వైద్య ఆరోగ్య శాఖలో... 1,147 పోస్టులు

ABN , First Publish Date - 2022-12-07T02:36:20+05:30 IST

ప్రభుత్వ వైద్య కళాశాలలు, అనుబంధ ఆస్పత్రుల్లో కొత్తగా 1,147 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

వైద్య ఆరోగ్య శాఖలో...  1,147 పోస్టులు

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఖాళీలకు నోటిఫికేషన్‌

వైద్యవిద్య సంచాలకుల పరిధిలోని 34 విభాగాల్లో..

ఈ నెల 20 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు

జనవరి 5 గడువు.. పాయింట్ల ఆధారంగా భర్తీ

అర్హతలకు 80, అనుభవానికి 20 శాతం వెయిటేజీ

ఎంపికైతే ప్రైవేటు ప్రాక్టీసుకు అనర్హులు

నోటిఫికేషన్‌లో స్పష్టంచేసిన మెడికల్‌ బోర్డు

వైద్య శాఖలో ఉద్యోగాల వాన: మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్‌, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ వైద్య కళాశాలలు, అనుబంధ ఆస్పత్రుల్లో కొత్తగా 1,147 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులన్నీ వైద్యవిద్య సంచాలకుల పరిధిలోనివే. మొత్తం 34 విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు డిసెంబరు 20 నుంచి జనవరి 5లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులన్నింటికీ పీజీ అర్హత తప్పనిసరి. అలాగే వయసు 18 నుంచి 44 ఏళ్లలోపు ఉండాలి. కాగా... ఈ పోస్టులకు ఎంపికైన వైద్యులు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు ప్రాక్టీసు చేయకూడదని నోటిఫికేషన్‌లో మెడికల్‌ బోర్డు స్పష్టంగా పేర్కొంది. అలాగే మార్కులు, అనుభవానికి పాయింట్లు కేటాయించడం ద్వారా ఖాళీలను భర్తీ చేస్తారు. మొత్తం 100 పాయింట్ల ఆధారంగా నియామక ప్రక్రియ ఉంటుంది. ఎంబీబీఎస్‌, పీజీలో సాధించిన మార్కులకు 80 శాతం పాయింట్లు ఇస్తారు. మిగిలిన 20 పాయింట్లను... ఆయా సర్కారు దవాఖానాల్లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేసిన అనుభవానికి కేటాయిస్తారు. గిరిజన ప్రాంతాల్లో కనీసం 6 మాసాలు పనిచేసుంటే 2.5 పాయింట్ల వెయిటేజీ ఇస్తారు. గిరిజనేతర ప్రాంతాల్లో అయితే 6 నెలలకు 2 పాయింట్లు ఇస్తారు. కనీసం 6 మాసాలు పనిచేస్తేనే అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. అలాగే ఎక్స్‌పీరియన్స్‌ సర్టిఫికెట్లను అభ్యర్థులు తాము పనిచేసిన ఆస్పత్రుల సూపరింటెండెంట్ల నుంచి తీసుకోవాలి. నిబంధనలను అనుసరించి రిజర్వేషన్లను అమలుచేస్తారు. ఈ మేరకు బోర్డు మెంబర్‌ సెక్రటరీ గోపీకాంత్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

1,147 పోస్టులివే...

మెడికల్‌ బోర్డు జారీ చేసిన నోటిఫికేషన్‌లో నాలుగు విభాగాల్లోనే ఎక్కువ పోస్టులున్నాయి. అనెస్థీషియా, గైనకాలజీ, జనరల్‌ మెడిసిన్‌, సర్జరీల్లో మొత్తం 525 ఖాళీలున్నాయి. ఇక విభాగాల వారీగా చూస్తే... అనాటమీలో 26, ఫిజియాలజీలో 26, పాథాలజీలో 31, కమ్యూనిటీ మెడిసిన్‌లో 23, మైక్రోబయాలజీలో 25, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌లో 25, బయోకెమిస్ట్రీలో 20, ట్రాన్స్‌ఫ్యూజన్‌ మెడిసిన్‌లో 14, జనరల్‌ మెడిసిన్‌లో 111, జనరల్‌ సర్జరీలో 117, పీడియాట్రిక్స్‌లో 77, అనెస్థీషియాలో 155, రేడియో డయాగ్నసి్‌సలో 46, ఆంకాలజీలో 5, సైకియాట్రీలో 23, రెస్పిరేటరీ మెడిసిన్‌లో 10, డెర్మటాలజీలో 13, గైనకాలజీలో 142, ఆప్తల్మాలజీలో 8, ఆర్థోపెడిక్స్‌లో 62, ఈఎన్‌టీలో 15, హస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌లో 14, ఎమర్జెన్సీ మెడిసిన్‌లో 15, కార్డియాలజీలో 17, సీటీ సర్జరీలో 21, ఎండోక్రినాలజీలో 12, గ్యాస్ట్రోఎంట్రాలజీలో 14, న్యూరాలజీలో 11, న్యూరోసర్జరీలో 16, ప్లాస్టిక్‌ సర్జరీలో 17, పీడియాట్రిక్‌ సర్జరీలో 8, యూరాలజీలో 17, నెఫ్రాలజీలో 10, మెడికల్‌ ఆంకాలజీలో ఒక పోస్టు ఉన్నాయి. కాగా... రాష్ట్ర ఆవిర్భావం తర్వాత బోధనాస్పత్రులు, మెడికల్‌ కాలేజీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వడం ఇది రెండోసారి. 2017లో తొలిసారిగా 450 పోస్టుల భర్తీకి టీఎ్‌సపీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చింది. అయితే కోర్టు కేసుల వల్ల నియామక ప్రక్రియలో తీవ్ర జాప్యం జరిగింది. చివరికి 2019లో కోర్టు కేసు క్లియర్‌ కావడంతో పోస్టింగ్స్‌ ఇచ్చారు. గతంలో రాత పరీక్ష ఆధారంగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టగా... ప్రస్తుతం మార్కులు, వెయిటేజ్‌ ప్రాతిపదికన రిక్రూట్‌మెంట్‌ చేస్తున్నారు. కాగా... తాజా నోటిఫికేషన్‌తో ప్రస్తుతం ఉన్న కాలేజీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల కొరత పూర్తిస్థాయిలో తీరుతుందని వైద్యవర్గాలు వెల్లడించాయి. అయితే అసోసియేట్‌ ప్రొఫెసర్‌, ప్రొఫెసర్‌ పోస్టులకు మాత్రం కొరత ఉంటుందని చెబుతున్నారు. ఈ రెండు పోస్టులను పదోన్నతుల ఆధారంగా భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇక కొత్తగా ఏర్పాటు చేసిన కాలేజీలకు సంబంధించిన పోస్టులను ప్రస్తుత రిక్రూట్‌మెంట్‌లో చేర్చలేదని, వాటికి మరో నోటిఫికేషన్‌ ఇవ్వాల్సి ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు.

వైద్యశాఖలో ఉద్యోగాల వాన: హరీశ్‌రావు

వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగాల వాన పడుతోందని మంత్రి హరీశ్‌రావు ట్వీట్‌ చేశారు. వైద్యవిద్య సంచాలకుల పరిధిలో మొత్తం 1,147 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఖాళీల భర్తీకి మెడికల్‌ బోర్డు నోటిఫికేషన్‌ జారీ చేసిందని అందులో పేర్కొన్నారు. అలాగే పోస్టుల వివరాలను కూడా మంత్రి జతచేశారు.

Updated Date - 2022-12-07T02:36:21+05:30 IST