సుగంధ పరిమళాల ‘సిరిచందన పట్టు’

ABN , First Publish Date - 2022-10-09T07:42:56+05:30 IST

శరీరం నుంచి సువాసనలు వచ్చేందుకు సుగంధ ద్రవ్యాలు వాడటం సహజం.

సుగంధ పరిమళాల ‘సిరిచందన పట్టు’

సిరిసిల్ల చేనేత కళాకారుని వినూత్న ఆవిష్కరణ 

హైదరాబాద్‌, సిరిసిల్ల, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): శరీరం నుంచి సువాసనలు వచ్చేందుకు సుగంధ ద్రవ్యాలు వాడటం సహజం. కానీ అలాంటివేవీ అవసరం లేకుండా దుస్తులే సువాసన వెదజల్లితే బాగుంటుంది కదా. ఇదే ఆలోచనను నిజంచేస్తూ సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్‌ అద్భుత ఆవిష్కరణ చేశారు. 27 రకాల సుగంధ ద్రవ్యాలతో ఓ పట్టు చీరను రూపొందించారు. ఆ పట్టు చీర ధరించిన వారి దగ్గరకు వెళితే సుగంధ పరిమళాలు ముక్కును తాకుతాయి. నిరంతరం సుగంధ పరిమళాలను వెదజల్లే ప్రత్యేకత కలిగిన ఈ పట్టు చీరకు ‘సిరిచందన పట్టు’గా నామకరణం చేశారు. ప్రగతి భవన్‌లో రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌ ఈ సిరిచందన పట్టు చీరను ఆవిష్కరించారు. ఈ చీర ప్రత్యేకతను తెలుసుకుని రూపకర్త విజయ్‌ను అభినందించారు. ఈ చీర తయారీలో శ్రీగంధం, నాగ కేసరాలు, బిల్వ గుజ్జు, పాల సుగంధి, జాపత్రి, జాజికాయ, ఇలాచీ, జటమాంస, పచ్చ కర్పూరం, కుంకుమపువ్వు, తుంగ దుంపలు, కస్తూరి పసుపు, ఎర్ర చందనం, గులాబీ, సంపగి,. విరజాజి తదితర సుగంధ ద్రవ్యాలను ఉపయోగించినట్టు విజయ్‌ తెలిపారు. డ్రైవాష్‌ చేసినప్పటికీ ఈ చీర ఏడాది పాటు పరిమళం వెదజల్లుతూనే ఉంటుందని వెల్లడించారు. 5.50 మీటర్ల పాడవు, 450 గ్రాముల బరువుండే ఈ సిరిచందన పట్టుచీర 12 వేల ధర పలుకుతోంది.    

Updated Date - 2022-10-09T07:42:56+05:30 IST