హరిత హారంలో భారీ లక్ష్యం
ABN , First Publish Date - 2022-04-09T07:21:04+05:30 IST
హరిత హారంలో ఈ ఏడాది 20 కోట్లపైగా మొక్కలు నాటడాన్ని
- ఈ ఏడాది 20 కోట్లపైగా మొక్కలు నాటే ఉద్దేశం
హైదరాబాద్, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): హరిత హారంలో ఈ ఏడాది 20 కోట్లపైగా మొక్కలు నాటడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని అధికారులు భావిస్తున్నా ు. ఈ మేరకు వివరాలు అందజేయాలని 15 రోజుల కిందటే జిల్లా అధికారులను అటవీ శాఖ ఆదేశించింది. గత ఏడాది (2021-22) హరిత హారంలో 19.91 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. కానీ, 20.13 మొక్కలను నాటారు. దీంతో ఈసారి లక్ష్యాన్ని మరింత పెంచాలని ఉన్నతాధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం.
భద్రాద్రి ప్రథమం.. 7 జిల్లాల వెనుకంజ
నిరుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా 1.42 కోట్ల మొక్కలు నాటారు. ఏడు జిల్లాలు, హెచ్‌ఎండీఏ మినహాయించి అన్నిచోట్లా 100 శాతం లక్ష్యాన్ని మించారు. ఈసారి వీటిలోనూ లక్ష్యం సాధిస్తూ మరింత మెరుగైన ఫలితం రాబట్టాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఏడేళ్లలో 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుంటే 242 కోట్ల మొక్కలు నాటినట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. తెలంగాణలో 7.70 శాతం పచ్చదనం పెరిగినట్లు పేర్కొంది.
మరో 70 అర్బన్ ఫారెస్టులు
ఈసారి హరితహారంలో అర్బన్ ఫారెస్ట్ పార్కుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించాలని అధికారులు భావిస్తున్నారు. మరో 70 అర్బన్ ఫారెస్ట్ పార్కుల ఏ ర్పాటుకు ప్రణాళికలు రూపొందించారు. తద్వారా 1.77 లక్షల ఎకరాల్లో పచ్చద నం అభివృద్ధికి సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే 109 పార్కుల అభివృద్ధి మొదలుపెట్టగా 59 అందుబాటులోకి వచ్చాయి. మరోవైపు ఈ నెల నుంచి హరిత నిధి సెస్ వసూలు మొదలుపెట్టినందున హరితహారం కార్యక్రమానికి నిధుల కొరత తలెత్తే అవకాశాలు కనిపించడం లేదు. భారీ లక్ష్యాన్ని నిర్ణయించినప్పటికీ అందుకుతగ్గట్లుగా మొక్కలు దొరకడం కీలకం కానుంది. ప్రస్తుతం నర్సరీల్లో పెంచుతున్న మొక్కలు లక్ష్యంలో 55-60 శాతమే ఉంటాయి.