ఖానామెట్‌ భూవివాదంలో.. సర్కారుకు ఎదురుదెబ్బ

ABN , First Publish Date - 2022-08-18T08:35:41+05:30 IST

సినీ ప్రముఖులు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య నెలకొన్న భూవివాదంలో సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది.

ఖానామెట్‌ భూవివాదంలో.. సర్కారుకు ఎదురుదెబ్బ

26 ఎకరాల భూమి సినీ ప్రముఖులదే

హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పు


హైదరాబాద్‌, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): సినీ ప్రముఖులు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య నెలకొన్న భూవివాదంలో సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. ఖానామెట్‌లోని 26.16 ఎకరాల భూమి సినీ ప్రముఖులకు చెందినదేనని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ బుధవారం తీర్పు ఇచ్చింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్‌ గ్రామంలోని 4, 5, 8, 9, 10 తదితర సర్వే నంబర్లలోని 26.16 ఎకరాల భూములపై సినీ ప్రముఖులు దగ్గుబాటి రామానాయుడు, దగ్గుబాటి సురేశ్‌బాబు, దగ్గుబాటి వెంకటేశ్‌, ఇతర కుటుంబ సభ్యులు, దర్శకుడు కె.రాఘవేంద్రరావు, పి.గోవింద్‌ రెడ్డి తదితరులకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వివాదం నెలకొంది. ఈ భూములు దగ్గుబాటి కుటుంబం, కె.రాఘవేంద్రరావు, ఇతర ప్రతివాదులకు చెందినవేని 2017లో హైకోర్టు సింగిల్‌ జడ్జి ధర్మాసనం తీర్పు వెలువరించింది. దీన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అప్పీళ్లు దాఖలుచేసింది. ఈ అప్పీళ్లపై చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌, జస్టిస్‌ సూరేపల్లి నందా ఽధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది శ్రీరఘురాం వాదనలు వినిపిస్తూ... 1961లో ఈ భూములను మాజీ సైనికాధికారులకు ప్రభుత్వం కేటాయించిందని (అసైన్‌మెంట్‌), అసలు పట్టాదారులైన సైనికాధికారుల నుంచి కె.కౌసల్య చట్టబద్ధంగా కొనుగోలు చేశారని తెలిపారు. కౌసల్య నుంచి 1996లో రిజిస్టర్డ్‌ సేల్‌ డీడ్‌ ద్వారా తాము కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఈ భూములను కొనేటప్పుడుగానీ, రిజిస్ర్టేషన్‌ సమయంలోగానీ అధికారులు అభ్యంతరం చెప్పలేదని, ఇప్పుడు అవి ప్రభుత్వ భూములని పేర్కొనడం చెల్లదని పేర్కొన్నారు. ఇవే భూములపై హెచ్‌ఎండీఏ మొదటి విడత లిటిగేషన్‌ను కొనసాగించిందని, హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ దాన్ని  కొట్టేసిందని గుర్తుచేశారు. ఈ భూములను తాము కొన్నట్లు భూపరిపాలన కమిషనర్‌ నిర్థారించారని పేర్కొన్నారు. వివాదంలో ఉన్న భూమి 1997లోనే పిటిషనర్ల పేరుమీద మ్యుటేషన్‌ జరిగిందని, పట్టాదారు పాస్‌పుస్తకాలు సైతం జారీ అయ్యాయని పేర్కొన్నారు. అయితే 2008లో ఎక్స్‌సర్వీ్‌సమెన్‌కు చేసిన అసైన్‌మెంట్‌ కరెక్ట్‌ కాదనే వాదనను తెరపైకి తెచ్చారని పేర్కొన్నారు. దీనిపై తాము హైకోర్టును ఆశ్రయించగా తమకు అనుకూలంగా సింగిల్‌ జడ్జి ఆదేశాలు ఇచ్చారని గుర్తుచేశారు.


రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏఏజీ జే రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ.. వివాదంలో ఉన్న 26.16 ఎకరాల భూమిపై సినీ ప్రముఖులకు ఎలాంటి హక్కులు లేవని పేర్కొన్నారు. వారు కొనుగోలు చేశామని చెబుతున్న అసైనీలకు అసలు టైటిల్‌ లేదన్నారు. అవి ప్రభుత్వ భూములే అని పేర్కొన్నారు. ఈ భూములను ప్రభుత్వం మాజీ సైనికాధికారికి అసైన్‌ చేసినట్లు తప్పుడు పత్రాలు సృష్టించారని పేర్కొన్నారు. ఎక్స్‌సర్వీ్‌సమెన్‌కు భూములు కేటాయించాలని ప్రభుత్వం 1963లో నిర్ణయిస్తే.. అంతకుముందే కేటాయింపులు జరిగినట్లు డాక్యుమెంట్లు సృష్టించారని తెలిపారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. అసైనీలు ఎక్స్‌సర్వీ్‌సమెన్‌ కాదని, 1961లో జరిగిన అసైన్‌మెంట్‌ తప్పు అని ప్రభుత్వం భావించినప్పడు దాన్ని రద్దు చేయడానికి ఎందుకు చర్యలు తీసుకోలేదని వ్యాఖ్యానించింది. అసైన్‌మెంట్‌ సరైందా? కాదా? అని నిర్థారించకుండా పిటిషనర్లకు సంబంధించిన సప్లిమెంటరీ సేత్వార్‌ను రద్దు చేయడం చెల్లదని పేర్కొంది. అసైనీలు, కె.కౌసల్య అనే ప్రైవేటు పార్టీకి మధ్య జరిగిన భూలావాదేవీని సైతం ప్రభుత్వం రద్దు చేయజాలదని పేర్కొంది. ప్రభుత్వం 1961లో జరిగిన అసైన్‌మెంట్‌ తప్పు అని చెబుతుందని, కానీ పిటిషనర్లు తప్పుచేసినట్లు ఎక్కడా నిరూపించలేదని స్పష్టంచేసింది. ప్రభుత్వ వాదనలో బలంలేదని.. సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పు సరైందేనని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీళ్లను కొట్టేస్తూ తుది తీర్పు వెలువరించింది. 

Updated Date - 2022-08-18T08:35:41+05:30 IST