హస్తం నేతల హౌస్ అరెస్ట్
ABN , First Publish Date - 2022-12-15T02:50:51+05:30 IST
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కాంగ్రెస్ ముఖ్య నేతలను బుధవారం ఎక్కడికక్కడే హౌస్ అరెస్టులు చేశారు. ఇళ్ల నుంచి బయటకు రాకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.
కమిషనరేట్‌కు రాకుండా కట్టడి
గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత
కమాండ్ కంట్రోల్ వద్ద బందోబస్తు
హైదరాబాద్ సిటీ/బంజారహిల్స్/హైదరాబాద్, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కాంగ్రెస్ ముఖ్య నేతలను బుధవారం ఎక్కడికక్కడే హౌస్ అరెస్టులు చేశారు. ఇళ్ల నుంచి బయటకు రాకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయాన్ని పోలీసులు సీజ్ చేసి సిబ్బందిని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ నగర పోలీసు కమిషనరేట్ ఎదుట ఆందోళనకు టీపీసీసీ పిలుపునిచ్చిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో పోలీసులు కాంగ్రెస్ నేతల ఇళ్ల వద్ద బుధవారం తెల్లవారుజాము నుంచే పికెటింగ్ ఏర్పాటు చేశారు. గాంధీభవన్, పోలీసు కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద పోలీసులను మోహరించారు. ఎక్కడిక్కడే కట్టడి చేయడంతో కాంగ్రెస్ నేతలుఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో ఉన్న పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రగతిభవన్ ముట్టడికి పిలుపునివ్వడంతో ఉద్రిక్తత నెలకొన్నది. కాంగ్రెస్ సీనియర్ నేతలు షబ్బీర్ అలీ, అంజన్‌కుమార్ యాదవ్, మల్లు రవి, హరివర్ధన్‌రెడ్డి, సింగిరెడ్డి రోహిన్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్ తదితర నేతల ఇళ్ల వద్ద ఉదయం నుంచి పోలీసులు పికెటింగ్ నిర్వహించారు. దీంతో ఇళ్లలోనే నేతలు నిరసనకు దిగారు. ఆ తర్వాత హౌస్ అరెస్టు చేసిన నేతలను బంజారాహిల్స్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. బంజారహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ రూం ముట్టడికి యత్నించిన కార్పొరేటర్ పి. విజయారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అంతకుముందు ఆమె పోలీసుల కళ్లు కప్పి కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి కమాండ్ కంట్రోల్ రూం వద్దకు వచ్చారు. లోపలికి దూసుకువెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు గాంధీభవన్‌కు చేరుకోగా, వారందరినీ లోపలికి పంపి బయటకు రానివ్వకుండా పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. దీంతో గాంధీభవన్ ఎదుట టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, చెరుకు సుధాకర్, ఎర్రవత్ అనిల్, ప్రీతం, చలమల్ల కృష్ణారెడ్డి తదితర నేతలు నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను బయటకు రానివ్వకుండా అడ్డుకోవడంతో అప్పటికప్పుడు ప్రగతిభవన్‌ను ముట్టడించేందుకు బయలుదేరారు. గాంధీభవన్ గేట్లను, బారికేడ్లను దాటుకొని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు బయటకు వచ్చారు. దాంతో వారిని పోలీసులు అడ్డుకోగా ఉద్రిక్తత నెలకొన్నది. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను బలవంతంగా అరెస్టు చేసి వివిధ పోలీసుస్టేషన్లకు తరలించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
హైకోర్టును ఆశ్రయిస్తాం: జగ్గారెడ్డి
కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్‌ను సీజ్ చేసి, తమ వారిని అరెస్టు చేసి ఇప్పుడు నోటీసు ఇవ్వడమేమిటని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. పోలీసుల తీరు, నోటీసులపై న్యాయపరంగా హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. గాంధీభవన్ నుంచి కాంగ్రెస్ నేతలు జగ్గారెడ్డి, మహే్‌షకుమార్ గౌడ్, మల్‌రెడ్డి రాంరెడ్డి, రాంచంద్రారెడ్డి తదితర నేతలు పోలీసుల తీరుపై ఫిర్యాదు చేయడానికి డీజీపీ కార్యాలయానికి వెళ్లారు. డీజీపీ అందుబాటులో లేకపోవడంతో కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద సీపీ సీవీ ఆనంద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహే్‌షకుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కవిత, సీఎం కేసీఆర్‌ల మీద తాము పోస్టులు చేసినప్పటికీ అందులో అసభ్యత ఉండదని, ప్రభుత్వ అవినీతిపై పోస్టు చేసే హక్కు తమకుందని తెలిపారు.
పోలీసుల దాడి సరికాదు: భట్టి
కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయంపై పోలీసులు దాడి చేయడం అప్రజాస్వామికమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బహిరంగ సమావేశాలు, మీడియా, సోషల్ మీడియా ఇలా ఏ వ్యవస్థనైన స్వేచ్ఛగా వాడుకోనివ్వాలన్నారు. ఈ వ్యవస్థలను కట్టడి చేయాలనుకోవడం రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను కట్టడి చేసినట్టుగానే పరిగణించాల్సి వస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని చెప్పడానికి సునీల్ కార్యాలయంపై పోలీసుల దాడి ఘటనే నిదర్శనమని టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి విమర్శించారు.
వార్‌రూం ఉద్యోగులను తీసుకెళ్లడంపై.. హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్
మాదాపూర్‌లోని కాంగ్రె్‌సకు చెందిన వార్‌రూంలో ఉన్న ఉద్యోగులను సైబర్ క్రైం పోలీసులు తీసుకెళ్లడంపై కాంగ్రెస్ హైకోర్టును ఆశ్రయించింది. పార్టీ నేత మల్లు రవి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఇషాన్ శర్మ, తాతినేని శశాంక్, మండ ప్రతా్‌పలను పోలీసులు అక్రమంగా తీసుకెళ్లినట్లు పిటిషనర్ ఆరోపించారు. కాంగ్రెస్ రాజకీయ కార్యక్రమాలు, సర్వేలు, ఎన్నికల ప్రచారం కోసం ఏర్పాటు చేసుకున్న ఉద్యోగులను పోలీసులు నిర్బంధించడం సరికాదన్నారు. ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని న్యాయవాదులు కోరడంతో గురువారం విచారణ చేపట్టేందుకు హైకోర్టు అంగీకరించింది. కాగా, కాంగ్రెస్ వార్ రూంపై పోలీసులు దాడి చేసి కంప్యూటర్లు, సమాచారాన్ని దొంగిలించడం పెద్ద సైబర్ నేరమని మల్లు రవి ఆరోపించారు.