మునుగోడులో బీజేపీ గెలిస్తే..కేసీఆర్‌ గడీలు బద్దలైనట్లే

ABN , First Publish Date - 2022-08-04T09:22:32+05:30 IST

మునుగోడులో బీజేపీ గెలిస్తే.. కేసీఆర్‌ గడీలు బద్దలైనట్లేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు.

మునుగోడులో బీజేపీ గెలిస్తే..కేసీఆర్‌ గడీలు బద్దలైనట్లే

  • ఉప ఎన్నికలొస్తేనే నిధులు
  • తెలంగాణ కోసం కేసీఆర్‌ ఏం త్యాగం చేశారు?
  • నయీం ఆస్తులు కక్కిస్తాం
  • బస్వాపూర్‌ నిర్వాసితులకు 
  • తీవ్ర అన్యాయం
  • కేసీఆర్‌కు రైతుల ఉసురు తగులుతుంది 
  • చరాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలివ్వలేని దుస్థితి 
  • డూప్‌ ఇంజనీర్‌ అవతారమెత్తిన కేసీఆర్‌
  • కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు
  • ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్‌


యాదాద్రి, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): మునుగోడులో బీజేపీ గెలిస్తే.. కేసీఆర్‌ గడీలు బద్దలైనట్లేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌  అన్నారు. మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రలో రెండో రోజైన బుధవారం ఆయన పాదయాత్ర బస్వాపూర్‌ నుంచి భువనగిరి పట్టణానికి చేరుకుంది. ఇందులో భాగంగా భువనగిరి, అంబేద్కర్‌ చౌరస్తా వద్ద ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. మునుగోడు ఉపఎన్నిక తెలంగాణ భవిష్యత్‌కు సంబంధించిన ఎన్నికని తెలిపారు. ఉపఎన్నిక వస్తే కేసీఆర్‌ నిధులు విడుదల చేస్తున్నారని విమర్శించారు. ‘‘టీఆర్‌ఎ్‌స-కాంగ్రెస్‌ కుమ్మక్కయ్యాయి. ఓటుకునోటు కేసు కొట్టివేయిస్తానని రేవంత్‌రెడ్డికి కేసీఆర్‌ హామీ ఇచ్చారు. 15 నిమిషాలు పోలీసులు మౌనంగా ఉంటే.. నరికి చంపుతామన్న ఒవైసీ కేసును కూడా కేసీఆర్‌ సర్కారు నీరుగార్చింది. తెలంగాణ కోసం శ్రీకాంతాచారి, పోలీసు కిష్టయ్య, సుమన్‌, యాదగిరి లాంటి వారి బలిదానాలకు అర్థం ఏది? కేసీఆర్‌ 10 నిమిషాలు కూడా దీక్ష చేయకుండా ఢిల్లీ పారిపోయాడు. కేసీఆర్‌, ఆయన కుటుంబసభ్యులు ఏం త్యాగం చేశారు? పేదోళ్లు సాధించుకున్న తెలంగాణలో పెద్దోడు రాజ్యమేలుతున్నారు’’ అని సంజయ్‌ దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల దోపిడీ జరిగిందని ఆరోపించారు. నదులకు నడక నేర్పిన కేసీఆర్‌.. మోటార్లకు ఈత నేర్పలేదా? అని ప్రశ్నించారు. ‘‘ కేసీఆర్‌ను ఫామ్‌హౌస్‌ నుంచి ధర్నాచౌక్‌కు రప్పించింది బీజేపీయే. నేను పాదయాత్ర చేస్తుంటే.. చేనేత బీమా ప్రకటించారు’’ అని వ్యాఖ్యానించారు. నయీం బతికున్నప్పుడు ఆయనను పెంచి పోషించిందెవరని, 36 బస్తాల డబ్బు సంచులు ఏమయ్యాయని నిలదీశారు. ‘‘బీజేపీ అధికారంలోకి వచ్చాక.. అవి ఎవరి దగ్గరున్నా కక్కిస్తాం. ఆ నిధులతో భువనగిరిని అభివృద్ధి చేస్తాం’’ అని వెల్లడించారు. 


బస్వాపూర్‌కు అన్యాయం

అంతకు ముందు సంజయ్‌ బస్వాపూర్‌ గ్రామంలో.. నృసింహసాగర్‌ ప్రాజెక్టు ముంపు నిర్వాసితులతో రచ్చబండ నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ సర్కారుపై నిప్పులు చెరిగారు. కేసీఆర్‌కు రైతుల ఉసురు తగులుతుందన్నారు. ‘‘తెలంగాణలో ఎక్కడైనా ఎకరాకు కనీసం రూ.50 లక్షల ధర పలుకుతుందని కేసీఆర్‌ చెబుతున్నారు. మరి హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న బస్వాపూర్‌(నృసింహసాగర్‌) ముంపు నిర్వాసితులకు ఆ మేరకు పరిహారం ఎందుకు ఇవ్వడం లేదు?’’ అని నిలదీశారు. తన సొంత నియోజకవర్గంలోని గౌరవెల్లి ప్రాజెక్టు ముంపు బాధితులు పరిహారం అడిగితే లాఠీచార్జి చేసి, రక్తం కారేట్లు కొట్టారని మండిపడ్డారు. తానే బాధితులకు ఆశ్రయమిచ్చిన విషయాన్ని గుర్తుచేస్తూ.. ఇప్పుడు బస్వాపూర్‌లోనూ అదే పరిస్థితి కనిపిస్తోందన్నారు. ప్రాజెక్టుల్లో కమీషన్ల కోసం శంకర్‌దాదా ఎంబీబీఎస్‌ మాదిరిగా.. సీఎం కేసీఆర్‌ డూప్‌ ఇంజనీర్‌ అవతారమెత్తాడని విమర్శించారు.


 కాళేశ్వరం ప్రాజెక్టుతో ఊళ్లకుఊళ్లు ఎప్పుడు మునుగుతాయో తెలియక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో బడి, గుడి లేని ఊళ్లు ఎన్నో ఉన్నాయని, బెల్ట్‌షాపులు లేని గ్రామాలు మాత్రం లేవని విమర్శించారు. యాదాద్రి పునర్నిర్మాణంపై అంతా సంతోషించామని.. కానీ, కేసీఆర్‌, ఆయన కుటుంబ సభ్యులు గుడి పేరుతో చుట్టుపక్కల భూములను అతి తక్కువ ధరకు కొనుగోలు చేశారని విమర్శించారు. ‘‘ఇంతచేసినా.. వర్షాకాలంలో స్వామి దర్శనానికి వెళ్లాలంటే మోకాలి లోతు నీళ్లను దాటాలి. యాదాద్రి పునర్నిర్మాణంతో ఆటోడ్రైవర్లు, వీధివ్యాపారులు ఉపాధిని కోల్పోయారు. రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలివ్వని పరిస్థితి. పేదల ఇళ్లు కట్టించాలంటూ కేంద్రం నిధులిస్తుంటే.. దాన్ని కేసీఆర్‌ దారిమళ్లిస్తున్నారు’’ అని దుయ్యబట్టారు. అనంతరం ఆయన భువనగిరి శివారులో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను పరిశీలించారు. కాగా, పాదయాత్రలో రెండో రోజు సంజయ్‌ 10.6 కిలోమీటర్లు నడిచారు.


నేటి యాత్ర ఇలా..

ప్రజా సంగ్రామ యాత్రలో మూడో రోజైన గురువారం సంజయ్‌ భువనగిరి మునిసిపాలిటీలోని టీచర్స్‌ కాలనీ నుంచి బీబీనగర్‌ మండలానికి చేరుకుంటారు. మండలంలోని గొల్లగూడెం, మగ్దుంపల్లి, పెద్దపలుగు తండా, చిన్నరావులపల్లి గ్రామాల మీదుగా గుర్రాలదండికి వెళ్తారు.

Read more