వరద ప్రభావిత జిల్లాలకు తక్షణ సహాయం

ABN , First Publish Date - 2022-07-18T08:54:34+05:30 IST

గోదావరి పోటెత్తడంతో ములుగు జిల్లాలో వరద తాకిడికి గురైన ప్రాంతాల్లో సీఎం కేసీఆర్‌ ఆదివారం ఏరియల్‌ సర్వే నిర్వహించారు. భద్రాచలం నుంచి నేరుగా హెలికాప్టర్‌ ద్వారా గోదావరి పరీవాహక ప్రాంతాన్ని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌తో కలిసి

వరద ప్రభావిత జిల్లాలకు తక్షణ సహాయం

భూపాలపల్లి/ఓరుగల్లు, జూలై 17 (ఆంధ్రజ్యోతి): గోదావరి పోటెత్తడంతో ములుగు జిల్లాలో వరద తాకిడికి గురైన ప్రాంతాల్లో సీఎం కేసీఆర్‌ ఆదివారం ఏరియల్‌ సర్వే నిర్వహించారు. భద్రాచలం నుంచి  నేరుగా హెలికాప్టర్‌ ద్వారా గోదావరి పరీవాహక ప్రాంతాన్ని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌తో కలిసి పరిశీలించారు. భద్రాచలం, మణుగూరు నుంచి ములుగు జిల్లా మంగపేట, వెంకటాపురం, వాజేడు, ఏటూరునాగారం, కన్నాయిగూడెం మండలాల్లోని గోదావరి ముంపు ప్రాంతాల్లోని జలమయమైన ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం వాజేడు మండలం ముళ్లకట్ట బ్రిడ్జి సమీపంలో మండపాక వద్ద సీఎం హెలికాప్టర్‌ మధ్యాహ్నం 1.30 గంటలకు ల్యాండ్‌ అయింది. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఏటూరునాగారం ఐటీడీఏ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఇక్కడే మధ్యాహ్న భోజనం చేసి, ఎమ్మెల్యేలు, అధికారులతో వరదలపై సమీక్షించారు. ఐటీడీఏ క్యాంపు కార్యాలయం నుంచి ఏటూరునాగారం మండలం రామన్నగూడేనికి మధ్యాహ్నం 3:34 గంటలకు చేరుకున్న సీఎం కేసీఆర్‌.. నీట మునిగిన ఎస్సీ, ఎస్టీ కాలనీలను సందర్శించి వారితో మాట్లాడారు. కరకట్ట నిర్మాణానికి రూ.137 కోట్లు కేటాయించామని, త్వరలోనే పనులు చేపడతామని అన్నారు. గోదావరమ్మకు చీరె, సారె, పసుపు, కుంకుమ సమర్పించారు. ఐటీడీఏ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం మాట్లాడుతూ వర్ష ప్రభావం అధికంగా ఉన్న ములుగు జిల్లాకు రూ.2.50 కోట్లు, భూపాలపల్లి జిల్లాకు రూ.2 కోట్లు, మహబూబాబాద్‌ జిల్లాకు రూ.1.50 కోట్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రూ.2.30 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈ నిధులను వరద ప్రాంతాల్లో తక్షణ సహాయం కోసం వినియోగించుకోవాలని సూచించారు. మరో మూడు నెలల వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, వర్షాలు ముగిసేంత వరకు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రెండు హెలికాప్టర్లను అందుబాటులో ఉంచుకోవాలని అధికారులను ఆదేశించారు. శాపెల్లి గ్రామానికి బ్రిడ్జి నిర్మాణానికి అటవీ అధికారులు అడ్డుపడుతున్నారని ఎమ్మెల్యే సీతక్క సీఎం దృష్టికి తీసుకురాగా.. వారిని సీఎం మందలించారు.  

Read more