ధాన్యం అమ్మితే కొందాం.. లేదంటే మిల్లింగ్ చేసిద్దాం
ABN , First Publish Date - 2022-06-26T09:36:38+05:30 IST
కేంద్ర ప్రభుత్వం కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) తీసుకోకపోతే, రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం అమ్మాలని నిర్ణయిస్తే.
- తిరిగి అప్పగించాలని కోరితే అందుకూ సిద్ధమే!.
- ప్రస్తుతానికి వేచిచూసే ధోరణిని అవలంబిద్దాం
- రాష్ట్ర మిల్లర్ల సమావేశంలో నిర్ణయం
హైదరాబాద్, జూన్ 25(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) తీసుకోకపోతే, రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం అమ్మాలని నిర్ణయిస్తే.. ఈ- టెండరు విధానంలో వాటిని కొనాలని మిల్లర్లు నిర్ణయించారు. ఒకవేళ మిల్లింగ్ ఛార్జీలు చెల్లించి, బియ్యం తీసుకుంటామంటే దానికి కూడా సిద్ధమేనని ప్రకటించారు. రాష్ట్ర సర్కారు ఏ ప్రతిపాదనతో వచ్చినా స్వాగతిస్తామని, ఈ రెండూ కాకుండా.. ఇచ్చిన ధాన్యాన్ని తిరిగి ఇవ్వమని ప్రభుత్వం కోరినా తమకు అంగీకారమేనని మూడో ప్రతిపాదన సైతం పెట్టారు. ఏదో ఒక నిర్ణయం త్వరగా తీసుకోవాలని, లేకపోతే మిల్లుల్లో ఉన్న ధాన్యం పాడైపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో శనివారం సాయంత్రం తెలంగాణ రాష్ట్ర రైస్ మిల్లర్ల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంపా నాగేందర్, ప్రధాన కార్యదర్శి మోహన్‌రెడ్డి, కార్యవర్గ సభ్యులు, అన్ని జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్రంగా చర్చించారు. కాగా, కేంద్రం నుంచి బియ్యం సేకరణ పునఃప్రారంభం అవుతున్నదనే సంకేతాలతో రాష్ట్రం వేచి చూసే ధోరణిలో ఉందని, ఇరు ప్రభుత్వాల నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చేదాకా నిరీక్షించడమే మంచిదనే నిర్ణయానికి వచ్చారు.
టెస్ట్ మిల్లింగ్‌తో నష్టమే..
ఒకవేళ ఎఫ్‌సీఐ బియ్యం సేకరణ చేయకపోతే.. పరిస్థితి ఏమిటనే అంశంపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. ఏదోఒక నిర్ణయం త్వరగా జరగాలని, మళ్లీ వానాకాలం ధాన్యం వచ్చేలోపు పాత ధాన్యం వెళ్లిపోతేనే బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చారు. సీఎంఆర్ విధానం గతంలోలానే కొనసాగితే.. ఉప్పుడు బియ్యానికి బదులుగా, ముడి బియ్యం ఇస్తే... నూకల నష్ట పరిహారం పరిస్థితి ఏమిటి? అనేది చర్చకు వచ్చింది. ఐఏఎ్‌సల కమిటీ, టెస్ట్ మిల్లింగ్‌తో నష్టమే ఎక్కువనే అభిప్రాయాన్ని కొందరు మిల్లర్లు వ్యక్తం చేశారు. ఏదిఏమైనా ప్రభుత్వ చర్యలతో మిల్లింగ్ ఇండస్ట్రీ దెబ్బతినవద్దని, ఏ నిర్ణయమైనా త్వరగా తీసుకోవాలని మిల్లర్లు నిర్ణయించారు. గత వానాకాలం, యాసంగి సీజన్లకు సంబంధించి 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లుల్లో ఉన్నాయని, నాలుగు నెలల్లో వానాకాలం ధాన్యం కూడా వస్తుందని, దీన్నంతటినీ ఎక్కడ నిల్వచేయాలని పలువురు మిల్లర్లు రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులను ప్రశ్నించారు. ఇప్పటికే ధాన్యం మొలకలు వస్తున్నాయని, కొన్నిచోట్ల మురిగిపోతున్నదని వాపోయారు. మూడు వారాలుగా మిల్లులకు తాళాలు ఉన్నాయని, భౌతిక తనిఖీ పేరుతో ఎఫ్‌సీఐ అధికారులు వేధిస్తున్నా.. రాష్ట్ర కార్యవర్గం ఏంచేస్తున్నట్లని నిలదీశారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాల్సిన బాధ్యత సంఘంపై ఉన్నదని, లేకపోతే మిల్లింగ్ పరిశ్రమ కుప్పకూలే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు.