కేసీఆర్‌కు ప్రత్యామ్నాయం నేనే
ABN , First Publish Date - 2022-06-28T09:08:13+05:30 IST
కేసీఆర్‌కు రాజకీయ ప్రత్యామ్నాయం తానేనని, రాష్ట్రంలోని ప్రతిపక్షాలన్నీ కేసీఆర్ పంచన చేరాయని...

మంత్రి జగదీ్‌షరెడ్డి ఓ దద్దమ్మ, కేసీఆర్ ఇంటి దగ్గర కాపలా కుక్క
వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల
చివ్వెంల/పెన్‌పహాడ్, జూన్ 27: కేసీఆర్‌కు రాజకీయ ప్రత్యామ్నాయం తానేనని, రాష్ట్రంలోని ప్రతిపక్షాలన్నీ కేసీఆర్ పంచన చేరాయని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. స్థానిక మంత్రి జగదీ్‌షరెడ్డి ఓ దద్దమ్మ అని, కేసీఆర్ ఇంటి దగ్గర కాపలా కుక్కలా మారి అందిన కాడికి దోచుకుంటున్నారని ఆరోపించారు. రైతు రుణమాఫీ చేయలేని సీఎం కేసీఆర్ దద్దమ్మ అని పేర్కొన్నారు. ప్రజాప్రస్థానం పాదయాత్ర 107వ రోజైన సోమవారం షర్మిల 16.5 కి.మీ నడిచారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం తుల్జారావుపేట నుంచి మొదలై పెన్‌పహాడ్ మండలం ధర్మాపురం, మెగ్యాతండా, రత్యాతండ, లాల్‌సింగ్‌తండ, మహ్మదాపురం, జానారెడ్డినగర్, ఇమాంపేట క్రాస్‌రోడ్డు మీదుగా దురాజ్‌పల్లి వరకు నడిచారు. ఇందులో భాగంగా స్థానికులతో మాటాముచ్చట నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్సార్ సంక్షేమ పథకాలు తిరిగి రావాలంటే వైఎస్సార్‌టీపీని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. రాష్ట్రంలో వైఎస్ హయాంలో నిర్మించిన ఇళ్లే ఉన్నాయని, కేసీఆర్ చేసిన అభివృద్ధి శూన్యమని ఆరోపించారు. సరైన ప్రతిపక్షం లేకపోవడంతో కేసీఆర్ రాష్ట్రాన్ని నాశనం చేశారని విమర్శించారు. ఆర్టీసీ చార్జీలు, పన్నులు పెంచి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ సంక్షేమ పాలన ప్రతీ గడపను చేరితే, కేసీఆర్ పథకాలు ప్రతీ కుటుంబాన్ని అప్పుల పాలు చేశాయని అన్నారు. వైఎస్సార్ రైతు పక్షపాతిగా మారితే సీఎం కేసీఆర్ రైతు భక్షపాతిగా మారారని పేర్కొన్నారు. యువతను కేసీఆర్ తాగుబోతులను చేస్తున్నారని, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర కేబినెట్‌ను తుగ్లక్ కేబినెట్ అంటే సరిగ్గా సరిపోతుందన్నారు. ప్రజాప్రస్థానం యాత్రలో షర్మిల ఇప్పటిదాకా 1,451.5 కి.మీ నడిచారు. మంగళవారం యాత్ర దురాజ్‌పల్లి నుంచి మొదలై ఖాసీంపేట, మొదినీపురం, జగ్గుతండా, సంగోనితండా మీదుగా పాండ్యానాయక్‌లో ముగుస్తుంది.