తాగునీరే విషమైందా?
ABN , First Publish Date - 2022-07-07T08:40:16+05:30 IST
దప్పికను తీర్చే తాగునీరే విషమైందా? ఆ నీరు తాగే రెండు నిండు ప్రాణాలు బలయ్యాయా? మరో 50 మందిని తీవ్ర అస్వస్థతకు గురయ్యేలా చేసింది ఈ కలుషితనీరేనా? గద్వాల జిల్లా కేంద్రంలో రేగిన తీవ్ర కలకలమిది.

- గద్వాలలో ఇద్దరి మృతి.. మరో 50 మందికి అస్వస్థత!
- ఇంటింటికీ వైద్య బృందాలు.. మందులు, ఓఆర్ఎస్ అందజేత
- వాటర్‌గ్రిడ్ ద్వారా స్వచ్ఛమైన నీటి సరపరా: ఈఈ
- పరీక్షించాం కలుషితం లేదు: మునిసిపల్ ఇంజనీరు
గద్వాల, జూలై 6: దప్పికను తీర్చే తాగునీరే విషమైందా? ఆ నీరు తాగే రెండు నిండు ప్రాణాలు బలయ్యాయా? మరో 50 మందిని తీవ్ర అస్వస్థతకు గురయ్యేలా చేసింది ఈ కలుషితనీరేనా? గద్వాల జిల్లా కేంద్రంలో రేగిన తీవ్ర కలకలమిది. రెండు రోజుల నుంచి అక్కడ కలుషిత తాగునీరు సరఫరా అవుతోందన్న ఆరోపణలున్నాయి. మంగళవారమైతే కలుషితం తీవ్రం కావడంతో వాంతులు, విరేచనాలతో గద్వా ల ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు పెద్ద సంఖ్యలో బాధితులు క్యూ కట్టారు. కొందరిని మెరుగైన చికిత్స కోసం కర్నూలు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న వారిలో నర్సింగమ్మ (50), కృష్ణ (45) బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు. గద్వాలలోని గంటవీధి, వేదనగర్, మోహిన్మెహల్ల, కృష్ణారెడ్డి బంగ్లాకు మూడు రోజుల నుంచి కలుషిత నీరు సరఫరా అవుతున్నట్లు స్థానికు లు తెలిపారు. ఈ విషయంపై మునిసిపల్ అధికారులకు, నీటి సరపరా సిబ్బందికి ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. అయితే కలుషిత నీరు ఇద్దరి ప్రాణాలు తీయడం, 50 మంది అస్వస్థత బారిన పడేయడంతో మునిసిపల్, వైద్యసిబ్బంది వార్డులకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.
నీటి సరఫరా పైపు లైన్లను క్షుణ్ణంగా పరిశీలించి 5 చోట్ల నీటి నమూనాలను సేకరించి పరీక్షించారు. మృతి చెందిన నర్సింగమ్మ, కృష్ణల ఇళ్లకు చేరుకొని వారి మృతికి గల కారణాలను తెలుసుకున్నారు. మరోవైపు డీఎంహెచ్‌వో చందునాయక్ అధ్వర్యంలో వైద్యబృందాలు నీటి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపాయి. కాగా వాటర్‌గ్రిడ్ ద్వారా స్వచ్ఛమైన నీటిని సరఫరా చేస్తున్నామని, ప్రతీరోజు పరీక్షలు చేసిన తర్వాతనే నీటిని విడుదల చేస్తామని వాటర్‌గ్రిడ్ ఈఈ జగన్మోహన్ తెలిపారు. పైపు లైన్ల ను పరిశీలించామని, ఎక్కడా లీకేజీలు లేవని, నీటి నమూనాలను సేకరించి పరీక్షించగా కలుషితం కాలేదని తేలిందని మునిసిపల్ పబ్లిక్ హెల్త్ ఏఈఈ నితిశ్ రెడ్డి చెప్పారు. మృతుల కుటుంబాలను విచారించామని ఒకరు గుండెపోటుతో, మరొకరు అనారోగ్యంతో మృతి చెందినట్లు తెలిసిందని ఆయన చెప్పారు. కాగా, ఈ ఘటనకు మంత్రి కేటీఆర్ బాధ్యత వహించి పదవికి రాజీనామా చేయాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు.