అవమానించి.. ఎలా వస్తున్నారు?

ABN , First Publish Date - 2022-07-01T08:40:56+05:30 IST

గతంలో తెలంగాణ ప్రజలను అవమానించిన నరేంద్ర మోదీ.. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని వస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

అవమానించి.. ఎలా వస్తున్నారు?

  • రాష్ట్ర ప్రజలకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలి..
  • కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఉన్నా ఉపయోగం లేదు
  • అమలుకు నోచుకోని విభజన హామీలు 
  • 8 ఏళ్లలో చిల్లిగవ్వ ఇవ్వలేదు: రేవంత్‌
  • యశ్వంత్‌సిన్హా సీఎంని కలిస్తే కాంగ్రెస్‌ 
  • ప్రజాప్రతినిధులు కలవబోరని స్పష్టీకరణ


హైదరాబాద్‌, జూన్‌ 30(ఆంధ్రజ్యోతి): గతంలో తెలంగాణ ప్రజలను అవమానించిన నరేంద్ర మోదీ.. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని వస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. తల్లిని చంపి పిల్లను ఇచ్చారంటూ దుర్మార్గంగా మాట్లాడిన మోదీ.. ముందుగా రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. గురువారం సాయంత్రం రేవంత్‌ విలేకరులతో మాట్లాడుతూ సాధారణంగా అధికారంలో ఉన్న రాష్ట్రంలో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తారని, కానీ.. బీజేపీ తెలంగాణను ఎందుకు ఎంచుకుందో ప్రజలకు అర్థం కావడం లేదని అన్నారు. గతంలో కాకినాడ సమావేశాల్లో ‘ఒక ఓటు-రెండు రాష్ర్టాలు’ అని తీర్మానం చేస్తే ఉమ్మడి ఏపీ ప్రజలు ఏడు పార్లమెంట్‌ స్థానాలను అప్పగించారని గుర్తు చేశారు. కానీ, ఉత్తరాదిన మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసిన బీజేపీ.. తెలంగాణ ఇవ్వకుండా ప్రజలను మోసం చేసిందని దుయ్యబట్టారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా మాట మీద నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. కానీ, తెలంగాణ రాష్ట్రాన్ని గుర్తించడానికి కూడా మోదీ ఇష్టపడడం లేదని విమర్శించారు. బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, ఎన్టీపీసీలో 4 వేల మెగావాట్ల విద్యుత్‌, ఐటీఐఆర్‌, సాగు నీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి చట్టబద్ధ హామీలను నెరవేర్చడం లేదని దుయ్యబట్టారు. 


రైతుల ఆదాయం రెట్టింపు, ఏటా 2 కోట్ల ఉద్యోగాల భర్తీ,  పేదల ఖాతాలో 15 లక్షల జమ చేస్తామన్న ఎన్నికల హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఎనిమిదేళ్లలో  తెలంగాణకు చిల్లిగవ్వ ఇవ్వలేదని, తెలంగాణ నుంచి కేంద్ర మంతి ఉన్నా ఉపయోగం లేదని విమర్శించారు. నిధుల కేటాయింపులో కానీ, మంత్రి పదవుల్లో కానీ.. దక్షిణాది రాష్ట్రాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. విభజన చట్టం లోని అంశాలపై చర్చ పెట్టాలని, లేదంటే బండి సంజయ్‌, కిషన్‌రెడ్డి అమరవీరుల స్థూపం దగ్గర ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎనిమిదేళ్లుగా మోదీకి కాపాలా కుక్కగా ఉంటూ ఇప్పుడు ఫ్లెక్సీల చిల్లర పంచాయతీ ఎందుకని టీఆర్‌ఎ్‌సను ఉద్దేశించి రేవంత్‌ ప్రశ్నించారు. అగ్నిపథ్‌పై టీఆర్‌ఎస్‌ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని, ఆ విధానానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో  తీర్మానం చేయాలని సూచించారు. కాగా, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తనకు మిత్రుడని, ఆయన పార్టీ మారితే తనకు చెప్తాడని అనుకుంటున్నాని రేవంత్‌ పేర్కొన్నారు. బీజేపీలో విశ్వేశ్వర్‌రెడ్డి చేరుతున్నట్లుగా వచ్చిన వార్తలపై స్పందిస్తూ.. ఆ పార్టీలో చేరినా కొంతకాలానికే ఆయన సొంతగూటికి వస్తారని తెలిపారు.


కేసీఆర్‌ను యశ్వంత్‌ కలిస్తే.. మేము కలవబోం!

రాష్ట్రపతి ఎన్నికలో విపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న యశ్వంత్‌సిన్హా హైదరాబాద్‌ పర్యటనలో భాగంగా టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తో భేటీ అయితే, కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు ఆయన్ను కలవబోరని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. తమను కలిసిన తర్వాత  టీఆర్‌ఎస్‌ వాళ్లను కలవాలని చూసినా, కేసీఆర్‌ను  కలిసిన తర్వాత తమను సంప్రదించాలని ప్రయత్నించినా తాము ఒప్పుకోబోమని తేల్చిచెప్పారు. ‘ఆ ఇంటి కాకి ఈ ఇంటి మీద వాలేది లేదు’ అని తాము ముందే చెప్పామని గుర్తు చేశారు. యశ్వంత్‌ సిన్హా కాంగ్రెస్‌ అభ్యర్థి కాదని, తృణమూల్‌ అధినేత మమత బెనర్జీ మద్దతు అడిగితే ఇచ్చామని వెల్లడించారు.

Updated Date - 2022-07-01T08:40:56+05:30 IST