. భారత్‌లో లేదా? తెలంగాణ ప్రజలు భారతీయులు కాదా?’’ అని టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర రావు ధ్వజమెత్తారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై గురువారం లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీలు అమలు చేయలేదన్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ, కోచ్‌ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం వంటి హామీలను అమలు చేయలేదని విమర్శించారు. దేశంలో మంజూరు చేసిన 157 మెడికల్‌ కాలేజీల్లో రాష్ట్రానికి ఒక్కటీ దక్కలేదని, 7 ఐఐఎంల్లోనూ ఒక్కటైనా ఇవ్వలేదని, నవోదయ, ఐఐటీ, ఐఐఐటీ, నిట్‌, మెగా టెక్స్‌టైల్‌ పార్కు వంటివి ఏవీ ఇవ్వలేదని వివరించారు. 2013లో మంజూరైన ఐటీఐఆర్‌ను ఈ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. ఎస్సీ వర్గీకరణ, రిజర్వేషన్ల పెంపుపై రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి పంపినా కేంద్రం వాటిని ఆమోదించడం లేదని సభ దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రాలు అభివృద్ధి అయితేనే దేశం అభివృద్ధి అవుతుందని.. కేంద్రం, రాష్ట్రాలు కలిసి దేశాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇంటింటికి నల్లా కనెక్షన్లు ఇచ్చిన తొలి రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. 100ు ఇంటింటికి నల్లా కనెక్షన్లు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం ప్రశంసించిందని, కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. మిషన్‌ భగీరథకు రూ.19205 కోట్లు, మిషన్‌ కాకతీయకు రూ.5 వేల కోట్లు ఇవ్వాలని కేంద్రానికి నీతి ఆయోగ్‌ సిఫారసు చేసినా కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలుకు జాతీయ విధానం అవసరమన్నారు.   

Updated Date - 2022-02-04T08:41:01+05:30 IST