ఎస్‌హెచ్‌జీ మహిళల వడ్డీ భారం తీరేనా?

ABN , First Publish Date - 2022-03-05T07:21:12+05:30 IST

ప్రభుత్వం నుంచి సకాలంలో వడ్డీ రాయితీ సొమ్ము జమ

ఎస్‌హెచ్‌జీ మహిళల వడ్డీ భారం తీరేనా?

  • గత బడ్జెట్లో కేటాయింపు రూ.3వేల కోట్లు..
  • ఖర్చు చేసింది మాత్రం రూ.200కోట్లే..
  • సర్కారు వడ్డీ రాయితీ బకాయి రూ.4వేల కోట్లు!


హైదరాబాద్‌, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం నుంచి సకాలంలో వడ్డీ రాయితీ సొమ్ము జమ కాకపోవడంతో స్వయం సహాయక సంఘాల(ఎ్‌సహెచ్‌జీ) సభ్యులు ఇబ్బందులు పడుతున్నారు. రుణాలు తీసుకున్న వారికి వడ్డీని  ప్రభుత్వం తిరిగి లబ్ధిదారులకు చెల్లించే పథకం అమలులో పూర్తి నిర్లక్ష్యం కనిపిస్తోంది. దీంతో వడ్డీ చెల్లించడం భారమవుతోందని మహిళలు ఆవేదన చెందుతున్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ రాయితీ చెల్లించాల్సి ఉండగా.. గత మూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఆ మాటే మరిచింది. దీంతో సర్కారు చెల్లించాల్సిన వడ్డీ బాపతు బకాయి రూ.4వేల కోట్లకు చేరుకున్నట్లు తెలుస్తోంది.


వడ్డీ లేని రుణాలు(వీఎల్‌ఆర్‌) తీసుకున్న మహిళా సంఘాల సభ్యుల నుంచి బ్యాంకులు ప్రతినెలా వడ్డీ వసూలు చేస్తున్నాయి. దీనిని లబ్ధిదారులకు ప్రభుత్వం చెల్లించాలనే ఉద్దేశంతో బడ్జెట్‌లో రూ.3వేల కోట్లు కేటాయించారు. కాని వాటి చెల్లింపులు జరగలేదు.  రూ.200 కోట్లే ప్రభుత్వం విడుదల చేసింది. అందులో ఎక్కువ మొత్తాన్ని హుజూరాబాద్‌ నియోజకవర్గానికే మళ్లించిందని, ఉప ఎన్నికల నేపథ్యంలో మహిళా సంఘాల నుంచి లబ్థి పొందేందుకే ఈ డబ్బులు వినియోగించినట్లు విమర్శలున్నాయి. బడ్జెట్‌ ప్రవేశపెట్టే సమయం దగ్గర పడుతున్నా.. వడ్డీ చెల్లింపు విషయంపై సంబంధిత శాఖలు దృష్టి సారించలేదని తెలుస్తోంది. 


 బ్యాంకులు రుణాలిస్తున్నా...

రాష్ట్రంలోని మహిళా సంఘాలకు వివిధ బ్యాంకులు 10-12.5ు వడ్డీతో రూ.10వేల కోట్ల వరకు వడ్డీలేని రుణాలిస్తున్నాయి. ఈ ఏడాది రూ.12 వేల కోట్లు రుణాలివ్వాలన్న లక్ష్యం ఇప్పటికే నెరవేరింది. ఇతర రుణాల చెల్లింపులు సక్రమంగా ఉండకపోవడం, మహిళలు మాత్రం ప్రతినెలా రుణ వాయిదాలు, వడ్డీని సకాలంలో చెల్లిస్తున్న కారణంగా బ్యాంకులు వారికి ఎటువంచి పూచీకత్తు లేకుండానే రూ.10 లక్షల వరకు రుణాలిచ్చేందుకు ముందుకు వస్తున్నాయి.


గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్‌) పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 3,99,120 మహిళా స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వాటిలో 43,29,058 మంది సభ్యులున్నారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) పరిధిలో మరో 1,81,225 ఎస్‌హెచ్‌జీల్లో 19 లక్షల మంది సభ్యున్నారు. వడ్డీ రాయితీ వస్తుందన్న ఉద్దేశంతో పలు రంగాల్లో ఉపాధి పొందేందుకు రుణాలు తీసుకున్న మహిళలను ప్రభుత్వం నిబంధనల పేరిట ఇబ్బందులకు గురిచేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతినెల రుణ వాయిదా చెల్లించాల్సిన తేదికి ఒక్క రోజు ఆలస్యమైనా ఆ నెల వడ్డీని చెల్లించేది లేదని చెబుతున్న ప్రభుత్వం.. వడ్డీ రాయితీని లబ్ధిదారుల ఖాతాల్లో వేయడంపై మాత్రం దృష్టి పెట్టడం లేదు.


మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో ఉమ్మడి రాష్ట్రంలో వీఎల్‌ఆర్‌ పథకాన్ని ప్రవేశపెట్టారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత.. 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తన మేనిఫెస్టోలో మహిళలకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలిస్తామని ప్రకటించింది. అయితే, అధికారం చేపట్టినప్పటి నుంచి రూ.5 లక్షలకు పైగా తీసుకునే రుణాలకు వడ్డీ రాయితీ రావడం లేదు. 


Updated Date - 2022-03-05T07:21:12+05:30 IST