ఆటోడ్రైవర్‌ ఆత్మహత్య ఘటనలో.. సిద్దిపేట టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌పై కేసు

ABN , First Publish Date - 2022-12-07T02:46:14+05:30 IST

డబుల్‌ బెడ్‌రూం ఇల్లు మంజూరైనా.. తనకు రాకుండా టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ సిద్దిపేట ఆటో డ్రైవర్‌ శిలాసాగరం రమేశ్‌ (35) ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతం వివాదాస్పదం అవుతోంది.

ఆటోడ్రైవర్‌ ఆత్మహత్య ఘటనలో..  సిద్దిపేట టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌పై కేసు

నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్‌ కింద నమోదు..!

ఇదిగో నాకు ఇల్లు మంజూరైన ఆధారాలు

ఐనా న్యాయం జరగకుంటే ఫినిష్‌ అవుతా

బయటకొచ్చిన ఆటో డ్రైవర్‌ మరో వీడియో

‘డబుల్‌’ ఇల్లు రాకుండా అడ్డుపడ్డాడు

భార్యకు ఉద్యోగం ఇప్పిస్తానని మోసం

కౌన్సిలరే కారణమంటూ తొలి వీడియో

కేసీఆర్‌ సొంత ఆస్తులమ్మి పథకాలిస్తున్నడా?

రమేశ్‌ కుటుంబానికి 50 లక్షలివ్వాలి: ఈటల

సిద్దిపేట/గజ్వేల్‌, ఆంధ్రజ్యోతి, డిసెంబరు 6: డబుల్‌ బెడ్‌రూం ఇల్లు మంజూరైనా.. తనకు రాకుండా టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ సిద్దిపేట ఆటో డ్రైవర్‌ శిలాసాగరం రమేశ్‌ (35) ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతం వివాదాస్పదం అవుతోంది. ఈ ఘటనపై కాంగ్రెస్‌, బీజేపీ మంగళవారం నిరసనలకు దిగాయి. మరోవైపు రమేశ్‌ ఆరోపణలు చేసిన 26వ వార్డు టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ కెమ్మసారం ప్రవీణ్‌పై త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో సెక్షన్‌ 306 కింద నాన్‌ బెయిలబుల్‌ కేసు నమోదైంది. మూడుసార్లు డబుల్‌ బెడ్‌ రూం ఇల్లు రాకుండా అడ్డుకుని, తమకు ఇవ్వాల్సిన రూ.లక్ష ఇవ్వకుండా గొడవ పెట్టుకున్నాడని ప్రవీణ్‌పై రమేశ్‌ భార్య లలిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. పదవిలో ఉన్నంత కాలం ఇల్లు రాకుండా చేస్తానని బెదిరించడంతో తన భర్త మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడని పేర్కొంది. కాగా, తన భార్యకు ఏఎన్‌ఎం ఉద్యోగం ఇప్పిస్తానని ప్రవీణ్‌ మోసం చేశాడని, ప్రశ్నించినందుకు ఇల్లు రాకుండా చేస్తున్నాడని ఆరోపిస్తూ సోమవారం సిద్దిపేట కలెక్టరేట్‌ వద్ద పురుగు మందు తాగుతూ, సెల్ఫీ వీడియో తీసుకుంటూ రమేశ్‌ ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు.

ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. అయితే, ఇల్లు మంజూరైనట్లు ఆధారాలను చూపిస్తున్న రమేశ్‌కు చెందిన మరో వీడియో మంగళవారం వైరల్‌గా మారింది. అందులోనూ కౌన్సిలర్‌ ప్రవీణ్‌పై తీవ్ర ఆరోపణలు చేశాడు. న్యాయం జరగకుంటే ఫినిష్‌ అవుతానని హెచ్చరించాడు. మరోవైపు ప్రవీణ్‌తో పాటు మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ రాజనర్సును వెంటనే అరెస్టు చేయాలని బీజేపీ ఆధ్వర్యంలో మంత్రి హరీశ్‌ దిష్టిబొమ్మను, కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఫ్లెక్సీలను దహనం చేశారు. రమేశ్‌ మృతిపై రాజకీయాలు చేస్తున్నారని, ‘డబుల్‌’ ఇళ్లలో అక్రమాలు జరగలేదని టీఆర్‌ఎస్‌ నాయకులు పేర్కొన్నారు. మంత్రి చొరవతో రమేశ్‌ భార్యకు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగం వచ్చిందని, 15 రోజుల్లో ఇల్లు వచ్చేదని వివరించారు.

రమేశ్‌ ఇల్లు ఆశించడం తప్పా?

రాష్ట్రం సీఎం కేసీఆర్‌ అబ్బ జాగీరు కాదని బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్‌, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ విమర్శించారు. రమేశ్‌ స్వగ్రామం గజ్వేల్‌ మండలం అహ్మదీపూర్‌లో ఆయన మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. రాష్ట్రంలో నిత్యం ఏదో మూలన దళిత, గిరిజనులపై వేధింపులు జరుగుతున్నాయని, పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి న్యాయం చేయాలని కోరితే టీఆర్‌ఎస్‌ కండువా వేసుకుంటే సంక్షేమ పథకాలు వస్తాయని చెబుతున్నారని ఆరోపించారు. సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్‌ ఫాంహౌజ్‌ భూములు, సొంత ఆస్తులమ్మి ఇవ్వడం లేదని, పేదలు చెమట కార్చి కట్టిన పన్నులతోనే ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. రమేశ్‌ సిద్దిపేటలో ఇల్లు ఆశించడం తప్పా అని ప్రశ్నించారు. బాధిత కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

నిరుపేద ఆటోడ్రైవర్‌, సొంత ఇళ్లు, సొంత ఊర్లో గుంటెడు జాగాలేని వ్యక్తి.. డబుల్‌ బెడ్‌రూం ఇంటికి అర్హుడు కాదా అని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకోవాలన్న కౌన్సిలర్‌ దుర్మార్గ ఆలోచనతో ఈ దురదృష్టకర ఘటన జరిగిందన్నారు. వందలాది మంది పోలీసుల మధ్య చీకటి పడ్డాక రమేశ్‌ మృతదేహాన్ని తీసుకొచ్చి వదిలేశారని, ఇంతకంటే దారుణం మరోటి ఉంటుందా అని నిలదీశారు. రమేశ్‌ మృతదేహానికి కాంగ్రెస్‌ నేత వీహెచ్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. రమేశ్‌ది రాజకీయ హత్య అని ఆరోపించారు. రెండు పడుక గదుల ఇళ్లకు టీఆర్‌ఆర్‌ నాయకులు రూ.లక్షలు వసూలు చేస్తున్నారని అన్నారు. ఓటువేసి గెలిపించిన రమేశ్‌ కుటుంబాన్ని సీఎం కేసీఆర్‌ పరామర్శించాలని, రూ.50 లక్షల పరిహారం, రమేశ్‌ భార్యకు ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రమేశ్‌ కుటుంబాన్ని ఫార్మర్స్‌ ఫస్ట్‌ సొసైటీ చైర్మన్‌ చంద్రశేఖర్‌గౌడ్‌ పరామర్శించి, రూ.2 లక్షలు అందజేశారు. ప్రభుత్వం రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని, వారి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-12-07T02:46:15+05:30 IST