Phones Destroyed: ఫోన్లను ధ్వంసం చేస్తే.. రికవరీ కష్టమే..!
ABN , First Publish Date - 2022-12-04T04:03:42+05:30 IST
ఏదైనా కేసులో నిందితులు ఉపయోగించిన సెల్‌ఫోన్లను శాస్త్రీయంగా ధ్వంసం చేస్తే డేటా రికవరీ అసాధ్యమేనా? కొన్ని ప్రత్యేక పద్ధతులను అవలంబిస్తే..
అయినా.. ప్రత్యామ్నాయ మార్గాలు
ఫోన్లను మార్చినా.. ఏమార్చలేరు..!!
సాంకేతిక పరికరాలపై నిఘాకు.. కేంద్ర దర్యాప్తు సంస్థలకు పూర్తి స్వేచ్ఛ
హైదరాబాద్, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ఏదైనా కేసులో నిందితులు ఉపయోగించిన సెల్‌ఫోన్లను శాస్త్రీయంగా ధ్వంసం చేస్తే డేటా రికవరీ అసాధ్యమేనా? కొన్ని ప్రత్యేక పద్ధతులను అవలంబిస్తే.. ఆధారాలు తుడిచిపెట్టుకుపోయినట్లేనా?? ఈ ప్రశ్నలకు సైబర్ సెక్యూరిటీ, ఐటీ నిపుణులు అవుననే అంటున్నారు. అయితే.. నిందితులు ఏదో ఒక సందర్భంలో.. ఎక్కడో ఒకచోట ఆధారాన్ని వదిలేస్తారని, ఆ ఒక్క క్లూతో కేసును ఛేదించవచ్చని చెబుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో 38 మంది నిందితులు, అనుమానితులు ఈ డీల్ ముగిసేదాకా 170 ఫోన్లు వాడారని.. ఆ తర్వాత వాటిల్లో కొన్నింటిని ధ్వంసం చేశారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వెల్లడించిన నేపథ్యంలో.. ఫోన్ డేటా రికవరీపైనే చర్చ జరుగుతోంది. సెల్‌ఫోన్లు, ల్యాబ్‌టా్‌పలను నిందితులు శాస్త్రీయ పద్ధతుల్లో ధ్వంసం చేస్తే.. రికవరీ దాదాపుగా అసాధ్యమే. ఇందుకోసం తిరిగి రాయగలిగే, ఆధారాలను చెరిపివేయగలిగే(ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ - ఎప్రామ్) మెమొరీకి సంబంధించిన లాజికల్ గేట్ నాన్డ్(ఎన్‌ఏఎన్‌డీ)ని తొలగిస్తారు. లేదంటే.. అందులోని డేటాను చెరిపేస్తారు (జీరో ఫిల్లింగ్). ఇలా చేయడం అనుభవజ్ఞులైన నిపుణులకే సాధ్యం. ల్యాప్‌టాప్ లేదా స్మార్ట్‌ఫోన్‌లోని నాన్డ్‌ను జీరోఫిల్లింగ్ చేస్తే.. డేటా రికవరీ అసాధ్యమే. ఫోరెన్సిక్ నిపుణులు ఎంతటి శక్తిమంతమైన డేటా రికవరీ సాఫ్ట్‌వేర్లను వాడినా.. పాత డేటా తిరిగి రాదు. ఫోన్ లేదా ల్యాప్‌టా్‌పను ధ్వంసం చేసే ముందు జీరో ఫిల్లింగ్‌కు పాల్పడితే.. దర్యాప్తు అధికారులు ఆయా పరికరాలను రికవరీ చేసినా.. వాటిల్లో ఎలాంటి ఆధారాలను సేకరించలేరు.
స్మార్ట్‌ఫోన్ యుగంలో ఏదైనా కొత్త ఫోన్‌ను కొనుగోలు చేసి, దాన్ని వాడాలంటే.. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు జీమెయిల్ లేదా ఆయా స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తి కంపెనీల అకౌంట్‌ను ముందుగా ఎంటర్ చేయాలి. ఆపిల్ ఫోన్లలో ఆపిల్ ఐడీ తప్పనిసరి. కానీ, డమ్మీ అకౌంట్లతో లాగిన్ అయినా.. లాగిన్ ఆప్షన్‌ను స్కిప్ చేసినా.. ప్రత్యామ్నాయ మార్గాల్లోనూ డేటా సేకరణకు దారులు మూసుకుపోయినట్లే..! ఇక ఫోన్‌ను ధ్వంసం చేసే ముందు.. అంతర్జాతీయ మొబైల్ గుర్తింపు సంఖ్య(ఐఎంఈఐ)ను క్లోన్ చేసినా.. డేటా రికవరీ కష్టమే.
అయినా.. ఇలా దొరకబట్టొచ్చు..!
శాస్త్రీయంగా కాకుండా.. నిందితులు సెల్‌ఫోన్లను మామూలుగా ధ్వంసం చేస్తే.. డేటా రికవరీ సులభమేనని సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు. శాస్త్రీయంగా ఫోన్లను ధ్వంసం చేసినా.. వారు మాట్లాడిన లేదా చాటింగ్ చేసిన లేదా ఎస్సెమ్మె్‌సలు పంపిన వ్యక్తుల ఫోన్ల ద్వారా కూడా ఆధారాలను రికవరీ చేయొచ్చంటున్నారు. సెల్‌ఫోన్, ల్యాప్‌టా్‌ప/డె్‌స్కటాప్ ద్వారా ఇంటర్నెట్ వినియోగం వంటి అంశాలపై నిఘా కొనసాగించేందుకు.. భద్రత కారణాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఎన్‌ఐఏ, ఈడీ వంటి పది కీలక దర్యాప్తు సంస్థలకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. ఆయా దర్యాప్తు సంస్థలు దేశ భద్రతలో భాగంగా నిఘాను కొనసాగిస్తాయి.