చేరికల కమిటీ చైర్మన్‌గా ఇంద్రసేనారెడ్డి

ABN , First Publish Date - 2022-01-17T08:33:13+05:30 IST

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ అందుకు అనుగుణంగా కార్యాచరణను ముమ్మరం చేసింది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో

చేరికల కమిటీ చైర్మన్‌గా ఇంద్రసేనారెడ్డి

బీజేపీలో సమన్వయ కమిటీల ఏర్పాటు

హైదరాబాద్‌, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ అందుకు అనుగుణంగా కార్యాచరణను ముమ్మరం చేసింది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పలు సమస్యలపై పోరాటాలు చేస్తున్న కమల దళం.. రాష్ట్ర స్థాయిలో పార్టీ బలోపేతం కోసం అనేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా బీజేపీలో పలు నూతన కమిటీలను నియమించింది. సీనియర్‌ నేత ఎన్‌.ఇంద్రసేనారెడ్డి చైర్మన్‌గా పార్టీలో చేరికలు, సమన్వయ కమిటీ ఏర్పాటైంది. మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి చైర్మన్‌గా ఎస్సీ సమన్వయ కమిటీ, జాతీయ కార్యవర్గసభ్యులు గరికపాటి మోహన్‌రావు చైర్మన్‌గా ఎస్టీ సమన్వయ కమిటీని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నియమించినట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా సంజయ్‌ కార్యాచరణను సిద్ధం చేశారని ఆయన చెప్పారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ మరోవైపు, క్షేత్ర స్థాయిలో బీజేపీని తిరుగులేని శక్తిగా రూపొందించే దిశగా చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. అందులో భాగంగా ఎస్సీ, ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించారని, ఆయా చోట్ల పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేసేందుకు ఎస్సీ, ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కమిటీలను నియమించారని ప్రేమేందర్‌రెడ్డి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇతర పార్టీల నుండి పెద్ద ఎత్తున బీజేపీలో చేరేందుకు పలువురు ఆసక్తి చూపుతుండటంతో రాష్ట్ర స్థాయిలో జాయినింగ్స్‌ అండ్‌ కో ఆర్డినేషన్‌(చేరికలు, సమన్వయ) కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు.


అసంతృప్తులపై అధిష్ఠానం సీరియస్‌..

ఇటీవల కరీంనగర్‌, నిజామాబాద్‌లో జరిగిన ఘటనలకు సంబంధించి అంతర్గత విచారణకు బీజేపీ జాతీయ నాయకత్వం ఆదేశించింది. ఇందుకు అనుగుణంగా, ఐదుగురు సీనియర్‌ నాయకులతో రాష్ట్ర శాఖ విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర నాయకత్వం తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ కరీంనగర్‌లో కొంత మంది సీనియర్‌ నాయకులు ఆత్మాభిమాన సమావేశం నిర్వహించగా, నిజామాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే ఒకరు ఎంపీ అర్వింద్‌పై బహిరంగంగా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కాగా, జీవో 317 అంశాన్ని పక్కదారి పట్టించేందుకు టీఆర్‌ఎస్‌ పథకం ప్రకారం కొంత మంది తమ పార్టీ నాయకులను ప్రేరేపిస్తోందని అనుమానిస్తున్నట్లు బీజేపీ సీనియర్‌ నేత ఒకరు ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు. తమ పార్టీ నుంచి కొన్నాళ్ల కిందట టీఆర్‌ఎ్‌సలో చేరిన ఓ నేత తిరిగి వచ్చి అసంతృప్త సమావేశం ఏర్పాటు చేయడం సందేహాలకు ఊతమిస్తోందని పేర్కొన్నారు.


అంతర్జాతీయ కార్గో టెర్మినల్‌ పెట్టండి: యెన్నం

శంషాబాద్‌ విమానాశ్రయంలో అంతర్జాతీయ కార్గో టెర్మినల్‌ ఏర్పాటు చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాసరెడ్డి.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. పోచంపల్లి తరహాలో మరో మూడు హాండ్లూమ్‌ క్లస్టర్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌లో తెలంగాణ నుంచి అవసరమైన ప్రతిపాదనలను నిర్మల సీతారామన్‌ ఆదివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సు ద్వారా బీజేపీ రాష్ట్ర నాయకుల నుంచి తీసుకున్నారు. సుమారు 20 ప్రతిపాదనలను నేతలు కేంద్ర మంత్రికి నివేదించారు.

Read more