17 రోజుల్లో 25 బిల్లులు ఎలా తీసుకొస్తారు?

ABN , First Publish Date - 2022-12-07T02:50:56+05:30 IST

పార్లమెంటు శీతాకాల సమావేశాలు 17 రోజుల పాటు జరగనుండగా... అంత తక్కువ వ్యవధిలో 25 బిల్లులు ఎలా తీసుకొస్తారని టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

17 రోజుల్లో 25 బిల్లులు ఎలా తీసుకొస్తారు?

కేంద్రం ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకెళ్లడం లేదు

టీఆర్‌ఎస్‌ ఎంపీ కె.కేశవరావు విమర్శ

న్యూఢిల్లీ, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): పార్లమెంటు శీతాకాల సమావేశాలు 17 రోజుల పాటు జరగనుండగా... అంత తక్కువ వ్యవధిలో 25 బిల్లులు ఎలా తీసుకొస్తారని టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్రం మంగళవారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఢిల్లీలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. అఖిలపక్షంలో పలు అంశాలను ప్రస్తావించానని,. పార్లమెంటులో ప్రజల సమస్యలపై చర్చ జరగాలని కోరినట్లు తెలిపారు. కేంద్రం ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుకు వెళ్లడం లేదన్నారు. అధికారంలోకి ఎవరు వచ్చినా కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ఆ సంస్థల దాడులపై పార్లమెంటులో అందర్నీ కలుపుకుని ఆందోళన చేస్తామన్నారు. బొగ్గు దిగుమతులపై కేంద్రం ఆంక్షలను ఎత్తివేయాలని కోరారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై చర్చ జరగాలని ఆకాంక్షించారు. పంటలకు కనీస మద్దతు ధరపై చర్చించి చట్టం తీసుకురావాలన్నారు. అధికారం కోసం బీజేపీ 14 రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాలను పడగొట్టిందన్నారు. ఈ వ్యవహారంలో దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ బాధితులుగా మారాయన్నారు. చట్టసభలు, కోర్టుల మధ్య వివాదాలు మంచిది కాదన్నారు. జీ-20 దేశాలకు భారత్‌ అధ్యక్షత వహించడం పెద్ద గొప్పేమీ కాదని, అది మోదీ ఘనత కూడా కాదన్నారు.

Updated Date - 2022-12-07T02:50:57+05:30 IST