గల్ఫ్‌లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

ABN , First Publish Date - 2022-08-16T08:50:08+05:30 IST

భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను విదేశాల్లోని ప్రవాసీయులు ఘనంగా జరుపుకున్నారు.

గల్ఫ్‌లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

ప్రత్యేక ఆకర్షణగా హర్‌ ఘర్‌ తిరంగా

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి)

భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను విదేశాల్లోని ప్రవాసీయులు ఘనంగా జరుపుకున్నారు. భారత దౌత్య కార్యాలయాలతోపాటు అనేక కంపెనీలు, లేబర్‌ క్యాంపుల్లో జెండా పండుగ ఘనంగా జరిగింది. హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమం గల్ఫ్‌ దేశాల్లోనూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రధాని నరేంద్ర మోదీ సమర్థవంతమైన నాయకత్వంతో భార త జాతీయ జెండాకు గౌరవం మరింత పెరిగిందని జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం యూఏఈలోని భారత రాయబారి సంజయ్‌ సుధీర్‌ పేర్కొన్నారు. భారత పాస్‌పోర్ట్‌ కలిగి ఉండటంతో భారతీయులు ప్రపంచవ్యాప్తంగా గౌరవం పొందగలుగుతున్నారన్నారు. దుబాయిలోని అరేబియా సముద్ర తీరంలో లాంచీలపై త్రివర్ణ పతాకాలతో భారతీయులు తిరుగుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దుబాయిలో కాన్సుల్‌ జనరల్‌ అమన్‌ పూరీ జాతీయ పతాకావిష్కరణ  చేశారు. సౌదీ అరేబియాలోని అరేబియా సముద్ర తీరంలో భారీ ప్రాజెక్టులో పని చేస్తున్న తెలుగువారితోపాటు భారతీయులందరు కలిసి స్వాతంత్య్ర దినోత్సవ వేడుక లు జరుపుకోవడం సంతోషం కలిగించిందని జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం దాంరాజ్‌పల్లికి చెందిన వడ్ల లక్ష్మీనారాయణ చారి పేర్కొన్నారు. హర్‌ ఘర్‌ తిరంగాలో భాగంగా రియాద్‌లోని తమ ఇంటిపై జెండా ఎగురవేసినట్టు హైదరాబాద్‌కు చెందిన సీహెచ్‌ శివారెడ్డి తెలిపారు. భారత కాన్సులేట్‌ అవరణలో జరిగిన కార్యక్రమంలో పాల్గొనడం మరింత జాతీయస్ఫూర్తిని కలిగించిందని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సాటా అధ్యక్షుడు ఎస్‌.మల్లేశం, హైదరాబాద్‌కు చెందిన మీర్జా ఖుద్రత్‌ నవాజ్‌ పేర్కొన్నారు. కువైత్‌ నగరంలో 100 బస్సులపై భారత త్రివర్ణ పతాక రంగులు వేయించి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. షార్జాలోని లేబర్‌ క్యాంపులోనూ జెండా పండుగ నిర్వహించారు. ఖతర్‌, బహ్రెయిన్‌, ఒమన్‌లలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 

Read more